e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఆదిలాబాద్ స్నేహితుడు లేనిదే ప్రపంచం లేదు..

స్నేహితుడు లేనిదే ప్రపంచం లేదు..

  • సామాజిక వేదిక స్నేహమాలిక..
  • స్మార్ట్‌ఫోన్లతో విశ్వవ్యాప్తమైన బంధాలు

భైంసా, జూలై 31 : ప్రజల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మొదటిసారి 1935లో అమెరికా కాంగ్రెస్‌లో స్నేహితుల దినోత్సవం నిర్వహించారు. గ్రీటింగ్‌ కార్డులు తయారు చేసే హాల్‌మార్క్‌ సంస్థ వ్యవస్థాపకుడు జాయ్స్‌ సి.హాల్‌ మిత్రుల దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదించాడు. అప్పటి నుంచి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం నిర్వహించాలని తీర్మానించారు. దీంతో స్నేహితుల దినోత్సవం ఆనాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి గుర్తుగా సోదరి రాఖీ కట్టడం భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి స్నేహితుల మధ్య బంధాన్ని పెంచేలా ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్లు అందుబాటులోకి వచ్చాయి. యువతీ యువకులు తమ ఆత్మీయనేస్తం హస్తానికి ఇలాంటి బ్యాండ్లు కట్టి బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఆలోచనే ప్రధానం..
కుటుంబ బాధ్యతలు మీద పడి జీవితంలో స్థిరపడ్డాక ఇంతవరకు తనకు స్నేహితులుగా నిలిచిన వారెవరో? భవిష్యత్‌లో స్నేహాన్ని కొనసాగించేవారెవరోనన్న ఆలోచన వస్తుంది. కొత్త స్నేహం చేయాలంటే విభిన్న కోణాల నుంచి ఆలోచించాలని అనుభవం చెబుతుంది. స్నేహం తన కుటుంబానికి, జీవితానికి ఏ మాత్రం తోడ్పడగలదన్న ఆలోచన వస్తుంది. పవిత్రమైన స్నేహ బంధానికి మరింత గౌరవం కల్పించిన వారు పురాణాలు, చరిత్రతోపాటు నేటి తరంలోనూ ఉన్నారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు-కుచేలుడు.. నిన్నటితరంలో బాపు-రమణ స్నేహానికి ఎంతో ఔన్నత్యం కల్పించారు. కానీ.. నేటి తరంలో నిజమైన స్నేహం అనేది ఎండమావిగానే కనిపిస్తున్నది. పరిచయం అయ్యాక పట్టుమని పదేండ్లు కూడా స్నేహాలు నిలవడం లేదు.

- Advertisement -

స్నేహితులను కలిపే ఎన్నో సోషల్‌ సైట్లు..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ రాజ్యమేలుతున్నాయి. వీటితోపాటు మెస్సేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, గూగుల్‌ ప్లస్‌, లైన్‌, వైబర్‌, టాన్‌గో, హ్యాంగ్‌ అవుట్స్‌, బఫెర్‌, హర్‌నెట్‌, వైన్‌, స్ప్రోట్‌, కిక్‌, 2గో, టెలిగ్రామ్‌ లాంటివి హల్‌చల్‌ చేస్తున్నాయి. స్నేహితుల కోసం చాలా సైట్లు ఉన్నాయి. స్నేహాలను పెంచే ఫ్రెండ్స్‌ గ్రూపులను స్నేహితులే సృష్టిస్తున్నారు. స్నేహితులు కూడా ఒక్కటవుతున్నారు. ఎవరైనా ఒక్కరికి నంబర్‌ తెలిస్తే చాలు అందరినీ గ్రూపులో కలుపుకొని పోతున్నారు. దీంతో ఎన్నో ఏండ్ల స్నేహం మళ్లీ తెరపైకి వస్తున్నది. అదే వేదికగా చాలా మంది కలుసుకుంటున్నారు. గెట్‌ టు గెదర్‌ పార్టీలు, పూర్వ స్నేహితుల కలయికలు ఇలా జోరుగా సాగుతున్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ వేదికగా వీటిని ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

అన్ని బంధాలకు ప్రతిబింబం
అమ్మానాన్నలను, భార్యాభర్తలను దేవుడే డిసైడ్‌ చేస్తాడంటారు. మరి స్నేహితులను.. మాత్రం దేవుడు మనకే వదిలేశాడు. రక్తసంబంధాలను ముందుగానే నిర్ణయించిన ఆ భగవంతుడు ఆత్మబంధాన్ని కలుపుకోమని మనకే పర్మిషన్‌ ఇచ్చేశాడు. ఓ స్నేహితున్ని వెతుక్కోవడం, ఆ వ్యక్తిని స్నేహితుడిగా మలుచుకోవడం మీ పనే అంటూ తీయని భారాన్ని మనపై మోపాడు. అందుకే స్నేహితుడు అచ్చంగా మనవాడు. మనసెరిగిన వాడయ్యాడు. చిన్నప్పుడు పడిపోతే నాన్న పట్టుకునేవాడు. ఆకలేస్తే అమ్మ కమ్మగా ముద్దలు పెడుతుండేది. ఆమె లేనప్పుడు స్నేహితుడే క్యారేజీ పంచి అమ్మ స్థానాన్ని భర్తీ చేసేది. అందుకే ‘ఫ్రెండ్‌ ఈజ్‌ ఈక్వల్‌ టు ఆల్‌ రిలేషన్స్‌’. అన్ని బంధాలను ప్రతిబింబాలను చూపు వాడు స్నేహితుడు మాత్రమే. హైబీపీ, మానసిక ఇబ్బందులు, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఒకటేమిటి, ఎన్నో రుగ్మతలు, రోగాలకు స్నేహమే దివ్య ఔషధం. విడాకులు, ఆత్మీయుల మరణాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర విషాద, ఇబ్బందికర సమయాల్లో మిత్రుడు ఇచ్చే ఓదార్పు వెలకట్టలేనిది. బాధల నుంచి బయటపడేందుకు కొందరు దేవున్ని మొక్కితే మరికొందరు పుస్తకాలు చదువుతారు. మిత్రుల సమక్షంలో గొప్ప ఊరట లభిస్తుంది.

కలకాలం నిలవాలంటే..
తొలి పరిచయంలోనే స్నేహితులు కావడం తప్పేమీ కాదు. కొత్త వ్యక్తి పరిచయం కాగానే అన్ని విషయాలు చెప్పేయవద్దు. మిత్రులుగా మారాకే అంతరంగిక విషయాలు చెప్పాలి. మిత్రుడి ఇష్టాన్ని గుర్తెరిగి బహుమతులు ఇవ్వాలి. మన ఇష్టం మేరకు కాదు. ఆ బహుమతి మిమ్మల్ని తలుచుకునేలా ఉండాలి. మీరు ఏదైనా వస్తువును కొనే సమయంలో స్నేహితుడికి చెప్పండి.. సంతోషమైనా, విషాదమైనా మిత్రుడితో పంచుకోవాలి. స్నేహితులుగా ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహానికి విలువ ఇచ్చే వారిని, తోటి వారు ప్రయోజకులు అయ్యేందుకు తోడ్పడేవారిని, చెడు తిరుగుళ్లు, టీజింగ్‌కు దూరంగా ఉండే వారిని ఎంచుకోవాలి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana