23 కూరల నాగన్న హోటల్


Wed,July 4, 2018 11:37 PM

మనం ఏదైన హోటల్‌కు వెళ్లి భోజనం చేస్తే ఎన్ని కూరలు వడ్డిస్తారు? ఒక కూర, పప్పు, చారు, సాంబారు, చట్నీ, ఒక పెరుగు ఇంతే కదా! మహా అయితే ఇంకో కూర. అంతకంటే ఎక్కువ వడ్డించే అవకాశమే లేదు. కూర సరిపోక మళ్లీ అడిగితే అదనపు చార్జీ వేసే హోటల్స్ కూడా ఉంటాయి. కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి లోని నాగన్న హోటల్‌కు వెళ్తే మాత్రం మనం నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆ హోటల్‌లో ఒకటి రెండు కాదు, పది పన్నెండు అంతకన్నా కాదు ఏకంగా 23 రకాల కూరలు వడ్డిస్తారు. నమ్మకం కుదరడం లేదా? ఒకసారి కూసుమంచి వెళ్లిరండి మరి!
vegetables
మన ఇంట్లో భోజనం అంటే అన్నం, కూర, పప్పు, సాంబారు, పెరుగు.. ఒక పచ్చడి. అదే హోటల్‌కు వెళ్తే మరో రెండు కూరలు ఎక్కువ వడ్డిస్తారు. కానీ, ఖమ్మం జిల్లా కూసుమంచిలోని రామకృష్ణ (నాగన్న హోటల్) ఇందుకు భిన్నం. ఎప్పుడూ 23 కూరలు విస్తరి నిండుగా వడ్డిస్తారక్కడ.

అన్ని రకాల కూరలూ..

దోసకాయ పప్పు, తోటకూర, చిక్కుడుకాయ, బచ్చలికూర, పులుసు, పాలకూర, గోంగూర పచ్చడి, గోంగూర కూర, దోసకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఆలుగడ్డ, అనపకాయ, క్యారెట్, కాలీఫ్లవర్, బీట్‌రూట్, క్యారెట్, దొండకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ, కాకర వేపుడు, గోరుచిక్కుడు, వంకాయ కూరలతోపాటూ పలు రకాల చట్నీలు, పచ్చళ్లు, సాంబారు, పెరుగు, అప్పడం ఉంటాయి. ఇక్కడ పెరుగు కూడా ప్రత్యేకమే. ఎందుకంటే, వారు స్వయంగా పెంచిన గేదెల పాలతో తోడు పెడతారు.

మౌఖిక ప్రచారమే..

నాణ్యతే నమ్మకాన్ని నిలబెడుతుంది, వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది అన్న ప్రాథమిక సూత్రాన్నే నమ్మారు నాగన్న. దానికి తగ్గట్లుగానే పెద్ద బోర్డులు కానీ, ఆకర్షణ కోసం చేసే ఆడంబరపు అలంకరణలు కానీ ఏవీ అక్కడ కనపడవు. సాధారణ కుర్చీలు, టెబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ తిని వెళ్ళిన వారి మౌఖిక ప్రచారం ఆధారంగానే ఒకరినుంచి ఒకరికి విషయం తెలుస్తూ ఇప్పటికి అనేక మంది కస్టమర్లను సంపాదించుకున్నారు.రాష్ట్ర రహదారి కావడం వల్ల, వెయ్యేళ్ళ ప్రాచీన చరిత్ర కల కూసుమంచి గణపేశ్వరాలయం ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు ఈ హోటల్ భోజనం చేసి ఆ తర్వాత తమకు తెలిసినవారు, మిత్రులూ బంధువులకు కూడా చెపుతుంటారు. ఈ హోటల్ ఖమ్మం- హైదరాబాద్ రహదార్లో కూసుమంచి కూడలి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. కార్లల్లో ఖమ్మం, భదాద్రి కొత్తగూడెం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే వారిలో చాలామంది ఈ హోటల్లో భోజనం చేస్తుంటారు.

ఎవరీ నాగన్న..

బెల్లంకొండ నాగన్న ఈ హోటల్ వ్యవస్థాపకులు. 1995 ఫిబ్రవరి 12న ఈ హోటల్‌ను రహదారికి పక్కన చిన్న గుడిసెలో ప్రారంభించారు. హోటల్ యజమాని అయినప్పటికీ మొదట నాగన్నే స్వయంగా భోజనం వడ్డించేవారు. హోటల్‌కి వచ్చే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నిర్వహణకు సిబ్బందిని కూడా నియమించారు. నాగన్నకు భార్య మణెమ్మ, కూతర్లు మంజుల, గాయత్రి, కుమారుడు వెంకట రామకృష్ణ ఉన్నారు.

