10 ఏండ్ల కవయిత్రి!


Sat,August 4, 2018 11:41 PM

తల్లికి సాహిత్యమంటే ప్రాణం. పలు ప్రాంతాల్లో జరిగే కవి సమ్మేళనాల్లో తన తల్లి ప్రతిభను కళ్లారా చూసింది. తాను కూడా సాహిత్యంపై మక్కువ పెంచుకున్నది. తల్లి చూపిన బాటలోనే కవితలు రాయడం మొదలు పెట్టింది. అవి విమర్శకుల ప్రశంసలు పొందడంతో కవి సమ్మేళనాల్లో పాల్గొని, చిన్నతనంలోనే తన ప్రతిభను చూపుతున్నదీ చిన్నారి కవయిత్రి.
Santhoshi-Kavi
పిట్ట కొంచెం కవిత ఘనం.. అన్నట్లుగా ఈ పదేళ్ల బాలిక పెద్ద వేదికలపై కవితాగానం చేస్తూ.. ఆహుతులను అబ్బుర పరుస్తున్నది. అటు చదువులోనూ ఇటు కవితా రచనలోనూ తన ప్రతిభను కనబరుస్తున్నది. ఇటీవల యాదాద్రిలో శిల్పకళాతోరణం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో శిలా శిల్పి అనే అంశంపై తన కవితను వినిపించి అందరినీ విస్మయానికి గురించేసిందీ చిన్నారి. అంతేకాదు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సులో కూడా స్థానం సంపాదించింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాకు చెందిన కవయిత్రి పాలకుర్తి నాగజ్యోతి కూతురు సంతోషి బాల కవయిత్రిగా పేరుతెచ్చుకుంటున్నది.


Santhoshi-Kavi4

అమ్మ స్ఫూర్తిగా..

జిల్లా కేంద్రంలోని డీఆర్డీఏ కార్యాలయంలో సహాయ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్న పాలకుర్తి నాగజ్యోతి, వేణుగోపాల్‌ల ఏకైక కూతురు సంతోషి. పదేళ్ల వయసున్న ఈ చిన్నారి కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నది. ఇప్పటి నుంచే తల్లికి తగ్గ తనయగా ఎదుగుతున్నది. కవిమిత్ర, సహస్ర కవిరత్న, విశిష్ట కళారత్న తదితర పురస్కారాలు పొందిన నాగజ్యోతి జిల్లాలో ప్రముఖ కవయిత్రిగా గుర్తింపు పొందారు. సామాజిక స్పృహతో కవితలు రాస్తూ ఎందరో మన్ననలు పొందుతున్నారు. తన కూతురిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. తల్లి నిత్యం కవితలు రాస్తుండటం, కవి సమ్మేళనాల్లో పాల్గొనేందుకు ప్రాధాన్యం ఇస్తుండటాన్ని గమనించిన సంతోషి.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సొంతంగా కవిత రాసి తొలి ప్రయత్నం చేసింది. చదివేది ఆంగ్ల మాద్యమం అయినా తెలుగుభాషపై పట్టు పెంచుకొంటూ ప్రాస పదాలను ఉపయోగిస్తున్నది. తల్లి నాగజ్యోతి ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లి వచ్చే సరికి అ అంటే అమ్మ అనే కవితను రాసింది.

Santhoshi-Kavi3

బాల కవయిత్రిగా తొలి పరిచయం

ఐదో తరగతి చదువుతున్న సంతోషి తాను రాసిన తొలి కవితను ఎంతో ఆతృతతో అమ్మకు చూపించింది. అంత చిన్న వయసులోనే సంతోషి చూపిన చొరవను మెచ్చుకున్న నాగజ్యోతి ఆ కవితను వెంటనే ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. సోషల్ మీడియాలోని ఈ కవితను ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు గోపి గమనించి కవిత రాసిన సంతోషిని అభినందించారు. ఆ పోస్టు చూసిన అంతర్జాతీయ గజల్ కవి రోచిష్మాన్ సంతోషి ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. గజల్ వేదిక పలుకు సంకలనంలో ఆ కవితను ముద్రించారు. ఈ ఏడాది జనవరి 28న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషికి అహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ గజల్ కవి రోచిష్మాన్, నానీల నాన్న గోపి, ప్రముఖ సాహితీవేత్త బిక్కి కృష్ణ చిన్నారి సంతోషిని బాల కవయిత్రిగా పరిచయం చేసి ప్రత్యేకంగా సత్కరించారు.


Santhoshi-Kavi2

యాదాద్రి కవి సమ్మేళనంలో...

యాదాద్రి శిల్పకళా వైభవం తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కవి సమ్మేళనంలో పాలుపంచుకున్న పాలకుర్తి సంతోషి తన కవితతో అందర్నీ అలరించింది. అందరి ముందు ధైర్యంగా కవితాగానం చేసి ప్రముఖుల ప్రశంసలందుకుంది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఈ చిన్నారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఏడాది ఫిభ్రవరి 10న బాసరలో నిర్వహించిన సహస్ర కవుల సమాపన సమ్మేళనంలోనూ ఈ బాలిక తన కవితలతో పలువురిని అకట్టుకొని ప్రముఖుల పురస్కారం అందుకున్నది.


సంతోషి రాసిన మొదటి కవిత

అ అంటే అమ్మ
అమ్మంటే అనురాగం
అమ్మంటే ఆత్మీయత
పస్తులుండైనా తన బిడ్డ ఆకలి తీరుస్తుంది అమ్మ
ఏడ్చిన పసిపాపకు లాలి పాటవుతుంది అమ్మ
అలిగిన బుంగమూతికి చందమామ అవుతుంది అమ్మ
చివరికి.. తన బిడ్డ కోసం ప్రాణమైనా ఇస్తుంది అమ్మ.

- జాడి హన్మయ్య
నమస్తే తెలంగాణ, కుమ్రం భీం ఆసీఫాబాద్ జిల్లా

333
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles