అమ్మకు బ్రహ్మకు మధ్యన!


Sun,June 16, 2019 01:47 AM

నిలువెత్తు ప్రేమకు నిదర్శనం నాన్న. అమ్మ తరువాత అంతటి నిస్వార్థ ప్రేమను పంచేది నాన్నమాత్రమే. అందుకే ఏ పసిబిడ్డకైనా నాన్నొక ప్రపంచం. నాన్నొక నడిచే దేవాలయం. అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెన. ముద్దుపెట్టుకొని గుండెకత్తుకున్నా.. కోపగించుకొని కఠువుగా మాట్లాడినా బిడ్డలపై ప్రేమతోనే. నాన్నతో ప్రతి ఒక్కరికీ ఎన్నో మధురానుభూతులుంటాయి. ఆ నాన్నను మనసారా ఆలింగనం చేసుకొని.. మధుర జ్ఞాపకాల్లో మునిగిపోయే రోజే ఇది. బుల్లితెర తారలు.. తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు. ఆ విశేషాల సమాహారమే ఈవారం సింగిడి ఫాదర్స్‌డే స్పెషల్.

విలువలు నేర్పించారు..


fathersday1
మా నాన్న బాధ్యతకు ప్రతిరూపం. ఆయనే నాకు భద్రత, భరోసా. నన్ను అల్లారుముద్దుగా పెంచారు. ఆటపాటలతో పాటుగా, ఆత్మస్థైర్యమూ నేర్పించారు. నాలో లోపాలు సరిచేసి నా భవితకు చక్కటి పునాది వేశాడు నాన్న. తాను వెనకుండి, నన్ను విజయపథం వైపు నడిపించారు. అలాంటి నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోను. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు బిడ్డగానే పుట్టాలి. ప్రతి విషయంలో నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం.. నాన్న ఇచ్చిన ప్రోత్సాహం. ఆయనంటే నాకెంతో గౌరవం. నాన్నతో నా ప్రతి విషయాన్ని పంచుకుంటాను. నాన్నతో గడిపిన క్షణాలు మధురమైనవి. ఎలాంటి కష్టమెదురైనా, క్లిష్టమైన సమస్యలు చుట్టుముట్టినా.. నేను డీలా పడకుండా తోడున్నారు. నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఆయనెంత కష్టపడ్డారో నాకు తెలుసు. అందుకే నాన్నంటే గౌరవం, ప్రేమ.
- యామిని, ముత్యాలముగ్గు ఫేం

నడక.. నడత నేర్పారు!


fathersday4
నాన్నకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. ఇప్పటికీ నాన్నే నా ప్రపంచం. చిన్నప్పుడు నడక నేర్పిన నాన్న.. పెద్దయ్యాక జీవితంలో ఎలా ఉండాలో నేర్పారు. ఆయన ప్రేమను మాటల్లో వర్ణంచలేను. నాకు తెలిసి నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. నా సూపర్ హీరో నాన్న. ఆయనకు నేనొక బుల్లి యువరాణిని. ఇప్పటికీ నన్ను అలాగే చూస్తారు. నా జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ఇప్పటికీ నాకు సపోర్టివ్‌గానే ఉన్నారు. ప్రతీ విషయంలోనూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. నా జీవిత ప్రయాణంలో నాన్నే గురువు. నేను నాన్నతో ఇప్పటికీ అన్ని విషయాలూ పంచుకుంటా. ఏదీ దాచను. ఇప్పటికీ మేము చిన్న పిల్లల్లా కొట్లాడుకుంటాం, నవ్వుకుంటాం, కోప్పడతాం.. అన్ని మర్చిపోయి హాయిగా ఉంటాం. ఏ ఒక్క క్షణమనీ చెప్పలేనుగాని.. నాన్నతో నాకు ప్రతీక్షణం ఓ మధురమైన జ్ఞాపకమే.
- పూజా మూర్తి, గుండమ్మకథ ఫేం

