సోమవారం 06 ఏప్రిల్ 2020
Adilabad - Jan 14, 2020 , 00:27:03

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి రూ.30 లక్షల ఆదాయం

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి రూ.30 లక్షల ఆదాయం


ఆదిలాబాద్‌ అర్బన్‌ / నమస్తే తెలంగాణ : మున్సిపల్‌ ఎన్నికలు బల్దియాకు ఆదాయాన్ని సమకూర్చాయి. ఎన్నికల పుణ్యమా అని పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ బకాయిలు చెల్లించారు. పోటీలో నిలిచే అభ్యర్థులు తమ ఆస్తి పన్ను, నీటి పన్ను, నామినేషన్‌ పత్రాల రుసుం చెల్లించాలని నిబంధనలు ఉండగా బల్దియాకు కలిసి వచ్చింది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించని వారు సైతం తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించాల్సి వచ్చింది.

బల్దియాకు రూ.30 లక్షల ఆదాయం ..

ఆస్తి, ఇతర పన్నులు మొత్తం కలిపి బల్దియాకు 2019-20కి గాను రూ.5.25 కోట్ల టార్గెట్‌ ఉంది. కాగా.. డిసెంబర్‌లోనే ఆస్తి, నల్ల, వివిధ రకాల పన్నులు 50 శాతం వసూలు చేశారు. మొండి బకాయిలు కొంత కాలంగా వసూలు కావడంలేదు. ఎన్నికల పుణ్నమా అని పోటీ చేసే అభ్యర్థులు తమ ఇంటి, నల్ల, ఇతర పన్నులను చెల్లించారు. బల్దియా పరిధిలో మొత్తం 49 వార్డులు ఉండగా.. 386 మంది అభ్యర్థులు తమ తమ వార్డుల్లో కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి నామినేషన్‌లు వేశారు. ఇంటి పన్ను ద్వారా రూ.13.23 లక్షలు రాగా, నీటి పన్ను రూ.10.03 లక్షలు, నామినేషన్ల ద్వారా రూ.6.27 లక్షల ఆదాయం, దరఖాస్తు ఫీజు రూ.1.54 లక్షలు మొత్తం రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.

55 శాతానికి చేరుకున్న ఆస్తి పన్ను వసూళ్లు

పన్నుల వసూళ్లకు బల్దియా అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి మొండి బకాయిదారులకు ముందుగా డిమాండ్‌ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత చెల్లించని పక్షంలో రెడ్‌ నోటీసులను అందజేస్తారు. బకాయిదారుల ఇంటి ముందు డప్పు చాటింపు వేస్తారు. ఇలా మార్చి నుంచి మార్చి వరకు అధికారులు పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్‌ డ్రైవ్‌లను చేపడుతారు. 2019-20 ఆర్థిక సంవత్సరం టార్గెట్‌ రూ.5.25 కోట్లు ఉండగా.. డిసెంబర్‌ వరకు 50 శాతం పన్నులు వసూలు చేశారు. ప్రస్తుత ఎన్నికలు బల్దియాకు కలిసివచ్చాయి. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు తమ ఇంటి, నీటి పన్నులు చెల్లించగా ఆస్తి పన్ను ద్వారా రూ.13.23 లక్షల ఆదాయం సమకూరగా.. 55 శాతానికి చేరుకుంది. ఇంకా ఆర్థిక సంవత్సరానికి గడువు మూడు నెలలు ఉండగా, గడువులోగా వంద శాతం వసూలు చేస్తామని బల్దియా అధికారులు పేర్కొంటున్నారు.logo