5మంచి మదుపుకి సూత్రాలు


Sat,July 21, 2018 01:27 AM

స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిల వద్దే సూచీలు పడుతూలేస్తున్నాయి. చాలా పోర్ట్‌ఫోలియోలు అమ్మకాల ఒత్తిడికి నవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో మదుపరులు కాస్త సమయస్ఫూర్తితో అడుగులు వేస్తే లాభాలు వెన్నంటే నిలుస్తాయి. మదుపులపై వాన్‌గార్డ్ వ్యవస్థాపకులు జాక్ బోగ్లే ఇచ్చిన కొన్ని సలహాలను చూస్తే..

1.మదుపు చేయల్సిందే

మదుపరులు పెట్టుబడులను క్రమం తప్పకుండా కొనసాగించాలి. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు లేకపోతే మీరు సాధించేదేమీ లేదు. స్వల్పకాలిక ఒడిదుడుకులను పక్కనబెడితే స్టాక్ మార్కెట్ ఎప్పుడూ పురోగమిస్తూనే ఉంటుంది. పెట్టుబడులు క్రమేణా పెరుగుతూపోతూనే ఉంటాయి. దేశ, విదేశీ ప్రతికూల పరిణామాలు, ఆర్థిక మాంద్యాలు చోటుచేసుకున్నప్పుడు మార్కెట్ పతనం సహజంగానే ఉంటుంది. అంతమాత్రం చేత తిరోగమనానికే పరిమితం కాదు. కాబట్టి పెట్టుబడులను ఎప్పుడూ వీడొద్దు.

2.కాలమే మన నేస్తం

పెట్టిన పెట్టుబడిపై ఆశించిన ప్రతిఫలం పొందాలంటే కాస్త సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం కోసం ఓపిగ్గా వేచిచూడాలి. తొందరపాటుతో ప్రయోజనం ఉండదు. ఒకసారి పెట్టుబడులు పెట్టిన తర్వాత వాటిపై లాభాలు అనేవి మన చేతుల్లో ఉండవని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు తప్పక లాభాలనిచ్చే షేర్లూ నష్టాలను చూపవచ్చు. అంతమాత్రం చేత సత్వర నిర్ణయాలు తీసుకోరాదు. కొంతకాలం ఆగితే ఆ షేర్లే లాభాలనివ్వడాన్ని చూస్తాం.

3.ఆకస్మిక నిర్ణయాలు వద్దు

క్షణికావేశం మనకు మొదటి శతృవు. పెట్టుబడుల విషయంలో ఎమోషన్స్‌ను పక్కన పెట్టండి. ఆకస్మిక నిర్ణయాలు ఎప్పుడైనా ప్రమాదకరమే. దేని గురించైనా పూర్తిగా తెలుసుకుని ముందుకెళ్లడం ఉత్తమం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల విషయంలోనూ మదుపరులకు ఇది అత్యంత ఆవశ్యకం. కాబట్టి భావోద్వేగాలకు తావివ్వరాదు. పెట్టుబడి ఓ చక్కని అలవాటు. ఎంత చిన్న మొత్తం అయినా, దాన్ని ఎంత చిన్న వయసులో అలవరుచుకుంటే అంత మేలు జరుగుతుంది. మొదలు పెట్టిన తర్వాత ఆపకండి. పెట్టుబడి రాబడులపై సహేతుకుమైన అంచనాతో ఉండండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ప్రయత్నాలు చేయకండి. చెప్పడం కన్నా చేయడం కష్టమే అయినప్పటికీ ఇన్వెస్టర్లు స్వల్పకాలిక రాబడులపై దృష్టి పెట్టకండి.

4.సరళంగా ఆలోచించండి

మదుపరులు అన్నివేళలా సరళమైన ఆలోచనలను కలిగి ఉండాలి. పెట్టుబడుల విజయం వెనుక ఉన్న రహస్యం ఇదే. స్టాక్ మార్కెట్‌లో వందలాది షేర్లు ట్రేడవుతూ ఉంటాయి. దీంతో అన్నింటిలోనూ పెట్టుబడులు పెట్టాలనే దుందుడుకు పోకడ నష్టాలకు దారితీయవచ్చు. తక్కువ లాభాలను తెచ్చిపెడుతున్నా.. నిలకడైన ప్రదర్శననిస్తున్న షేర్లను పెట్టుబడులకు ఎంచుకోవడం మంచింది. మార్కెట్ రిస్క్‌లకు దూరంగా ఉన్న షేర్లపై దృష్టి పెట్టాలి.

5.అసలు విలువ తరుగదు

షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. ప్రతీదానికి ఓ విలువ అంటూ ఉంటుంది. ప్రస్తుత ధర ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా.. కాస్త ఆలస్యంగానైనా మార్కెట్‌లో దాని అసలు విలువను అది తిరిగి సంతరించుకుంటుంది. కాబట్టి ప్రాథమిక మూలాలపై విశ్వాసాన్ని కోల్పోకూడదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సున్నితమైన అంశాల ప్రాతిపదికన కొనసాగుతుంది. భయాందోళనల మధ్య నష్టపోయినా.. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.
-కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు, వెలాసిటీ,వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
knk@wealocity.com

160
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles