ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Jan 13, 2020 , 01:05:40

పల్లె ప్రగతి విజయవంతం

పల్లె ప్రగతి విజయవంతం


ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని 17 మండలాల్లో రెండో విడత పల్లె ప్రగతి జనవరి 2 నుంచి ప్రారంభమైంది. పది రోజులపాటు ఉద్యమంలా కొనసాగిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములయ్యారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికుల భాగస్వామంతో పదిరోజులపాటు గ్రామాల్లో పలు పనులను చేపట్టారు. మొదటి విడత పల్లె ప్రగతి స్పూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగారు. స్థానికులు సైతం తామ గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం నెలకునేందుకు సహకారం అందించారు. ఈ కార్యక్రమ నిర్వహణతో పది రోజులపాటు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొనగా కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయి. కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ పల్లె ప్రగతి పనులను పర్యవేక్షించారు. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా కార్యక్రమ వివరాలను తెలుసుకుంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. అధికారులు గ్రామాల్లో గ్రామసభలు, పాదయాత్రల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించగా, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల వినియోగం, శ్మశాన వాటికలు, డంపింగ్‌యార్డులు, కంపోస్ట్‌షెడ్‌ వంటి అంశాలకు ప్రాధాన్యం కల్పించారు. మొత్తానికి జిల్లాలో పది రోజుల పాటు జరిగిన రెండో విడత పల్లె ప్రగతి అందరి భాగస్వామ్యంతో విజయవంతమైంది.

చేపట్టిన పనులు

జిల్లా వ్యాప్తంగా 467 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించగా 19,021 మంది స్థానికులు హాజరయ్యారు. అన్ని పంచాయతీల పరిధిలో ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి పాదయాత్రలు చేపట్టగా 15,352 మంది పాల్గొన్నారు. గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్న 1032.29 కిలో మీటర్ల మేర రహదారిని శుభ్రం చేశారు. అన్ని పంచాయతీల్లోని 1044.55 కిలోమీటర్ల మురికికాల్వల్లోని చెత్త, చెదారాన్ని తొలగించారు. 1,415 ప్రాంతాల్లోని పెంటకుప్పులను తీసివేశారు. 3016 చోట్ల సర్కారు తుమ్ములు, పిచ్చిమొక్కలను తొలగించగా అపరిశుభ్రంగా ఉన్న 1095 ఖాళీ స్థలాలను శుభ్రపర్చారు. గ్రామాల్లో పనికిరాని 78 బావులను పూడ్చివేయగా 60 బోరుబావులను తీసివేశారు. వీటితో పాటు గ్రామాల్లోని నీరు నిలిచే 800 స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు. 1295 చోట్ల రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చివేశారు. 2309 ప్రభుత్వ, ఇతర భవనాలను శుభ్రం చేయగా, 25 అంగడ్లు, 18 కూరగాయల మార్కెట్‌లను శుభ్రం చేశారు. విద్యుత్‌ వృథాను అరికట్టడానికి విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో 301 గ్రామాల్లోని 1203 చోట్ల మూడో వైరును లాగి ఆన్‌, ఆఫ్‌ స్వీచ్‌ను ఏర్పాటు చేయగా ప్రమాద స్థితిలో ఉన్న 61 విద్యుత్‌ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని 95,623 ఇండ్లలో రోజూ చెత్తను సేకరించేలా చర్యలు తీసుకున్నారు. 413 పంచాయతీల పరిధిలో గ్రామాల్లో మొక్కలు నాటగా 377 గ్రామ పంచాయతీల్లో నర్సరీల పెంపకం చేపట్టారు. 419 గ్రామాల్లో వ్మశాన వాటికలకు స్థలాలు గుర్తించగా పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు 435 పంచాయతీల్లో డంపింగ్‌యార్డులు, కంపోస్ట్‌ షెడ్‌ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.logo