చాయ్ బిజినెస్‌లోసూపర్‌స్టార్ ఉపమా విర్ధి


Mon,June 17, 2019 12:18 AM

చాయ్ చటుక్కున తాగరా బాయ్, చాయ్ చమక్కులే చూడరా భాయ్, చాయ్ ఖరీదులో చీపురా భాయ్, చాయ్ హుషారునే పెంచురా భాయ్ అంటూ చాయ్ గొప్పతనాన్ని మన కవులు ఎందరో పాటల రూపంలో వివరించారు. మనదేశంలో కొందరి పరిస్థితి నిద్రలేచింది మొదలు.. పడుకునే వరకు టీతో ముడిపడి ఉంటుంది. ఎవరైనా ఇంటికి వెళితే చాలు టీ తాగుతారా అంటారు. చికాకుగా ఉన్నా టీ తాగుతారు. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు టీ తాగుదాం అంటూ స్టాల్‌కు వెళ్తారు. జీరాచాయ్, అల్లంచాయ్, చాకొలేట్ చాయ్, లెమన్‌చాయ్ ఇలా చెప్పుకుంటే ఎన్నో రకాల చాయ్‌లు. భారతీయ బ్రాండ్ చాయ్‌ని ఆస్ట్రేలియాలో పరిచయం చేయడమే కాకుండా బిజినెస్‌గా ఎంచుకుని విజయం సాధించిన
ఉపమావిర్ధి సక్సెస్‌మంత్ర.

Tea
చాయ్.. మన దేశంలో ఉదయం లేవగానే పలకరించే వేడివేడి పానీయం. తేనీరుగా పిలిచే చాయ్‌తో తేనీటి విందులే చేస్తారంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు కేవలం తేయాకుతో చేయగలిగే చాయ్ ఇప్పుడు అనేక ప్లెవర్లకు విస్తరించింది. అనేక రకాల సుగంధాలతో మిలిళితమై ఎన్నో రకాల రుచులను అందిస్తున్నది. అలాంటి భారతీయ తేనీరు విదేశాల్లోనూ యమా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో అయితే భారతీయ సాంప్రదాయ చాయ్‌కి పెద్ద క్యూ లైనే ఉంది. అది కూడా మన భారతీయురాలు నడుపుతున్న టీస్టాల్. దాన్నే బిజినెస్‌గా మలుచుకుని దూసుకుపోతున్నది ఉపమావిర్ధి. చాయ్‌వాలీగా ఉపమావిర్ధి మన భారతీయ చాయ్‌కి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తున్నది.

అన్న పెళ్లిలో..

ఉపమావిర్ధి స్వస్థలం చండీగఢ్. ఇంటికి ఎవరు వచ్చినా టీ ఇచ్చే బాధ్యత తీసుకునేదట. అన్న పెళ్లప్పుడు ఇంటికి వచ్చిన అతిథులందరికీ వేల కప్పుల టీ కాచి అందించిందట. మా పేరెంట్స్ అలసిపోయి ఇంటికి రాగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్.. ఉపమా.. నీ చేతులతో టీ పెట్టివ్వవా? అనే. స్కాలర్‌షిప్ మీద ఆస్ట్రేలియా వెళ్లాను. అక్కడ మా హాస్టల్లో ఉన్న వాళ్లందరికీ టీ పెట్టిచ్చేదాన్ని. నా టీ కోసమే వాళ్లంతా ఒక చోట గ్యాదర్ అవడం మొదలుపెట్టారు. అంతకుముందు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటేది అంటుంది విర్ది. వాళ్ల తాత ఆయుర్వేద వైద్యుడు. చాయ్ కాచడంలో దిట్ట. విర్ధి చిన్నపిల్లగా ఉన్నప్పుడు హెర్బల్ టీ కాచడం ఎలాగో నేర్పాడట. ఇష్టంగా నేర్చుకుంది. కానీ, దాని మీద శ్రద్ధ పెట్టే అవకాశం తాను ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదట. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి, లాలో అడ్మిషన్ దొరికాక అప్పుడొచ్చింది ఆమెకు ఆలోచన.

