TREND మారినా.. ఫ్రెండు మారడు..


Sat,August 4, 2018 11:35 PM

స్కూల్, కాలేజీ, ఉద్యోగం, వ్యాపారం ఎక్కడ ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా.. మనం మనుగడ సాగించే చోట నలుగురు దోస్తులను సంపాదించుకోవడం మన నైజం. మనసులో భావాలు, ఆలోచనలు, బాధలు, సంతోషాలు ఏమైనా పంచుకోగల అర్హత, అధికారం ఒక్క ఫ్రెండ్‌కి మాత్రమే ఇస్తాం. ఇప్పటి తరం స్నేహానికి ఇచ్చే విలువ చాలా ఎక్కువ. ఒకప్పుడు ఒకరు లేదంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇప్పుడు గ్రూపులు గ్రూపులే మెయింటెన్ చేస్తున్నారు. ఇయ్యాల ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. ఏ వస్తువైనా పాతబడే కొద్దీ దాని మీద మోజు తగ్గిపోతుంది. కొత్త వస్తువు మీద ఆసక్తి పుడుతుంది. కానీ స్నేహం మాత్రం ఇందుకు భిన్నం. ఎంత పాతబడితే అంత మజా వస్తుంది. రోజులు గడిచిన కొద్దీ స్నేహబంధం మరింత బలపడుతుంది. ట్రెండు మారినా ఫ్రెండు మారడు.
friend


చిన్ననాటి స్నేహితులు

చిన్నప్పుడు చిగురు వేసిన స్నేహం ఇది. జీవితంలో అందరి కంటే ఎక్కువ విలువ వీరికే ఇస్తాం. మన గురించి వారికి, వారి గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండే బ్యాచ్ ఇది. వీడు, నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఆ మాటలో, కళ్లలో అక్షరాలతో కొలువలేని గర్వం కనిపిస్తుంది. ఒకే స్కూల్లో చదువుకోవడం దగ్గర్నుంచి చదువు అయిపోయి, వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చినా కలిసినప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటారు. చిన్నప్పుడు చేసిన చిలిపి పనులన్నీ గుర్తు చేసుకుంటారు. చిన్న చిన్న అపార్థాలు, గొడవలు జరిగినా.. వీరి స్నేహం మాత్రం బీటలు వారదు. చెక్కు చెదరదు.
Childhood


ఫ్రెష్ ఫ్రెండ్స్

స్కూల్ లైఫ్‌కి స్వస్తి చెప్పి కాలేజీలో అడుగుపెట్టినప్పుడు పుడుతుందీ ఫ్రెండ్‌షిప్. కొత్తగా పరిచయమైనా.. పాతబడేకొద్దీ స్నేహం వికసిస్తుంది. ఒకరితో మొదలై ఓ గ్యాంగులా మారే ఫ్రెండ్‌షిప్ ఇది. కాలేజీకి బంక్ కొట్టినా, సినిమాకెళ్లినా, గొడవ పడినా ఈ బ్యాచ్‌లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటారు. కొత్తబంగారులోకం సినిమాలో ఫ్రెండ్స్‌లా మొదట్లో బిడియంగా మొదలైనా.. రాను రాను పెన్ను, పేపర్‌లా కలిసిపోయే స్నేహం ఇది.
college-frnds


పార్టీ ఫ్రెండ్స్

పార్టీలప్పుడు మాత్రమే కలిసే ఫ్రెండ్‌షిప్ ఇది. ఇందులో ఎవరైనా ఉండొచ్చు. క్లాస్‌మేట్, చిన్ననాటి దోస్త్, బిజినెస్ ఫ్రెండ్, ఆఫీస్‌ఫ్రెండ్ ఎవరైనా కావొచ్చు. పార్టీ ఉందని తెలిస్తే ఫ్రెండ్ తనతో పాటు మరో ఫ్రెండ్‌ని తీసుకొస్తే ఆ ఫ్రెండ్ కూడా ఫ్రెండ్ అయిపోయే టైప్ ఫ్రెండ్‌షిప్ ఇది. ప్రోత్సాహం, వినోదం, సలహాలు అన్నీ ఉంటాయి ఈ ఫ్రెండ్‌షిప్‌లో. ఈ బ్యాచ్‌లో అందరూ ఎంజాయ్‌మోడ్‌లోనే ఉంటారు.
party-frnds


జర్నీ ఫ్రెండ్స్

ఉద్యోగం, కాలేజీ మరేదైనా కావొచ్చు.. ప్రతిరోజూ బస్సు, రైలు ప్రయాణాలు చేసేవారికి దొరికే ఫ్రెండ్‌షిప్ ఇది. మనలాగే వారు కూడా రోజూ ప్రయాణాలు చేస్తుండొచ్చు. ఒక్కసారి పరిచయమైతే ప్రతిరోజూ వాళ్లు బస్సు ఎక్కే స్టేజీ రాగానే మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా వారి కోసం మన కళ్లు వెతుకుతాయి. పర్సనల్ విషయాలు పంచుకునేంత స్నేహం కాకపోయినా.. ఆ రోజు విశేషాలు మాత్రం పంచుకునేంత స్నేహం ఉంటుంది.
journey


టార్గెట్ ఫ్రెండ్స్

స్నేహం అంటేనే ఇద్దరి అభిప్రాయాలు కలువడం. దాంతో పాటే ఇద్దరి లక్ష్యం కూడా ఒకటే అయినప్పుడు కూడా స్నేహం చిగురిస్తుంది. ఒకే లక్ష్యం కోసం శ్రమించే ఇద్దరు వ్యక్తులు వారికి తెలియకుండానే స్నేహితులవు తారని మానసిక శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
target


ఆఫీస్ ఫ్రెండ్స్

మనతో పాటు మన ఫ్రెండ్ కూడా ఒకే సంస్థలో ఉద్యోగం చేయకపోవచ్చు. కానీ మనం చేసే సంస్థలో స్నేహితులను సంపాదించుకోవడం మాత్రం మన బాధ్యతనే. అందుకే ఇప్పటి తరం పనిచేసే చోట స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆఫీసు వాతావరణం ఈ ఫ్రెండ్‌షిప్ వల్ల ఈజీగా అనిపిస్తుంది. ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగితే అందరి కంటే ముందు వీరికే చెప్తాం. ఈ ఫ్రెండ్స్‌కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తాం.


ఫ్రెండ్‌షిప్ రకాల గురించి రాసుకుంటూ, చెప్పుకొంటూ పోతే.. ఎంతైనా రాయొచ్చు.. ఏమైనా చెప్పొచ్చు. ఫ్రెండ్‌షిప్ అనే సబ్జెక్ట్ అలాంటిది. మీరు బాగా ఇష్టపడే ఫ్రెండ్‌తో ఈ ఫ్రెండ్‌షిప్ డేను ఎంజాయ్ చేయండి.
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే.


-ప్రవీణ్‌కుమార్ సుంకరి

407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles