గురువారం 02 ఏప్రిల్ 2020
Adilabad - Jan 15, 2020 , 00:34:52

శిథిలావస్థలో బంజరు దొడ్లు

శిథిలావస్థలో బంజరు దొడ్లు
  • దృష్టిసారించని ప్రజాప్రతినిధులు
  • మరమ్మతులు చేస్తే జీపీలకు ఆదాయం

ఇచ్చోడ: గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చడంలో ఒకటైన బంజరు దొడ్లు నేడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే ఇవి కొన్ని గ్రామాల్లో నిరుపయోగంగా, మరి కొన్ని గ్రామాల్లో శిథిలావస్థకు చేరి పనికిరాకుండా పోతున్నాయి. గ్రామాల్లో పంట చేలల్లో పశువుఉలు పంటను మేస్తే ఆ పశువులను బంజరు దొడ్లలో బంధిస్తారు. ఆ పశువులకు సంబంధించిన యజమాని పంట నష్ట పరిహారంతో పాటు, గ్రామ పంచాయతీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కానీ క్రమక్రమంగా వీటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. వీటివైపు కన్నెత్తి చూసిన పాపానపోవడం లేదు. మండలంలో మొత్తం 32 గ్రామపంచాయతీలుండగా సుమారు 20 బంజరు దొడ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. 


ప్రత్యేక రిజిస్టర్‌..

బంజరు దొడ్ల నిర్వహణకు ప్రత్యేకంగా రిజిస్టర్‌ ఉండాలి. కానీ చాలా గ్రామ పంచాయతీల్లో రిజిస్టర్లు ఉంచడం లేదని స్థానికులు అంటున్నారు. ఆయా గ్రామపంచాయతీల్లో కామాటీలు పనులు చేస్తున్నట్లు రికార్డులు చూపుతున్నారు. అయితే వారితో చేయిస్తున్న పనులేమిటీ? బంజరు దొడ్ల నిర్వహణ ఒక భాగమే అయినా నిర్వహణలు సాగడం లేదు. గతంలోబంజరు దొడ్డిలో బంధీ అయిన పశువుకు రూ.50 చెల్లించి సదరు యజమాని ఆ పశువును విడిపించుకుని ఇంటికి తీసుకుపోయేవారు. దీంతో గ్రామపంచాయతీలకు ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం వీటి గురించి కొత్త పాలక వర్గాలు పట్టించుకోవడంలేదనే వివర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని గ్రామపంచాయతీల్లో  వచ్చిన సొమ్మును కారోబార్లు సొంత పనులకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


వీడీసీలదే పెత్తనం..

గ్రామపంచాయతీల్లో సర్పంచుల పాలన వచ్చినా కొన్ని గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు పెత్తనం చెలాయిస్తున్నాయి. బంజరు దొడ్లలో పడ్డ ఒక్కో పశువుకు రూ. 250 మొదలుకుని రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. ఇందులోంచి రూ.50 నుంచి రూ.150 మాత్రమే గ్రామ పంచాయతీలకు చెల్లిస్తూ మిగితా సొమ్మును వీడీసీల ఖాతాలోకి జమ చేసుకుంటున్నారు. మండలంలో ఎక్కువ శాతం మహిళలే సర్పంచులుగా ఉన్నారు. గ్రామ పంచాయతీ వ్యవహారాలపై వీరికి అవగాహన లేకపోవడంతో వీడీసీలకు వరంగా మారింది. కొన్ని గ్రామాల్లో ఇవి కూడా చెల్లించలేకపోతుండటంతో జరిమానా డబ్బులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వెలువడుతున్నాయి.


గ్రామ పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే బంజరు దొడ్లకు మరమ్మత్తులను చేయిస్తాం. ఉపయోగంలో ఎన్ని ఉన్నాయి. శిథిలావస్థకు చేరుకున్నవి ఎన్ని ఉన్నాయి? నివేదిక తెప్పించుకొని  సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తాం. సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. బంజరు దొడ్లలో బంధించిన పశువులకు జరిమానా విధించిన డబ్బులను వీడీసీలకు చెల్లించకూడదు. బంజరు దొడ్ల నిర్వహణ జీపీలకు సంబంధించినది. వీడీసీల పెత్తనం సాగనివ్వకుండా చర్యలు చేపడుతాం. 

- వామన్‌భట్ల రాంప్రసాద్‌, ఎంపీడీవో, ఇచ్చోడ


logo