గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 15, 2020 , 00:36:53

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి
  • ఫిబ్రవరి 1 నుంచి పరీక్షలు
  • హాజరుకానున్న 6396 మంది విద్యార్థులు
  • 38 కేంద్రాల్లో పరీక్షలు

ఆదిలాబాద్‌ రూరల్‌: ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షల కోసం జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్‌ విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా నుంచి 6396 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.


సెల్ప్‌ సెంటర్లు... 

ఈ ఏడాది నిర్వహించే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను సెల్ప్‌ సెంటర్లలోనే నిర్వహించనున్నారు. దీని పర్యవేక్షణ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు ప్రత్యేకంగా అబ్జర్వర్లను నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రత్యేకంగా చూడాలని అధికారులు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 1691, బైపీసీలో 2915 మంది, ఒకేషనల్‌ ప్రథమలో 1125, ద్వితీయలో 665 మంది మొత్తం 6396 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికి 4 విడతల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రశ్నాపత్రం ఇంటర్‌ నెట్‌ ద్వారా పరీక్ష సమయం కంటే గంట ముందుగా అబ్జర్వర్లకు అందుతుంది. అక్కడ విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, రెండు మూడు గంటల్లోపు విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.


ప్రాక్టికల్‌ పరీక్షల సెంటర్లు... 

జిల్లాలోని అన్ని యాజమాన్య కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్‌ కళాశాలల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 5 టీటీడబ్ల్యూఆర్‌జేసీలు, ఒక ఎంజేపీ, 6 మోడల్‌ స్కూల్స్‌, 12 ప్రైవేట్‌ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.  


28న ఎథిక్స్‌ పరీక్ష... 

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 28న ఎథిక్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. జనవరి 30న ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకోసం సంబంధిత కళాశాలల్లోనే పరీక్షను నిర్వహించనున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఈ పరీక్షలకు హాజరుకావాలని అధికారులు పేర్కొంటున్నారు.  


పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం... 

ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రత్యేకంగా ఇంటర్‌ బోర్డు లెక్చరర్లను ఎక్స్‌టర్నల్స్‌గా వేసి పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్నాపత్రాలు గంట ముందు ఆన్‌లైన్‌లో వస్తాయి. దాని ద్వారా పరీక్షలు నిర్వహించి మార్కులు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో అక్రమాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 

- దస్రు నాయక్‌, డీఐఈవో, ఆదిలాబాద్‌ 


logo