గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 15, 2020 , 00:37:43

మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌దే విజయం

మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌దే విజయం
  • గెలిచే అభ్యర్థులకే బీ ఫాంలు
  • మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి లోక భూమారెడ్డి
  • మిగతా వారికి భవిష్యత్తు ఉంటుంది

ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో గెలిచే అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినట్లు టీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఇన్‌చార్జి లోక భూమారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్‌లో జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే జోగు రామన్న ఇతర నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులు జాబిజాతాను ఆయన ప్రకటించారు. మున్సిపల్‌ పరిధిలో 49 వార్డులు ఉండగా టీఆర్‌ఎస్‌ 40 నుంచి 45 వార్డుల్లో విజయం సాధిస్తుందన్నారు. వివిధ పార్టీల్లో నిర్వహించిన సర్వేలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసినట్లు తెలిపారు. పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ మంది పోటీ పడ్డారని బీ ఫారాలు అందని వారు నిరాశచెందవద్దన్నారు. వారికి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చేలా అందరం కృషి చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని, ఆరేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లా కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.125 కోట్లు మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనులకు కేటాయించారని, దీంతో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పలు వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు అభ్యర్థులతో కలిసి నేటి నుంటి ముమ్మర ప్రచారం చేపడుతామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, నాయకులు యూనిస్‌ అక్బానీ, రాజేశ్వర్‌, జోగు మహేందర్‌, కనక లక్కేరావు, తదితరులు పాల్గొన్నారు.


టీఆర్‌ఎస్‌లో చేరికలు

జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్‌ మాజీ మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఇలియాస్‌ ఖాన్‌తోపాటు కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. పార్టీ నాయకులు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


కేఆర్‌కే కాలనీలో చేరికలు

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : అభివృద్ధిని ఆదరించి టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. మంగళవారం పట్టణంలోని కేఆర్‌కే కాలనీలో నిర్వహించిన సమావేశంలో పలువురు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదిలాబాద్‌ పట్టణం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని, కోట్ల రూపాయలు తీసుకొచ్చి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పాత జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నామని, ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధిని చేసే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మావల మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌,జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న పాల్గొన్నారు.


logo