బుధవారం 08 ఏప్రిల్ 2020
Adilabad - Jan 13, 2020 , 01:04:59

విలీన ప్రాంతాల నుంచి భారీగా నామినేషన్లు

విలీన ప్రాంతాల నుంచి భారీగా నామినేషన్లు


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి.; ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌లు నామినేషన్లు వేశారు. గతంలో మున్సిపల్‌ పరిధిలో వార్డులు సంఖ్య 36 ఉండగా పునర్విభజనలో భాగంగా ఈ సంఖ్య 49కి చేరింది. గతంలో ఆదిలాబా ద్‌ రూరల్‌, మావల మండలాల్లోని పలు గ్రామాలు మున్సిపల్‌ పరిధిలోకి వచ్చాయి. దీంతో గతంలో గ్రామాపంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా పోటీ చేసిన వారు ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో పలు వార్డుల్లో నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో దాఖలయ్యాయి.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి ఈ సారి జరిగే ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం మున్సిపల్‌ పరిధిలో మొత్తం 1,27,801 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు, 63,057 మంది, మహిళలు 64,738 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. మున్సిపాలిటీలో ఎస్టీ ఓటర్లు 5380 మంది ఉండగా వీరిలో పురుషులు 2629 మంది, మహిళలు 2751 మంది, ఎస్సీ ఓటర్లు 16,833 మంది ఉండగా పురుషులు 8144 మంది, మహిళలు 8689 మంది, బీసీ ఓటర్లు 72,095 మంది ఉండగా పురుషులు 35,617 మంది, మహిళలు 36,476 మంది, ఇతర కులాలకు చెందిన ఓటర్లు 33,493 మంది ఉండగా వీరిలో పురుషులు 16,667, మహిళలు 16,822 మంది ఉన్నారు. క్రితం సారి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్‌ పరిధిలో వార్డుల సంఖ్య 36 ఉండగా పునర్విభజనలో భాగంగా ఈ సంఖ్య 49కి పెరిగింది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంతో పాటు మావల మండలంలోని పలు గ్రామాలు మున్సిపల్‌ పరిధిలోకి వచ్చాయి. దీంతో గతంలో కన్నా ఈ సారి ఓటర్లు సంఖ్య సైతం గణనీయంగా పెరిగింది. త్వరలో ఎన్నికలు జరిగే వార్డులకు నిబంధనల ప్రకారం 50 శాతం మహిళలకు, ఆయా వార్డుల్లో ఓటర్ల జనాభా ఆధారంగా పలు వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు.

విలీన ప్రాంతాల నుంచి ఎక్కువ నామినేషన్లు
వార్డుల రిజర్వేషన్ల అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పలు వార్డుల నుంచి ఆశావహులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌లో తమ వార్డుల్లో వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా నామినేషన్లు వేశారు. రిజర్వేషన్లు అనుకూలించని వారు తమ కుటుంబసభ్యులను పోటీలో నిలిపారు. ప్రధానంగా విలీన గ్రామాల నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. గతంలో మావల మండలం నుంచి 7 వార్డు, ఆఫ్‌ కేఆర్‌కే కాలనీ 23 మంది నామినేన్లు వేయగా, 11 వార్డు రాంనగర్‌ నుంచి 13 మంది, 9 వార్డు దుర్గానగర్‌ నుంచి 19 అభ్యర్థులు, గతంలో ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో ఉన్న అనుకుంట 4 వార్డు నుంచి 14 నామినేషన్లు, వార్డునంబర్‌ 3 బెల్లూరి, సీసీఐ కాలనీ 8 మంది నామినేషన్లు వేశారు. గతంలో పంచాయతీలో ఉండగా తమకు ఓటు వేసిన వారు ఈ ఎన్నికల్లో సైతం తమకు అండగా ఉంటారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌లో ఇద్దరు నామినేషన్ల ఉపసంహరణ
మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల విత్‌డ్రా కొనసాగుతున్నది. పరిశీలన తర్వాత బరిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్‌లు 398 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు. ఆదివారం ఇద్దరు ఆభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసహరించుకున్నట్లు ఆయా వార్డులకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. 9వ వార్డు నుంచి మొత్తం తొమ్మిది నామినేషన్లు రాగా సాదు మోహతే తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. 4వ వార్డు నుంచి మొత్తం 10 నామినేషన్లు రాగా రావుల ఉమాదేవి తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు.


logo