మంగళవారం 31 మార్చి 2020
Adilabad - Jan 18, 2020 , 01:05:03

సమస్యాత్మక కేంద్రాలపై నిఘా

సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
  • -బల్దియా పరిధిలో 44 కేంద్రాల గుర్తింపు
  • -ఓటింగ్‌ సరళి పరిశీలనకు వెబ్‌కాస్టింగ్‌ కెమెరాలు
  • -నిర్వహణకు బ్యాంకు అధికారుల నియామకం
  • -పీఎస్‌ల వద్ద భారీ బందోబస్తు


మున్సిపల్‌ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. పట్టణంలో 49 వార్డులు ఉండగా 183 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 21 సమస్యాత్మక, 23 అతి సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్‌ పోలింగ్‌ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం బ్యాంకు అధికారుల సేవలు వినియోగించుకోనున్నారు.
- ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘంతోపాటు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నది. పోలింగ్‌ సమయం సమీపిస్తుండడంతో పూర్తి స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భారీ బందోబస్తుతోపాటు పోలింగ్‌ సరళిపై నిఘా పెట్టనున్నారు. ఇందులో భాగంగానే బల్దియా పరిధిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు.  ఈ పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల అధికారులతో పాటు కలెక్టర్‌ పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహణకు బ్యాంకు అధికారుల సేవలను వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.

44 సమస్యాత్మక కేంద్రాలు

బల్దియా పరిధిలో 49 వార్డులు ఉండగా.. మొత్తం 183 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 21 సమస్యాత్మక, 23 అతి సమస్యాత్మకంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా 139 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సర్వే చేపట్టి నిర్ధారించారు. బల్దియా పరిధిలో 1.27 లక్షల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎన్నికల సంఘం, అధికార యంత్రాగం ముందస్తు చర్యలను చేపట్టింది. ఇప్పటికే గుర్తించిన సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో పాటు పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వెబ్‌కాస్ట్‌ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే అధికారులు సీసీ కెమెరాలను కొనుగోలు చేశారు. 23 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంతోపాటు కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని తెలుసుకోనున్నారు.

23 పీఎస్‌ల వద్ద భారీ బందోబస్తు

2014 ఎన్నికల్లో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. విలీన గ్రామాలతో పాటు ప్రస్తుతం బల్దియా పరిధిలో 49 వార్డులు ఉన్నాయి. ఓటర్లకు అందుబాటులో 183 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత పరిణామాలను దృష్ట్యా బల్దియా, రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టణంలో పర్యటించారు. 21 పోలింగ్‌ కేంద్రాలు సస్యాత్మకం, 23 పోలింగ్‌ కేంద్రాలు అతి సమస్యాత్మకంగా గుర్తించి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. అతి సమస్యాత్మక పీఎస్‌ల వద్ద నలుగురు స్పెషల్‌ పార్టీ పోలీసులను నియమిస్తున్నారు. సమస్యాత్మక పీఎస్‌ల వద్ద ముగ్గురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మిగతా కేంద్రాల వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పిస్తున్నారు. సమస్యాత్మక, 44 లోకేషన్లలో మొబైల్‌ టీంల ద్వారా పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు.logo
>>>>>>