అలుపెరగని రథసారధి


fathersday2
కన్నబిడ్డల అభివృద్ధి కోసం అలుపెరగని సైనికుడిలా పోరాడుతున్నారు నాన్న. తనకంటే గొప్పవారిగా మమ్మల్ని తీర్చిదిద్దేందుకు ఆయన పడుతున్న శ్రమ మాటల్లో చెప్పలేనిది. ఆయన నుంచే నాకు కష్టపడడం అలవాటైంది. కుటుంబం కోసం ఎంత కష్టపడినా.. మాతో ఒక స్నేహితుడిగానే ఉన్నారు. నా చదువుల దగ్గర్నుంచి.. సీరియల్ ఇండస్ట్రీ వరకూ ప్రతి విషయంలో నాన్న ప్రోత్సాహం మర్చిపోలేను. నేను ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నా.. నాకు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తూ మంచి మార్గంలో నడిపిస్తున్నారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సీరియళ్లు చేయగలుగుతున్నానంటే కారణం నాన్న. నాన్నతో కలిసి ప్రయాణించడం నాకు మర్చిపోలేని అనుభూతి నిస్తుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా మమ్మల్ని గమ్యానికి చేర్చారు. లవ్యూ పప్పా.
- మధుబాల, నిన్నే పెళ్లాడుతా ఫేం

నాన్నకల నెరవేర్చా!


fathersday3
నాన్నకు నటుడు అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అందుకు మా నాయనమ్మ ఒప్పుకోలేదు. తనకు మా నాన్న ఎక్కడ చెడిపోతాడేమోనని భయం. ఆ కారణంగా ఆయన కల నెరవేరలేదు. అయినా ఏనాడు ఆయన చింతించలేదు. కుటుంబం కోసమే జీవితాన్ని త్యాగం చేశారు. మమ్మల్ని ఏ లోటూ లేకుండా పెంచారు. చిన్నప్పుడే నా ఆసక్తిని గమనించి నన్ను ప్రోత్సహించారు నాన్న. నా కెరీర్ కోసం ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చేశారు. నేను ఇక్కడే ఉంటూ ప్రయత్నాలు మొదలు పెట్టా. నా ప్రతిభను గుర్తించి తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. నాన్న కల నెరవేర్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఒకసారి దుబాయ్‌కి కుటుంబంతో సహా వెళ్లాం. అప్పుడే నాన్నలోని నటుడ్ని, యువకుడ్ని చూశాను. చిన్నపిల్లాడిలా మాతో కలిసి ఎంజాయ్ చేశారు. ఆయన వల్లే ఇదంతా. మేమంతా సంతోషంగా ఉన్నామంటే కారణం నాన్న.
- అలీ రిజా, మాటే మంత్రం ఫేం

నాన్నే నాకు ఆదర్శం


fathersday5
నాలో నిత్య స్ఫూర్తిని రగిలిస్తున్న దీపం నాన్న. ఆయనే నా హీరో. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. పలు పోటీలకు నాన్నతో కలిసి దేశం మొత్తం తిరిగాను. ఆయనే నా ఇష్టాన్ని కాదనకుండా.. నన్ను ప్రతీ పోటీకి తీసుకెళ్లేవారు. స్టేజీపై నేను డాన్స్ చేస్తుంటే.. కింద నాన్న సంబరపడేవారు. ఆయనలో నాకు నచ్చే గుణం ఓపిక. మాతో ఎంతో సరదాగా ఉంటారు. ఇప్పటికీ నా కెరీర్‌కు సంబంధించి విజయవంతమైన సలహాలు ఇస్తుంటారు. ప్రతీ సందర్భంలోనూ నాన్నగా నాకు తోడు ఉన్నారు. నాన్నతో జరుపుకునే ప్రతి దీపావళి నాకు ప్రత్యేకమే. చిన్నప్పుడు నాతో టపాసులు కాల్పించేవారు నాన్న. అప్పటి నుంచి అవంటే భయం పోయింది. మేమే దీపాలు తయారు చేసి, వెలిగించేవాళ్లం. ప్రతి విషయంలోనూ నేను నాన్ననే అనుసరించేవాడ్ని. ఆయనే నాకు ఆదర్శం. నా ప్రపంచం. నన్ను వెన్నంటి నడిపించే నా విజయం నాన్న.
- ప్రజ్వల్ పీడీ, ముత్యాల ముగ్గు ఫేం

- డప్పు రవి

3041
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles