About Us

తెలంగాణ సమాజం పురిటినొప్పులు పడుతూ కొత్త కాలానికి జన్మనిస్తున్న తరుణంలో చారిత్రక అవసరంగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆవిర్భవించింది. భూమి పుత్రులు స్వీయ పాలన కోసం కేసీఆర్‌ నాయకత్వాన ఉద్యమిస్తుంటే, పరాయి పత్రికలు విలువలను పాతాళానికి తొక్కి, వార్తలను వక్రీకరిస్తున్న తరుణంలో వాస్తవాన్ని వెలుగులోకి తేవడానికి, ప్రజల గొంతు వినిపించడానికి ‘నమస్తే తెలంగాణ’ ఉదయించింది. పత్రిక ఏర్పాటైన నాటి నుంచి పరాయి పత్రికల విషపు రాతలను ఎండగట్టింది. వలసపాలకులు కుట్రలను బహిర్గతం చేసింది. అబద్దాలను, అర్ధసత్యాలను ప్రచారం చేసి తెలంగాణ ప్రజలలో నైరాశ్యాన్ని నింపడానికి జరిగిన కుటిల యత్నాలకు అడ్డుకట్టవేసి ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

శ్రీకృష్ణ కమిటీ ఆధిపత్య శక్తుల కొమ్ముకాస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణచివేయాలనే సూచనలతో కూడిన రహస్య అధ్యయాన్ని నివేదికలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రహస్య అధ్యాయాన్ని బట్టబయలు చేయడం ద్వారా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక తన బాధ్యతలను నిర్వర్తించింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కూడా ఆంధ్రా భూభాగమే అంటూ ఒక దినపత్రిక నిర్లజ్జగా అబద్ధాలను పతాక శీర్షికలో ప్రచురించినప్పుడు, ఆ వార్తా కథనం అక్షరాలా అబద్ధమంటూ ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రుజువులను చూపించింది. ఎడమ గట్టు తెలంగాణ భూభాగమని తేల్చే రెవెన్యూ రికార్డులను సాక్ష్యంగా చూపింది. భద్రాచలంపై వివాదం తలెత్తినప్పుడు, నిజాం ముత్యాలను సమర్పించడం మొదలుకొని అక్కడి పూజారులకు వేతనాలు ఇవ్వడం వరకు ఆధారాలను చూపుతూ పాత చిట్టాలను పరిచిపెట్టింది. నమస్తే తెలంగాణ పత్రిక అనేదే లేకపోతే ఏకపక్ష విష ప్రచారమే మిగిలేది. తెలంగాణ సమాజంపై ఆత్మైస్థెర్యాన్ని దెబ్బకొట్టే, పక్కదోవ పట్టించే కుట్రలు ఎన్నిసాగేవో! దశాబ్దాల పాటు అవహేళనకు గురైన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ‘నమస్తే తెలంగాణ’ హారతి పట్టింది. తెలంగాణ సమాజ ప్రాధాన్యాలేమిటో తేటతెల్లం చేసింది.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత కూడా పరాయి కుట్రలకు తెరపడలేదు. అందువల్ల ‘నమస్తే తెలంగాణ’ పత్రిక బాధ్యత మరింత పెరిగింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే కుతంత్రాలను పటాపంచలు చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం పలు రంగాలలో సాధించిన విజయాలను ప్రజలకు చేరవేస్తున్నది. అన్ని వర్గాల అవసరాలను తీరుస్తూ, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజల పత్రికగా భాసిల్లుతున్నది. విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక శీర్షికలను నిర్వహిస్తున్నది. ‘నిపుణ’ పేర ప్రత్యేక సంచికను వెలువరుస్తున్నది. సమాజంలో సగభాగమైన మహిళల కోసం జిందగీ (గౌరమ్మ) పేర ప్రత్యేక ఫీచర్‌ను నిర్వహిస్తున్నది. క్రీడలు, సినిమా, వ్యాపారం, భక్తి, సాహిత్యం, పురాతత్వం వంటి భిన్న అంశాలలో ప్రత్యేక శీర్షికలతో పాఠకుల ఆదరణను చూరగొంటున్నది. ప్రతి ఆదివారం ‘బతుకమ్మ’ చిరు పత్రిక తీరొక్క కథనాలతో మొత్తం కుటుంబానికి అక్షర తాంబూలాలను అందిస్తున్నది. ‘నమస్తే తెలంగాణ పత్రిక’ తెలంగాణ సమాజంలో విడదీయరాని భాగమైపోయింది.