ప్రారంభంలో తప్పని కష్టాలు

ఇరవైకి పైగా నాణ్యమైన కూరలుంటాయి అనే మౌఖిక ప్రచారం చాలామందిని ఈ హోటల్‌ను ఆకర్షించేలా చేసింది. కానీ, కూరగాయల రేట్లలో అనేకసార్లు హెచ్చుతగ్గులు రావడం, ఇన్ని రకాల కూరలూ వండుతున్నప్పటికీ కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా ఖర్చుకావడం వల్ల మిగిలిపోవడం, చిన్న ఊరు కాబట్టి కొన్ని రోజులు అస్సలు కస్టమర్లు సరిగా రాకపోవడం, లేదా ఏదైనా ప్రయాణంలో వున్న వారు ఒక్కసారిగా మధ్యాహ్నం భోజనానికి వచ్చేయడం, అంతమందికీ హడావిడిగా ఇన్నిరకాల కూరలను తయారు చేయించడం ప్రారంభించిన కొత్తలో కష్టంగా ఉండేదట. కానీ, రాను రానూ ప్రణాళికా బద్ధంగా చేయటం అలవాటు పడిన తర్వాత ఈ సమస్యను అధిగమించినట్లు నాగన్న చెబుతారు.

ప్రముఖుల ప్రశంసలు

సినీనటులు రవితేజ, తొట్టెపూడి వేణు, తనికెళ్ళ భరణి దర్శకులు వంశీ వంటి వారు పలు సందర్భాల్లో ఈ హోటల్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

vegetables2

అద్బుతంగా ఉంది

ఇక్కడ భోజనం ఇంత చక్కగా ఉంటుందని అనుకోలేదు. ఇన్ని రకాల కూరలు ఐదు రకాల పచ్చళ్లు పెరుగు, సాంబార్ చాలా బావున్నాయి. ఇన్ని రకాలు పెట్టి కూడా కేవలం రూపాయిలు 80కి ఫుల్ భోజనం పెట్టడం నిజంగా గొప్ప విషయం. చాలాసార్లు అంటుంటే విన్నా కానీ నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంత చక్కటి వంటలతో దగ్గర ఉండి ఇంట్లో పెట్టినట్లు పెట్టడం అభినందనీయం.
-డా॥ చండ్ర నిఖిత, మమత హాస్పిటల్, ఖమ్మం

చాలా బావుంది..

మంచి భోజనం, చక్కటి పెరుగు, పచ్చళ్లు నోరూరించే విధంగా ఉన్న వంటకాలు తృప్తినిచ్చే భోజనాన్ని అందించారు. గతంలో విన్నాను కానీ నేనూ ఒకసారి ఇక్కడికి వచ్చి తిన్నాను. 23 రకాలతో ఇలాంటి భోజనం ఎక్కడా తినలేదు. ఇంత చక్కటి భోజనం పెట్టడం నిజంగా ఈ రోజుల్లో చాలా అరుదు.
-సాంబశివరావు, గుంటూరు

1994లో కూసుమంచిలో రేకులషెడ్‌లో హోటల్ పెట్టాను. అప్పటి నుండి 23 రకాల కూరలు వండి వడ్డించటం అలవాటుగా మారింది.కూరగాయలు ఎంత రేట్లు ఉన్నా నిత్యం వండుతామని తెలిపారు. మార్కెట్‌లో దొరికేవి తీసుకుంటాం లేక పోతే ఖమ్మం నుండి తెప్పిస్తామని అన్నారు. నలుగురి కడుపు నింపాననే సంతృప్తి తప్ప సంపాదించుకోవాలన్న ఆలోచన నాకు లేదు. ఆత్మసంతృప్తి మిగులుతుంది. దీనికోసం ప్రచార ఆర్భాటాలు చేయలేదు. ఒక్కసారి ఇక్కడ తిన్నవాళ్లు.. మళ్లీ ఇక్కడికే వస్తారు. లేదంటే తెలిసిన వాళ్లను పంపిస్తారు. క్వాలిటీలో ఎలాంటి రాజీ పడకుండా హోటల్ నిర్వహిస్తున్న.ఒక్క భోజనానికి ఐదు రూపాయిలు వచ్చినా చాలు.
-బెల్లంకొండ నాగన్న, హోటల్ యాజమాని

5342
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles