e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home ఆదిలాబాద్ గులాబ్‌ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కుండపోత వాన

గులాబ్‌ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కుండపోత వాన

  • ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు
  • ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్‌ఫ్లో.. గేట్లు ఎత్తి దిగువనకు విడుదల
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు.. వంకలు
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • నిర్మల్‌, భైంసాలో రోడ్లపై నీరు
  • దివ్యనగర్‌లో నీటిలోనే సబ్‌స్టేషన్‌
  • పలుచోట్ల సోయా, పత్తి తదితర పంటలకు నష్టం
  • అప్రమత్తమైన అధికారులు
  • కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూమ్‌లు

ఆదిలాబాద్‌ (నమస్తే తెలంగాణ ప్రతినిధి), నిర్మల్‌ అర్బన్‌, సెప్టెంబర్‌ 28 : గులాబ్‌ తుఫాన్‌ ఉమ్మడి జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రెండో రోజూ ఆదిలాబాద్‌ , నిర్మల్‌ జిల్లాలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీచాయి. నిర్మల్‌ జిల్లాలో 11.5 సెంటీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎక్కువగా బాసరలో 20.2 సెంటీ మీటర్లు, తానూర్‌లో 18.2 సెం.మీ, సోన్‌లో 14 సెం.మీ, సారంగాపూర్‌లో 14.5 సెం.మీ, నర్సాపూర్‌ (జీ)లో 13 సెం.మీ, లక్ష్మణచాందలో 12.4 సెం.మీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 5.3 సగటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నిర్మల్‌ పట్టణంలోని లోతట్టు ప్రాం తాల్లోకి వరద చేరింది. దివ్యనగర్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ చుట్టూ నీరు చేరింది. ప్రహరీ పూర్తిగా మునిగిపోయింది. ఐదు ఇంచుల వరకు నీరు చేరితే సబ్‌ స్టేషన్‌ యంత్రాల్లోకి నీరు వెళ్లి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగనుంది. పట్టణంలోని 7 వార్డులకు సరఫరా నిలిచిపోనున్నది. భైంసాలోని కుభీర్‌ చౌరస్తా వద్ద రోడ్డుపై నుంచి వర్షం నీరు ప్రవహించింది. కుంటాల, తానూర్‌, లక్ష్మన్‌ణచాంద, కుభీర్‌ మండలాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయగా కలెక్టర్లు వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అధికారులు సైతం గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఫోన్‌లో తమకు సమాచారం ఇస్తే సహాయం అందిస్తామని సూచించారు. నిర్మల్‌ పట్టణంలోని దివ్యగార్డెన్‌, వైఎస్సార్‌ కాలనీల్లో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఇంజినీర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లు, కార్మికులను అందుబాటులో ఉంచారు.

మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లాలో గరిష్టంగా జైపూర్‌ మండలకేంద్రంలో 81.8 మి.మీగా, కోటపల్లి మండలంలో వర్షపాతం 45.8 మి. మీలుగా నమోదయ్యింది. కనిష్టంగా జైపూర్‌ మండలంలోని కుందారంలో 2 మి.మీగా నమోదైంది. నస్పూర్‌లో 44.మి. మీ, నెన్నెలలో 37.5, చెన్నూర్‌లోని కొమ్మెరలో 35, పాత మంచిర్యాలలో 34.8, దండేపల్లిలోని వెల్గనూర్‌లో 34.5, హాజీపూర్‌లో 29, చెన్నూర్‌లో 26.8, నీల్వాయిలో 24.8, తాండూర్‌లో 24.3,హాజీపూర్‌ మండలంలోని ర్యాలీ లో 22.8 మి.మీ, బెల్లంపల్లిలో 21, మందమర్రి మండలం అందుగుల పేటలో 20 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. మిగితా ప్రాంతాల్లో 20 మి.మీలలోపే నమోదైంది.