పార్ట్‌టైంగా...

తన చాయ్‌కి క్రేజ్ పెరగడంతో లా చదువుతూనే పార్ట్ టైమ్‌గా టీ కాచడం మొదలుపెట్టింది విర్ధి. కేవలం ఇండియన్స్‌కే కాక ఆస్ట్రేలియన్స్‌కి కూడా ఈ ఇండియన్ గర్ల్ చేస్తున్న దేశీ చాయ్ పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. రెండంటే రెండేళ్లలోనే విర్ధి బ్రాండ్ టీకి అక్కడ విపరీతమైన క్రేజ్ వచ్చింది. సోషల్ సర్కిల్ ద్వారా ఆమె చేసిన చాయ్‌కి అందరూ ఫిదా అయిపోయారు. విర్ధి ఎక్కడికి వెళ్లినా టీ చేసివ్వవా అని అడుగుతారట. ఆమె లా పూర్తయ్యేలోపు చాయ్‌వాలీగా ఫేమస్ అయిపోయింది. చిత్రంగా లాయర్‌గా ప్రాక్టీసే పార్ట్‌టైమ్ అయిపోయి చాయ్‌వాలీగా ఫుల్‌టైం బిజీ అయింది. ఇంకేముందీ ఆన్‌లైన్‌లో చాయ్ బిజినెస్ ప్రారంభించింది. వెరైటీ టీలను కాచడమెలాగో నేర్పి స్తున్నది. టీ, దానికి సంబంధించిన అనుబంధ ఉత్పత్తులను అమ్ముతున్నది. వీటికి ఎంత డిమాండ్ అంటే యూరప్ నుంచి కూడా ఆమెకు ఆర్డర్స్ వస్తుంటాయి. వర్క్‌షాప్స్ నిర్వహించమని రిక్వెస్టులూ అందుతుంటాయి. ఆ మేరకు నిర్వహిస్తుంటుంది కూడా.
Chaie

తాత నేర్పిన చాయ్

విర్ధి తాత ప్రీతమ్ సింగ్ విర్ధి ఆయుర్వేద వైద్యుడు. విర్ధి బాల్యంలో ఆయన సుగంధ ద్రవ్యాలతో రకరకాల టీలు తయారు చేసేవాడట. టీ తయారీలో వాడే పదార్థాలు, వాటి మోతాదులు మారుస్తూ ఆయన తయారుచేసే టీలు ఔషధగుణాలు కూడా కలిగిఉండేవట. వాటి ప్రభావాన్ని దగ్గరనుంచి చూసిన విర్ధికి చాయ్ అంటే చెప్పలేనంత ఇష్టం, గౌరవం ఏర్పడిపోయాయట. అప్పటినుంచీ చాయ్ పెట్టటంలో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఇంట్లోవాళ్లకి అందిస్తూ ఉండేది. భారతీయులకు టీతో ఉన్న అనుబంధం వెలకట్టలేనిది. అసలు.. ఇండియాలో చాయ్ వాసన రాని ఇల్లుంటుందా? ప్రతి ఇల్లాలూ చాయ్ వాలీనే! కానీ, అదేంటో ఎక్కడ చూసినా.. చాయ్ వాలాలే కనిపిస్తూ ఉంటారు. చాయ్‌వాలీ ఒక్కరూ కనిపించరు. అందుకే.. ఆ చాయ్‌వాలీ నేనే ఎందుకు కాకూడదు అనిపించింది. లా చేశాక చాయ్‌వాలీగా మారిపోతానని ఇంట్లో చెప్పేశా! ముందు అభ్యంతరం చెప్పినా తర్వాత ఒప్పేసుకున్నారు అంటూ హుషారుగా చెప్తున్న విర్ధి ప్రస్తుతం రకరకాల దినుసులు, సుగంధాలతో 3 రకాల టీ బ్రాండ్సును మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆర్ట్ ఆఫ్ చాయ్ పేరుతో టీ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్త్తున్నది.

11 సుగంధ ద్రవ్యాలతో..

అస్సామ్ టీ పొడికి దాల్చిన చెక్క, జాపత్రి, పసుపు మొదలైన 11 సుగంధ ద్రవ్యాలను చేర్చి కాచే టీ విర్ధి సిగ్నేచర్ టీ. ఆర్గానిక్ బ్లాక్ టీ, చాక్లెట్ ఫ్లేవర్డ్ టీ.. ఇలా విర్ధి రకరకాల టీలు తయారుచేస్తూ ఉంటుంది. కానీ, ఇన్ని టీలు కాస్తుంది కాబట్టి విర్ధి టీ ఫ్యాన్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే! విర్ధి కాఫీ అభిమాని. అదేంటి? అని ఎవరైనా అడిగితే టీ నా హస్బెండ్ అయితే కాఫీ నా ఆన్ అండ్ ఆఫ్ బాయ్‌ఫ్రెండ్ అంటూ నవ్వేస్తుంది. అన్నట్టు ఉపమా అనే పేరు గురించి కూడా చెప్పుకోవాలిగా! ఆ పేరుకు పంజాబీలో సర్వ శక్తిమంతుడిని కీర్తించడం అని అర్థం.
Tea-Chaie

ఆవార్డులు

అద్భుతమైన రుచులతో రకరకాల టీపొడుల్ని తయారుచేసి మార్కెట్ చేస్తున్న విర్ధిని ఆస్ట్రేలియా ప్రభుత్వం 2016 బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కూడా సత్కరించింది. ఇండియన్ ఆస్ట్రేలియన్ బిజినెస్ అండ్ కమ్యూనిటీ అవార్డ్స్ (ఐఏబిసిఏ)కు కూడా ఎంపికైంది ఉపమా విర్ధి. మెల్‌బోర్న్ టీ ఫెస్టివల్‌కు ప్రత్యేక అతిథిగా ఆమెకు ఆహ్వానం అందింది. మన దేశ చాయ్ రుచిని ప్రపంచమంతటికీ తెలియజేయాలన్నదే నా లక్ష్యం అంటున్నది ఉపమా విర్ధి. నేను గొప్ప లాయర్నే కాదు, అంతకంటే గ్రేట్ చాయ్ వాలీని కూడా అంటున్నది ఉపమా.

టీ తయారీలో శిక్షణ

ప్రస్తుతం విర్ధి చాయ్ బిజినెస్ ఒక రేంజిలో ఉంది. ఇటీవలే సిడ్నీ టీ ఫెస్టివల్ లో విర్ధి తన బ్రాండ్ టీని పరిచయం చేశారు. అంతేకాదు.. అద్భుతమైన టీ ఎలా తయారు చేయాలో అక్కడికి వచ్చిన వారందరికీ నేర్పించారు. కేవలం టీ తయారు చేయడమే కాదు.. ఆన్‌లైన్ టీ స్టోర్ కూడా నడుపుతున్నారు. వెరైటీ టీ ప్రాడక్ట్స్, క్యాండిల్స్, పాట్స్, కెట్టిల్స్, స్టెయినర్స్ అమ్ముతున్నారు. అందులో చాకొలేట్ టీ వెరీ వెరీ స్పెషల్. ఇవి కాకుండా అప్పుడప్పుడూ టీ చేయడంపై వర్క్‌షాప్ కూడా కండక్ట్ చేస్తారు. ఔత్సాహికులకు ఏలకుల వంటి సుగంధ ద్రవ్యాలను వేసి పరిమళభరితమైన తేనీరు తయారు చేయడమెలాగో నేర్పిస్తున్నారు.

1004
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles