కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణ
ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం
సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం
స్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలు
విద్యా పరంగానూ వెనుకబడిన జిల్లాలకు మేలు
నూతన జోనల్ విధానంతో విస్తృత ప్రయోజనాలంటున్న విద్యార్థి, ఉద్యోగ వర్గాలు
యాదాద్రి భువనగిరి:
కొత్త జోన్లు ఇలా
జోన్-5 యాదాద్రి:నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ
పోలీస్ డిపార్ట్మెంట్లో..
జోన్-5యాదాద్రి : నల్లగొండ, సూర్యాపేట, రాచకొండ పోలీస్ కమీషనరేట్
నూతన జోనల్ విధానంతో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం అయ్యింది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌గా పోస్టులను పునర్వ్యవస్థీకరించడంతో విద్యా, ఉద్యోగావ కాశాల్లో అసమానతలు తొలగిపోయి అన్ని ప్రాంతాలకు సమానవకాశాలు దక్కనున్నాయి. గతంలో ఆరో జోన్ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలు ఉండగా..తాజాగా యాదాద్రి ఐదో జోన్ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు, జనగామ జిల్లాలతో కొత్త జోనల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
పోలీసు డిపార్ట్మెంట్ విషయానికొస్తే.. నల్లగొండ, సూర్యాపేటతో పాటు రాచకొండ పోలీస్ కమీషనరేట్లు యాదాద్రి జోన్లో చేరిపోయా యి. స్థానికతకే పట్టం కట్టడం..సొంత జిల్లాల్లోనే పని చేసే వెసులుబాటు కలగడంతో తెలంగాణ ఉద్యోగులకు, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్లు ఉన్నాయనే భావన ఆయా వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. అస్తవ్యస్త విధానానికి తెరదించేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్త జోష్ కనిపిస్తోంది. జోనల్ విధానంలోని అస్తవ్యవస్థతను తొలగిస్తూ సీఎం కేసీఆర్ నూతన జోన్ విధానానికి పచ్చజెండా ఊపడంతో యువతతోపాటు ఉద్యోగవర్గాల్లో భవిష్యత్తు దిశగా ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టనుండడంతో కొత్త కొలువుల జాతరకు సై అనేలా ప్రస్తుత జోనల్ వ్యవస్థ ఉంటుందనే ఆశ ఆశావాహుల్ని ఊరిస్తోంది. గతంలో జోన్-6 పరిధిలో ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇప్పుడు కొత్త స్వరూపాన్ని మార్చుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, కొత్తగా జనగామ జిల్లాతో కలిపి యాదాద్రి జోన్-5గా కొత్త రూపాన్ని పొందింది.
జోన్లతో కొత్త జోష్
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కింది. 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రత్యేకమైన కసరత్తును చేపట్టింది. తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2018 ఆగస్టు 30న ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్-2018 పేరిట కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం తెలంగాణలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం క్యాడర్ రీ ఆర్గనైజేషన్‌ను పూర్తి చేసి ఇటీవలనే జీవోలు జారీ చేసింది. జిల్లా, జోనల్, మల్లీ జోనల్ క్యాడర్లుగా పోస్టులను పునర్వ్యవస్థీకరించింది.
స్థానికతకు పట్టం:
విద్య, ఉద్యోగాల సాధన విషయంలో కీలక ఉమ్మడి నల్లగొండ జిల్లా పాత జోన్-6 పరిధిలో తనదై ముద్రను వేసేది. మిగతా జిల్లాలకు ధీటుగా ఇక్కడి యువత తమ ప్రావీణ్యా న్ని కొలువుల సాధనాపరంగా చూపించే వారు. ఇప్పుడు పాత స్వరూపం మారిపోగా…కొత్తగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు జనగామ జిల్లా పరిధిలోని వారితో ఇక మీదట పోటీ పడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ ఆ జిల్లానే స్థానికతంగా పరిగణించే వారు.
ఇక నుంచి కొత్త విధానంలో భాగంగా ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. మరోవైపు గతానికి భిన్నంగా స్థానికులకు 95 శాతం ఉద్యోగవకాశాలు కల్పిస్తూ నూతన జోనల్ వ్యవస్థ అనుకూలంగా మారనుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ప్రకారం..70 శాతం పోస్టులను స్థానికులకు కేటాయించగా..30 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీ పరిధిలో ఉండేవి. దీనివల్ల స్థానిక అభ్యర్థులు నష్టపోతున్నారనే భావనతో 95 శాతం పోస్టులను స్థానికులే పొందేలా ఈ విధానం ఉపయుక్తంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
ఉద్యోగులందరికీ సమానవకాశాలు..
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆర్డర్ టు సర్వ్ విధానంలో ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. జోనల్ విధానం ఖరారు గాక బదిలీలు, పదోన్నతులు వంటి వాటిలో న్యాయం జరుగడం లేదనే అసంతృప్తి వారిలో ఉంది. ఇకమీదట జిల్లాలు, జోన్లు, మల్లీ జోన్ల వారీగా ఉద్యోగుల క్యాడర్ ఖరారు కావడంతో దీని ఆధారంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపుల ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా నియమితులైన వారికి సైతం జోనల్ కేటాయింపులు ప్రయోజనం కల్గించనున్నాయి. ఉద్యోగులందరికీ సమానవకాశాలు కలిగి బదిలీలు, పదోన్నతుల విషయంలోనూ మేలు జరగనుంది. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని కొత్త జోనల్ వ్యవస్థ కల్పిస్తున్నది.