గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఆడిపాడిన ఆడబిడ్డలు అలరించిన నృత్యాలు
తలమడుగు, అక్టోబర్ 18: సద్దుల సంబురం అంబరాన్నంటింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో బతుకమ్మ నిమజ్జనోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆడబిడ్డలు ఆటపాటలతో అలరించారు. పాటలకు అనుగుణంగా యువతులు, మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సామూహికంగా చెరువులు, వాగుల వద్దకు వెళ్లి బతుమ్మలను నిమజ్జనం చేశారు.
మండలంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. మండల కేంద్రం, సుంకిడి, కుచులాపూర్, ఖోడత్ తదితర గ్రామాల్లో మహిళలు చెరువులు, వాగులవద్దకు బతుమ్మలతో తరలివెళ్లి నిమజ్జనం చేశారు. ఆడపడుచులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా యువతులు, మహిళలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
తీరొక్క పూలతో…
ఖానాపూర్ రూరల్, అక్టోబర్ 18: మండలంలోని బాదనకుర్తి, సూర్జాపూర్, సోమార్పేట్, సత్తనపెల్లి, బీర్నంది, గోసంపల్లె, నడిపల్లె, రాజురా, మస్కాపూర్, తర్లపాడ్, పాత తర్లపాడ్, బాదనకుర్తి, పాత ఎల్లాపూర్ తదితర గ్రామాల్లో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి కోలాటమాడారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బతుకమ్మకు వీడ్కోలు
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 18 : పట్టణంలోని శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీ, శాంతినగర్తో పాటు వివిధ వార్డుల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మను ఊరేగించి దాండియా ఆడి స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.