e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home ఆదిలాబాద్ అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం..

అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం..

  • సీఎం ఆదేశాలతో నివేదికలు పంపించాం
  • మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • చెన్నూర్‌లో వరద ముంపు బాధితులు, సీసీసీ నస్పూర్‌ అధికారులతో వేర్వేరుగా సమావేశం
  • ఆసిఫాబాద్‌లోనూ సమీక్ష.. పలు అంశాలపై చర్చ

మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ సీసీసీ నస్పూర్‌/భీమారం, జూలై 28 : వర్షాలు, ముంపు బాధిత రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర, అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలతో పంట నష్టపోయిన మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌, కోటపల్లి మండలాల రైతులతో చెన్నూర్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ విషయమై సీసీసీ నస్పూర్‌ సింగరేణి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా చోట్ల విప్‌ బాల్క సుమన్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌, మంచిర్యాల కలెక్టర్‌ భారతీ హోళికేరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ.. కోటపల్లి మండలంలోని దేవులవాడ, చెన్నూర్‌ మండలంలోని సుందరశాల గ్రామాల్లో పంట ముంపునకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి 4 లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు వదిలిపెట్టారని, నదులు, ఉప నదులు కలవడం, బ్యాక్‌ వాటర్‌తో కొంత ఇబ్బందయ్యిందని పేర్కొన్నారు. అధికారులంతా అందుబాటులో ఉన్నారని గుర్తుచేశారు. వర్షం కురిసిన రోజే కలెక్టర్‌, ఇతర అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి అంచనావేసినట్లు, ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రాథమిక సమాచారం నివేదిక కూడా పంపినట్లు వివరించారు. రైతులు ఒకే రకమైన పంటపై కాకుండా, ఆయిల్‌ పామ్‌ సాగుపైనా దృష్టిపెట్టాలని సూచించారు. దాదాపు రూ.100 కోట్లపైనే చెన్నూర్‌ పట్టణ అభివృద్ధికి విప్‌ సుమన్‌ కృషిచేస్తున్నారని, ఈ ప్రాంత ప్రజల అదృష్టమని కొనియాడారు.

శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు : విప్‌ బాల్క సుమన్‌
అనంతరం విప్‌ సుమన్‌ మాట్లాడుతూ.. ముంపు గ్రామాల బాధితుల శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుందామని స్పష్టం చేశారు. డీపీఆర్‌ తయారు చేయాలని సంబంధిత ఇరిగేషన్‌ అధికారులను కోరారు. స్థానిక సమస్యలు, సాధ్యాసాధ్యాలపై గ్రామాల్లో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. త్వరలో గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. చెన్నూర్‌, కోటపల్లి మండలాల్లోని సమస్య పరిష్కారానికి ప్రతీ క్షణం ఆలోచిస్తున్నామని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుందామని ఉద్ఘాటించారు. నస్పూర్‌లో మాట్లాడుతూ.. చెన్నూర్‌, భీమారంలో చెరువు శిఖం భూమిలోని అక్రమ కట్టడాలుంటే కూల్చివేయాలని, ఎంతటివారైనా ఉపేక్షించవద్దని కలెక్టర్‌ను కోరారు.

- Advertisement -

ఏకాభిప్రాయానికి రావాలి : ఎమ్మెల్సీ పురాణం
అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. యేటా వానకాలంలో సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుందామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి రైతులంతా ఏకాభిప్రాయానికి రావాలని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్తారని తెలిపారు. దేవులవాడ, సుందరశాల సమస్యలు వేరువేరని గుర్తుచేశారు.

వరద, బ్యాక్‌ వాటర్‌తో తిప్పలు : కలెక్టర్‌ భారతి
ఆ తర్వాత కలెక్టర్‌ భారతీ హోళీకేరి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల బ్యాక్‌ వాటర్‌, నీటిని విడుదల చేసినప్పుడు వరద నీటితో పాటు వర్షంతో రైతుల పంటలకు నష్టం వాటిల్లుతున్నదన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యాక్‌ వాటర్‌తో ఏటా రైతులు నష్టపోకుండా చట్టానికి లోబడి చర్యలు తీసుకుందామని తెలిపారు. ఇప్పటికే పలువురు రైతులు పలు సూచనలు ఇచ్చారని చెప్పారు.

బృహత్‌ ప్రకృతి వనంలో మొక్కలు..
భీమారంలోని బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో విప్‌ సుమన్‌, ఎమ్మెల్సీ సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ భారతీ హోళికేరితో కలిసి మంత్రి అల్లోల మొక్కలు నాటారు. రానున్న రోజుల్లో మండలం ఎంతో అభివృద్ధి చెందుతుందని విప్‌ పేర్కొన్నారు. నస్పూర్‌లో వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్‌, నీటి పారుదల, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, హార్టికల్చర్‌, పశుసంవర్ధక, మిషన్‌ భగీరథ అధికారులతో సమగ్రంగా చర్చించారు. జేసీ మధుసూదన్‌ నాయక్‌, అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభా సింగ్‌, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ మోటపల్కుల గురవయ్య, ఆర్డీవో వేణు, డీఏవో వినోద్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌, చెన్నూర్‌లో కోటపల్లి, చెన్నూర్‌ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి..
ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టంపై పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సూచించారు. ఈ మేరకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు తక్షణ సాయం కింద రూ.50 లక్షలు మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. కలెక్టరేట్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌తో కలిసి ఆయా శాఖల అధికారులతో వర్షాల వల్ల కలిగిన నష్టంపై సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, వ్యవసాయ విభాగాలకు ఎక్కువగా నష్టం వాటిల్లిందన్నారు. తాత్కాలిక ప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని తెలిపారు. మొత్తం 116 ట్రాన్స్‌ ఫార్మర్లు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి.. విద్యుత్‌ శాఖ సీఎండీతో ఫోన్‌లో మాట్లాడారు. ట్రాన్స్‌ఫార్మర్లను వెంటనే సర్దుబాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో వరద వ్యర్థాలను తొలగించడంతో పాటు, వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కార్యదర్శులు, ఇతర సిబ్బందికి సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులను మంత్రి అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. దెబ్బతిన్న రోడ్లతో కలిసి మొత్తం 500 గ్రామాలకు రోడ్లు నిర్మించాలన్నారు. జిల్లాలో రూ.58.91 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్‌ రెడ్డి, ఎస్పీ వైవీఎస్‌ సుధీంద్ర, డీఎస్పీ అచ్చేశ్వర్‌ రావు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement