బుధవారం 01 ఏప్రిల్ 2020
Adilabad - Jan 08, 2020 , 11:27:48

నదీజల యాత్ర షురూ!

నదీజల యాత్ర షురూ!

ఇంద్రవెల్లి : జనవరి 24న నాగోబాకు నిర్వహించే మహాపూజల కోసం ఉపయోగించే పవిత్ర నదీజలాల కోసం మెస్రం వంశీయులు బయలుదేరారు. గోదావరి నదిలోని హస్తల మడుగు నుంచి పవిత్ర జలాన్ని తీసుకు వచ్చేందుకు మెస్రం వంశీయులు ఏటా పాదయాత్రగా వెళ్తారు. ఈ సంప్రదాయిన్ని కొనసాగిస్తూ మంగళవారం సాయంత్రం కెస్లాపూర్ గ్రామంలో పురాతన నాగోబా ఆలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి నదీజలం కోసం పాదయాత్రగా బయలదేరారు. ఉమ్మడి జిల్లాలోని వివి ధ ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు మంగళవారం మధ్యాహ్నం కెస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయానికి చేరుకున్నారు. గ్రామంలోని పురాతన నాగోబా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా సమావేశమై నాగోబాకు నిర్వహించే మహా పూజలు, నదీజల సేకరణపై చర్చించారు. అనంతరం వారి సంప్రదాయం ప్రకారం పురాతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన ఆలయంలో భద్రపరిచి ఉంచిన నదీజల జారిని కటోడ హనుమంత్‌రావ్ బయటకు తీశారు. ఆలయం పక్కన తెల్ల వస్త్రంపై జారిని పెట్టి సంప్రదాయం ప్రకారం పురుషులు, మహిళలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు చేశారు. నదీజలం తీసుకువవచ్చే జారిని కటోడ హనుమంత్‌రావ్ వీపుపై తెల్లవస్త్రంతో కట్టారు. నదీజల సేకరణ కోసం కాలి నడకన బయలుదేరే ముందు కటోడ హనుమంత్‌రావ్‌తోపాటు దాదాపు వంద మందిపై మెస్రం వంశీయులు గిరిజన సంప్రదాయ ప్రకారం మర్యాదపూర్వకంగా ఒకరినొకరు కలుసుకున్నారు. ఆలయం నుంచి గామ పోలిమేర వరకు గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయులు యాత్రికులను సాగనంపారు. యాత్ర ప్రారంభ కార్యక్రమంలో మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్ పటేల్, మెస్రం వంశీయులు చిన్ను పటేల్, బాదీరావ్ పటేల్, లింబారావ్, కటోడ హనుమంత్‌రావ్, పర్ధాంజీ తుకుడోజీ, మెస్రం మనోహర్, దుర్గు, కోశరావ్, నాగోరావ్, గణపతి, దాదారావ్, తిరుపతి, పాండురంగ్, సోనేరావ్, దేవ్‌రావ్, నాగ్‌నాథ్, తుకారాం, శేఖర్‌బాబు, ఆనంద్‌రావ్, సీతారాం, ధర్ము తదితరులు పాల్గొన్నారు.


పాదయాత్ర విశేషాలు...

ఈ సందర్భంగా మెస్రం వంశీయులు మాట్లాడుతూ.. యాత్రా షెడ్యూల్‌ను వివరించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం (7వ తేదీ) సాయంత్రం కెస్లాపూర్ నుంచి ప్రారంభమైన నదీజల సేకరణ పాదయాత్ర సూర్యాస్తమయానికల్లా మండలంలోని పిట్టబోంగురం గ్రామానికి చేరుకున్నది. రాత్రి అక్కడే బసచేశారు. ఈ నెల 8న వడగాం, 9న పోల్లుగూడ, 10న ఉట్నూర్ మండలంలోని తాండ్రా, 11న తేజపూర్, 12న ఉడుంపూర్, 13న నర్సింగ్‌పూర్, 14న గోదావరి నదికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం హస్తల మడుగు నుంచి పవిత్ర నదీజలాన్ని సేకరిస్తారు. నదీజలాన్ని తీసుకొని తిరుగు ప్రయాణంలో 20వ తేదీన ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, సాయంత్రం కెస్లాపూర్ గ్రామంలోని మర్రిచెట్ల వద్దకు చేరుకుంటారు. మూడు రోజులపాటు అక్కడే బస చేస్తారు. జనవరి 24న నాగోబాకు చేరుకొని నదీజలంతో మహాపూజలు నిర్వహిస్తారు.


logo
>>>>>>