బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 09, 2020 , 17:36:40

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:‘ఈచ్‌వన్‌.. టీచ్‌ వన్‌' నినాదంతో వందశాతం అక్షరాస్యత సాధించాలని సీఎం కేసీఆర్‌ పిలుపుతో జిల్లా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిబ్బంది ఇంటింటా అక్షరాస్యుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో అక్షరాస్యతా శాతం 63.46 ఉంది. జిల్లా జనాభా 7,08,972 ఉండగా వీరిలో అక్షరాస్యులు 3,94,491 ఉన్నారు. వీరిలో పురుషులు 2,28,689 మంది, మహిళలు 1,65,802 మంది ఉన్నారు. మిగతా వారిని సైతం అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా అధికారులు చర్యలు చేపట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల్లో నిరక్షరాస్యుల వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.


వీఆర్వోలతో పాటు అంగన్‌వాడీ టీచర్లు, ఐకేసీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటా తిరిగి 18 ఏండ్లు దాటిన చదువురాని వారి వివారాలను తీసుకుంటున్నారు. వీటిని మండల పంచాయతీ కార్యాలయాల్లో ఈ పంచాయతీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. వివరాల సేకరణ ఈ నెల 10లోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు బడిఈడు వయస్సులో ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చిందుకు సైతం చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా మండలాల్లో ఎంపీడీవోలు, ప్రత్యేకాధికారులుగా ఉన్నారు. జిల్లాలో 63.46 శాతం అక్షరాస్యత ఉండగా ఏజెన్సీ మండలాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు ఉన్నారు. ప్రజలను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రభుత్వం వయోజన విద్య, ఇతర కార్యక్రమాలు అమలు చేస్తున్నా అంతగా ఫలితం కనపడcం లేదు. గ్రామాల్లో నిరక్షరాస్యుల వివరాలను సేకరించిన తర్వాత వారికి చదువు చెప్పేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. ఆయా గ్రామాల్లో చదువుకున్న వారు, ఉపాధ్యాయులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒకరు మరొకరికి చదువులు నేర్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు కుటుంబసభ్యులకు అక్షరాలు నేర్పించేలా చర్యలు తీసుకోనున్నారు. అధికారులు చేపడుతున్న పటిష్టమైన ప్రణాళికల ద్వారా జిల్లా వందశాతం అక్షరాస్యత సాధించేందుకు అవకాశాలున్నాయి.


logo
>>>>>>