- Advertisement -

ప్రాజెక్టుల్లో భారీగా వరద..
నిర్మల్‌ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కడెం ప్రాజెక్టులోకి 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. అప్రమత్తమైన అధికారులు ఆరు గేట్లు ఎత్తి కుడి, ఎడమ కాలువల ద్వారా 72 వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. సారంగాపూర్‌ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా రెం డు గేట్లను ఎత్తిన అధికారులు 11 వేల క్యూసెక్కులను విడుదల చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 31, 920 క్సూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో మూడుగేట్ల ద్వారా 39,726 క్యూసెక్కులను అధికారులు బయటకు వదిలారు. ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల ప్రాజెక్టులోకి 1149 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో ఒక గేటు ఎత్తిన అధికారులు 1149 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. మత్తిడి వాగు ప్రాజెక్టులోకి 3005 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో రెండు గేట్ల ద్వారా 3వేల క్యూసెక్కులను బయటకు వదిలారు. భారీ వర్షాల కారణంగా బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు పంపిస్తున్నారు. నీటి లెవల్‌ 148 మీటర్లకుగాను, 146.65 మీటర్ల వరకు ఉంది. మొత్తం 432163 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో, 390080 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

గొల్లవాగు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 155.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 155.10 మీటర్లు ఉంది. మొత్తం సామర్థ్యం 0.5675 టీఎంసీలు కాగా, ప్రస్తు తం 0.5055 టీఎంసీలు ఉంది. తెరిపిలేని వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 521.50 క్యూసెక్కులు కాగా, మొత్తం అవుట్‌ ఫ్లో 11.95 క్యూసెక్కులుగా నమోదైంది. నీల్వాయి ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 124 మీ టర్లు కాగా, ప్రస్తుం 124.050 మీటర్లుగా నమోదైంది. 0.846 ఎంసీఎఫ్‌టీలు కాగా, పూర్తి నీటి సామర్థ్యంతో నిండుకుండను తలపిస్తున్నది. ర్యాలీవాగులో మొత్తం నీటి మట్టం 151.500 మీటర్లకుగాను, 151.550 మీటర్లు ఉంది. 179.90 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా, మొత్తం అవుట్‌ ఫ్లో 179.90 క్యూసెక్కులతో నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం, అన్నారం బ్యారేజీలలో గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను పోలీసు, రెవెన్యూ శాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. బుధవారం కూడా కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తెరిపిలేకుండా పడుతున్న వానతో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. కుమ్రం భీంప్రాజెక్టులోకి వరద చేరడంతో మంగళవారం అధికారులు 5 గేట్లు ఎత్తి 14013 క్యుసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.470 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వట్టివాగు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.ప్రాజెక్టు నీటి మట్టం 2.890 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.539 టీఎంసీలు నిల్వ ఉంది.

పంటలకు నష్టం..
తుఫాన్‌ ప్రభావంతో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో రైతులు సోయాబీన్‌, పత్తి పంటలు నష్టపోవాల్సి వచ్చింది. రెండు జిల్లాల్లో 6.18 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 ఎకరాల్లో రైతులు సోయాబీన్‌ పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సోయాబీన్‌ కోతకు సిద్ధంగా ఉండగా, పత్తి కాతదశలో ఉంది. భారీ వర్షాల కారణంగా పంట చేలల్లో నీరు నిలిచింది. దీంతో సోయాబీన్‌ గింజలు మురిగిపోతుండగా పత్తికాయలు నల్లపడుతున్నాయి. సీజన్‌ బాగా ఉండటంతో రెండు పంటల దిగుబడులపై ఆశలు పెట్టుకున్న రైతులు నష్టపోవాల్సి వచ్చింది. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో చింతలమానేపల్లి మండలం గంగాపూర్‌, కర్జెల్లి, చింతలమానేపల్లి శివారులోని సుమారు 150 ఎకరాల పత్తిపంట దెబ్బతిన్నట్లు తెలుస్తున్నది. సోమవారం సుడిగాలుల వల్ల పంటలు నేలకొరగగా మంగళవారం ఎంపీపీ డుబ్బుల నానయ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ నాందేవ్‌ పంట పొలాలను సందర్శించి పరిశీలించారు. మంచిర్యాల జిల్లాల్లోని పలు మండలాల్లో పంటలు నీటమునిగాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement