సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 14, 2020 , 00:29:40

బరిలో నిలిచేదెవరో..?

బరిలో నిలిచేదెవరో..?


ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బల్దియా ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు చివరి గడువు ఉంది. జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేరోజు నాలుగు గంటలకు ఆయా పార్టీల బీఫాంలు ఉన్న వారికి పార్టీల గుర్తులు కేటాయించనుండగా.. స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఆల్ఫాబెటికల్‌ ప్రకారం గుర్తులను కేటాయించనున్నారు. 15 నుంచి ప్రచారం ప్రారంభంకానున్నది. ఆయా పార్టీల నుంచి 5 నుంచి 10 మంది నామినేషన్లు వేయగా.. అందులో ఒక్కరికి మాత్రమే బీ ఫాం ఇచ్చారు. మిగతా ఆశావహులను ఉపసంహరించు కోవాలంటూ పార్టీల నేతలు బుజ్జగించే పనిలో పడ్డారు.

మూడు గంటల వరకే గడువు

బల్దియా ఎన్నిలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాత మున్సిపాలిటీ పరిధితోపాటు కొత్తగా విలీనమైన గ్రామాలను కలుపుకొని 49 వార్డులుగా అధికారులు విభజించారు. ఈ వార్డుల పరిధిలో 8 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 10న ముగిసింది. 11న స్క్రూటినీ చేయగా.. నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో ఇద్దరు వయస్సు లేకపోవడం, ఒకరు గత ఎన్నికల్లో ఖర్చులు అందజేయకపోవడం, మరొకరు అభ్యర్థిని బలపర్చిన ఓటరు ఆ వార్డులో లేక పోవడంతో తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. వీరికి అప్పీల్‌కు 12, 13 వరకు గడువు ఇచ్చారు. 398 నామినేషన్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 12న ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. 14న ఉపసంహరణకు చివరి గడువు ఉండగా, పెద్ద ఎత్తున అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశముంది. దీంతో అధికారులు టీటీడీసీలో ఏర్పాట్లను పూర్తి చేశారు. వార్డుల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉపసంహరించుకునే అభ్యర్థులు రాత పూర్వకంగా ఇస్తే జాబితా నుంచి తొలగించనున్నారు. ఎన్నికల తర్వాత ఉపసంహరించుకున్న అభ్యర్థుల నామినేషన్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, జనరల్‌ అభ్యర్థులకు రూ.2,500 తిరిగి ఇవ్వనున్నారు.

15 నుంచి ప్రచారం

మున్సిపల్‌ పరిధిలోని 49 వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 20కిపైగా నామినేషన్లు వేశారు. స్కృటినీ తర్వాత 398 నామినేషన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఆయా పార్టీల నుంచి ఒక్కరికి మాత్రమే బీఫాం ఇచ్చారు. ప్రతి వార్డు నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చాయి. 14న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు కాగా, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు టికెట్‌ వస్తుందని ఆశపడి నామినేషన్‌ వేశారు. వారిని ఉపసంహరించుకోవాలంటూ నాయకులు బుజ్జగిస్తున్నారు. ఎంత మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారో వేచిచూడాల్సిందే. అయితే మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు మధ్యాహ్నం మూడు గంటల వరకు చివరిగడువు ఉండగా.. నాలుగు గంటల తర్వాత బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తూ గుర్తులను కేటాయిస్తారు. బుధవారం నుంచి ప్రచారం ప్రారంభం కానుండగా, అభ్యర్థులు తమ మేనిఫెస్టోను తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ కొన్ని వార్డుల్లో తమ ప్రచారాన్ని ప్రారంభించారు.


logo