ఆదివారం 29 మార్చి 2020
Adilabad - Feb 24, 2020 , 00:18:20

ప్రవేశ పరీక్షలకు వేళాయె..

ప్రవేశ పరీక్షలకు వేళాయె..

నేటి ఈ పోటీ ప్రపంచంలో ఉన్నత విద్య కోర్సులను ఉత్తమ విద్యాసంస్థల్లో చదివితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే చాలా మంది అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదువుకోవాలని పాఠశాల స్థాయి నుంచే కలలు కంటారు. వీటిని నిజం చేసుకోవాలంటే ఏదో ఒక పరీక్షలో ఉన్నతమైన ర్యాంకు సాధించక తప్పదు. కొన్ని రోజుల తేడాతో అనేక పరీక్షలన్నీ వేసవి కాలంలో ఒకే సారి ఉంటాయి. ముందస్తు ప్రణాళికలు లేకుంటే విద్యార్థులు మంచి మార్కులు సాధించడం కష్టంగా మారుతుందంటున్నారు నిపుణులు. ఇప్పటికే అనేక సెట్‌లకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో దేనికి సన్నద్ధం కావాలో విద్యార్థులు ముందుగా నిర్ణయించుకోవాలి. పదో తరగతి వారికి పాలిటెక్నిక్‌, టీఎస్‌ ఆర్‌జేసీ, ఇంటర్‌ పూర్తి చేసిన వారికి ఎంసెట్‌,  లా సెట్‌ తదితర పరీక్షలు ఉండగా డిగ్రీ వారికి ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఓయూ, కేయూ సెట్‌, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సెట్‌, బీటెక్‌, బీ ఫార్మసీ పూర్తి చేసిన వారికి పీజీఈసెట్‌ తదితర పోటీ పరీక్షలుంటాయి.


టీఎస్‌ పీఈసెట్‌ (పీఈటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌)

ఇంటర్‌తో యూజీడీపీఈడీ(అండర్‌గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌), డిగ్రీ పట్టాతో బీపీఎడ్‌ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. దీని కోసం www.pecet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 13వ తేదీతో గడువు ముగియనుంది. అపరాధ రుసుము రూ.500తో ఏప్రిల్‌ 24వరకు, రూ.రెండు వేలతో ఏప్రిల్‌ 29వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకొని మే 13 నుంచి నిర్వహించే ఫిజికల్‌ టెస్టుకు హాజరుకావాల్సి ఉంటుంది.


లాసెట్‌ కోసం.. 

న్యాయశాస్త్రంలో ఆసక్తి ఉన్న వారు చేసే లాసెట్‌ అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలోని లా కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన లాసెట్‌, పీజీ లాసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 2న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 4వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తారు. పరీక్ష ఫీజును ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800, ఇతరకులకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. పరీక్షను మే 27న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. జూన్‌ 10న ర్యాంకులను కూడా వెల్లడించనున్నారు.


టీఎస్‌ పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన నోటిపికేషన్‌ విడుదలైంది. దీని కోసం వెబ్‌సైట్‌ www.pgcet.tsche.ac.in నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 12వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మే 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్‌టికెట్లను మే 20 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే28 నుంచి 31వరకు పరీక్షను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఎంసెట్‌ నోటిఫికేషన్‌..

టీఎస్‌ ఎంసెట్‌  నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూ విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, మెడికల్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌కు ఇంటర్‌ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మే 4, 5, 7 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కంప్యూటర్‌ బేస్‌డ్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.400గా నిర్ణయించగా, ఇతరులు రూ.800తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్‌ మెడికల్‌ అభ్యర్థులకు మే 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం వెబ్‌సైట్‌ www.tsemcet.tsche. cgg.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఐసెట్‌ కోసం..


డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఎంబీఏ, ఎంసీఏ చేయడానికి నిర్వహించే ఐసెట్‌ షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. దీని కోసం వెబ్‌సైట్‌ www.tsicet.tsche.ac.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఐసెట్‌ ప్రవేశ పరీక్షలను మే 20, 21తేదీల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను మే మొదటి వారం నుంచి స్వీకరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 


logo