e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home ఆదిలాబాద్ చూడచక్కని కన్నెపల్లి..

చూడచక్కని కన్నెపల్లి..

  • అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం..
  • రెండు సార్లు ‘ఏకగ్రీవ’ పంచాయతీగా గుర్తింపు
  • ప్రతి ఇంటా మరుగుదొడ్డి, ఇంకుడుగుంత
  • ఇంటింటికీ నల్లా కనెక్షన్‌
  • వాడవాడనా సీసీ రోడ్లు, మురుగు కాలువలు
  • నిత్యం చెత్త సేకరించి డంప్‌ యార్డ్‌కు తరలింపు
  • పూర్తయిన వైకుంఠధామం

దండేపల్లి, ఆగస్టు 1: దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామం కొత్త రూపు సంతరించుకున్నది. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తున్నది. గ్రామ పంచాయతీకి నెలనెలా సమకూరుతున్న నిధులతో సమస్యల పరిష్కారం కోసం శ్రద్ధ పెట్టిన పాలకవర్గం, అధికారుల తోడ్పాటు, ప్రజల భాగస్వామ్యం…ఆ గ్రామాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నది. పల్లె ప్రగతి పక్కాగా అమలై గ్రామంలో పచ్చదనం, పారిశుధ్యంతో పాటు రోడ్లు, విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సర్పంచ్‌ గడికొప్పుల రజిని, జీపీ కార్యదర్శి సనంద సహకారంతో గ్రామం రూపు రేఖలు మారిపోతున్నాయి .అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. కన్నెపల్లిలో జనాభా 1534కాగా, వార్డుల సంఖ్య 10.

అభివృద్ధిలో ముందుకు..
రూ.1.50 లక్షలతో దాతలు నిర్మించిన ముఖద్వారంతో పల్లె స్వాగతం పలుకుతుంది. దారికి ఇరువైపులా నాటిన మొక్కలు మరింత శోభను తెచ్చి పెడుతున్నాయి. గడిచిన రెండేండ్లలో రూ.17.20 లక్షలతో గ్రామంలో మూడు చోట్ల సీసీ రోడ్లు నిర్మించుకున్నారు. రూ.5లక్షలతో నాలుగు చోట్ల డ్రైనేజీలు నిర్మించారు. రూ.88 వేలతో కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. పాడుబడ్డ బావికి రూ.80వేలతో మరమ్మతులు చేపట్టారు. లూజ్‌వైర్లను సరిచేయడంతో పాటు 70 విద్యుత్‌ స్తంభాలను అమర్చారు. అంగన్‌వాడీ భవనానికి రూ.1లక్షతో మరమ్మతులు చేపట్టారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు అందరికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు ఇప్పించారు. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా మత్తడి మరమ్మతులకు రూ.22 లక్షలు కేటాయిం చడంతో దాని కింద 100 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. గ్రామంలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు 100శాతం నిర్మించుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు. 90 శాతం ఇంటిపన్ను వసూలు చేస్తూ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులవుతున్నారు.

- Advertisement -

స్వాగతం పలుకుతున్న పచ్చదనం..
కన్నెపల్లి గ్రామ ముఖద్వారం నుంచి రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి గ్రామంలోకి వచ్చే వారికి స్వాగతం పలుకుతున్నాయి. హరితహారం ప్రారంభంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆకట్టుకుంటున్నాయి. మొక్కల రక్షణకు జీపీ పాలకవర్గం ప్రత్యేక శ్రద్ధ వహించడం, ట్రీగార్డ్‌లు అమర్చడంతో గ్రామానికి కొత్త రూపు తెచ్చిపెట్టాయి.

ఆహ్లాదంగా పల్లె ప్రకృతివనం..
గూడెం గుట్ట ప్రక్కన నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరంగా మారింది. రకరకాల పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంలో చుట్టూ ఫెన్సింగ్‌, ప్రకృతి ప్రేమికుల కోసం వాకింగ్‌ ట్రాక్‌, గేటు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులే కాక జీపీ నుంచి రూ.1లక్షతో పార్క్‌ను అభివృద్ధి చేశారు. సుమారు 4వేల మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేకంగా ఒక వన సేవకుడిని నియమించారు..గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. వీటి సంరక్షణకు సిబ్బందిని నియమించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ ఇవ్వడంతో జీపీ సిబ్బంది గ్రామ పరిసరాలను సర్వాంగ సుందరంగా ఉంచుతున్నారు. గ్రామంలో నిర్మించిన ట్యాంకుతో మిషన్‌ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నారు.

అన్ని హంగులతో వైకుంఠధామం..
గతంలో ఊళ్లో ఎవరైనా మృతిచెందితే దహన సంస్కారాలకు చాలా ఇబ్బందయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జాతీయ రహదారి పక్కన సకల సౌకర్యాలతో వైకుంఠధామం నిర్మించడంతో చివరి మజిలీకి కష్టాలు తప్పాయి. ప్రభుత్వం రూ.12.5 లక్షలు నిధులు కేటాయించి అన్ని హంగులతో వైకుంఠధామాన్ని నిర్మించింది. ఇప్పటి వరకు గ్రామానికి చెందిన ఐదుగురికి దహన సంస్కారాలు నిర్వహించినట్లు సర్పంచ్‌ తెలిపారు.

నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు..
ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్‌, ట్రాలీతో పారిశుధ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సేకరించిన తడి, పొడి చెత్తను డంప్‌ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాలువల్లో పూడికను తీస్తూ, నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. రోడ్ల వెంబడి బ్లీచింగ్‌, ప్రత్యేక శానిటైజేషన్‌ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో సీజనల్‌ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.

అభివృద్ధే ధ్యేయంగా..
గ్రామం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాం. పంచాయతీ ఇప్పటికే ఓడీఎఫ్‌గా గుర్తింపు పొందింది.100 శాతం ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించి, సక్సెస్‌ అయ్యాం. నగదు రహిత లావాదేవీల కోసం అందరికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు ఇప్పించాం. ప్రజల అవసరాలను గుర్తించి, జీపీ తీర్మానంతో ఇప్పటి వరకు గ్రామంలో రూ.17.20లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాం. దాతల సహకారంతో గ్రామం ముందు కమాన్‌ నిర్మించుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంక్‌తో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం.

  • గడికొప్పుల రజిని, సర్పంచ్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana