శనివారం 04 ఏప్రిల్ 2020
Adilabad - Jan 14, 2020 , 00:28:47

మూగ రోదన

మూగ రోదన


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని పలు రహదారుల మీదుగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. జాతీయ రహదారితో పాటు వివిధ రోడ్డు మార్గాల్లో మూగజీవులను వాహనాల్లో కుక్కి తరలిస్తున్నారు. కొందరు దళారులు మహారాష్ర్టాలోని వివిధ ప్రాంతాల నుంచి పశువులను అక్రమంగా తరలిస్తున్నారు. జిల్లాలో సైతం కొందరు దళారులు వీరికి సహకారం అందిస్తున్నారు. మూగజీవాల రక్షణ కోసం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకున్నా పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. కిక్కిరిసిన వాహనాల్లో ఆవులు, ఎద్దులు, లేగదూడలు, బర్రెలను తాళ్లతో బంధించిన కబేళాలకు తరలిస్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు పలు మార్గాల గుండా ఈ అక్రమ దందా కొనసాగుతున్నది.

మహారాష్ట్ర నుంచి రవాణా

మూగజీవాల రవాణాలో దళారులు నిబంధనలు విస్మరిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, నాందేడ్‌, కిన్వట్‌, చంద్రాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా రోజూ వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాల తరలింపు కొనసాగుతున్నది. జిల్లా జాతీయ రహదారితో పాటు పలు మార్గాల ద్వారా అక్రమార్కులు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని కబేళాలకు మూగజీవాలను తీసుకుపోతున్నారు. నాగ్‌పూర్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా, చంద్రాపూర్‌ కాగజ్‌నగర్‌ ఉట్నూర్‌ మీదుగా, నాందేడ్‌ నుంచి బజార్‌హత్నూర్‌ మండలం ఘన్‌పూర్‌ చెక్‌పోస్టు నుంచి, కిన్వట్‌ నుంచి లక్ష్మీపూర్‌ చెక్‌పోస్టు మీదుగా పశువుల అక్రమ రావాణా కొనసాగుతున్నది. లారీలు, వ్యాన్‌లు, ట్రక్కులతో పాటు ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో పరిమితికి మించి వీటిని తీసుకుపోతున్నారు. ఒక్కో వాహనంలో 15 నుంచి 20 పశువులను కింద పడవేసి తాళ్లతో కట్టి తీసుకుపోతారు. ఈ అక్రమ రావాణా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. జిల్లాలోని పలు రహదారుల మీదుగా ఈ తతంగం జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ రావాణాకు పాల్పడుతున్న డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడుపుతుండడంతో ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

వాహనాల్లో కుక్కి రవాణా

జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుతోపాటు జైనథ్‌, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోత్‌, ఉట్నూర్‌ ప్రాంతాల్లో పశువుల సంత జరుగుతుంది. ఈ సంతల్లో రైతులు, పశుపోషకులు మాత్రమే తమ అవసరాల నిమిత్తం ఆవులు, బర్రెలు, ఎద్దులు, దూడలను విక్రయించేందుకు తీసుకురావాల్సి ఉంటుంది. రైతులు, పశుపోషకులు లేగ దూడలు, వయస్సు పైబడిన పశువులు, ఆవులను విక్రయించాలనుకుంటే వాటిని జంతు వధశాలకు అమ్మబోమని అధికారులకు సమాచారం ఇవ్వాలి. పేరు, చిరునామా, ఫొటో, ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ, పశువైద్యాధికారులకు, సంత నిర్వహణ కమిటీకి అప్పగించాలి. కానీ జిల్లాలో జరిగే వివిధ సంతల్లో ఇలాంటివి అమలు కాకపోగా రైతులకు బదులు వ్యాపారులు, దళారులు పశువుల క్రయవిక్రయాలను జరుపుతున్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌లో వ్యవసాయ మార్కెట్‌ ముందు ఉన్న మార్కెట్‌యార్డు ఖాళీ ప్రాంతం వ్యాపారులు, దళారులకు అడ్డాగా మారింది. మహారాష్ట్రతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు వాహనాల్లో పశువులను తీసుకువస్తున్నారు. పక్కరాష్ట్రలోని యావత్మల్‌, కిన్వట్‌, చంద్రాపూర్‌, మాడ్వి ప్రాంతాల నుంచి లారీ, వ్యాన్‌లలో ఎద్దులు, ఆవులు, లేగ దూడలు, బర్రెలను ఒక్కో దాంట్లో 20 వరకు రవాణా చేస్తున్నారు. మూగజీవాలను వాహనాల్లో కుక్కి, పడుకోబెట్టి పైన టార్పాలిన్‌ కవర్లు కప్పి వందల కిలోమీటర్లు దూరం నుంచి ఇష్టానుసారంగా తరలిస్తుండడంతో పశువులు ఊపిరాడక, గాయాల బారిన పడి మరణిస్తున్నాయి.

కొరవడిన నిఘా

పశువుల రవాణా, క్రయవిక్రయాలపై కేంద్రం పలు నిబంధనలు విధించింది. సంతల్లోని విక్రయానికి ఎన్ని పశువులు, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయన్న విషయాలను రికార్డుల్లో రాయాలి. పశువైద్యాధికారులు అందులోని ఆరోగ్యకరమైన పశువులను పరీక్షించి వాటి విక్రయాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకునేలా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. ఆవులు, లేగదూడలను విక్రయాలకు తీసుకురావద్దు. కానీ ఎక్కడా కనీస నిబంధనలు అమలు కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు, దళారులు సంతలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. రాత్రి సమయంలో పశువులను గోవధశాలలకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పశువుల క్రయవిక్రయాలు జరిగే ప్రాంతాల్లో ఒక్క అధికారి అందుబాటులో ఉండడం లేదు. సంతకు సంబంధించిన రికార్డులు సైతం అందుబాటులో ఉండడం లేదు.


logo