ఈ సమస్య తగ్గేనా?


Sat,February 3, 2018 02:07 AM

నాకు 39 సంవత్సరాలు. చిన్నప్పుడు మలబద్దకం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అంతగా లేదు. కానీ ఎప్పుడూ కడుపులో గ్యాస్ ఉంటుంది. తిన్నా తినకపోయినా ఇదే సమస్య. గ్యాస్ వల్ల ఆకలి కూడా కావట్లేదు. తినలేకపోతున్నాను. అయిదారేళ్లుగా పైల్స్ కూడా మొదలయ్యాయి. మలవిసర్జనకు పైల్స్ అడ్డం పడుతున్నాయి. దాంతో గ్యాస్ సమస్య మరింత ఎక్కువ అవుతున్నది. నా సమస్యకు శాశ్వతంగా పరిష్కారం ఏమీ లేదా?
- నీలిమ, వరంగల్

Dyspepsia
సాధారణంగా పిల్లలు పుట్టిన తరువాత మలబద్దకం వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, షుగర్ లాంటి సమస్యలున్నా, ఫ్యాటీ లివర్ ఉన్నా ఈ సమస్య రావొచ్చు. అయితే మీ విషయంలో లక్షణాలను గమనిస్తే నాన్ అల్సర్ డిస్లెక్సియా లేదా ఇరిటబుల్ బొవెల్ డిసీజ్ ఉన్నట్టుగా అనిపిస్తున్నది. గ్యాస్ సంబంధిత సమస్యలను డిస్పెప్సియా అంటారు. ఇవి అల్సర్ డిస్పెప్సియా, నాన్ అల్సర్ డిస్లెక్సియా అని రెండు రకాలు. డిస్పెప్సియాకు కారణం అల్సర్ అయినట్టయితే దానికి తగిన చికిత్స చేస్తే పూర్తి స్థాయిలో సమస్య తగ్గిపోతుంది. అయితే ముందుగా మీ సమస్య అల్సర్ డిస్పెప్సియానా లేక నాన్ అల్సర్ డిస్పెప్సియానా అనేది కనుక్కోవడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం థైరాయిడ్, మధుమేహ పరీక్షలు, గాల్ బ్లాడర్ లేదా కిడ్నీలో రాళ్లున్నాయో లేదో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, లివర్ ఫంక్షన్ టెస్టు చేయించుకోవాలి. మరో ముఖ్యమైన పరీక్ష ఎండోస్కోపీ. జీర్ణవ్యవస్థలో ఏ సమస్య ఉన్నా ఎండోస్కోపీతో తెలిసిపోతుంది. జీర్ణాశయం, ఆంత్రమూలం వంటి భాగాల్లో అల్సర్లున్నా, హెలికోబాక్టర్ పైలోరి ఇన్‌ఫెక్షన్ ఉన్నా, కేవలం పూత ఉన్నా ఎండోస్కోపీతో తెలుసుకోవచ్చు.

ఈ పరీక్షల్లో అల్సర్ డిస్లెక్సియా లేదని తేలితే అది నాన్ అల్సర్ డిస్లెక్సియా అని నిర్ధారణ చేసుకోవచ్చు. సాధారణంగా అల్సర్ డిస్పెప్సియా తొందరగా నయమవుతుంది. అల్సర్లకు తగిన చికిత్స ఇస్తే పూర్తిగా సమస్య పోతుంది. కాని నాన్ అల్సర్ డిస్పెప్సియాలో సైకోసొమాటిక్ లక్షణాలుంటాయి. అంటే డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలను ప్రేరేపిస్తాయి. కాబట్టి తగ్గడానికి కొద్ది సమయం తీసుకుంటుంది. దీనికి గ్యాస్ట్రోఎంటరాలజిస్టు ఇచ్చే చికిత్సతో పాటు మానసికంగా కౌన్సెలింగ్ కూడా అవసరం అవుతుంది. మీరు చెప్పినదాన్ని బట్టి మీకు నాన్ అల్సర్ డిస్పెప్సియా ఉండే అవకాశమే ఎక్కువ. కాబట్టి చికిత్స తీసుకుంటూ మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇకపోతే మీ మరో సమస్య పైల్స్. పైల్స్ వల్ల ఎప్పుడూ మలబద్దకం రాదు. అయితే పైల్స్ వల్ల మలవిసర్జనతో పాటు గాని, అనంతరం గాని రక్తం పడుతుంటే విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. అంతేగాకుండా కొద్దిరోజులు మలబద్దకం, కొన్నాళ్లు విరేచనాలు.. అవుతుంటే ఆల్టర్డ్ బొవెల్ హ్యాబిట్ అంటాం. ఇలాంటి లక్షణం ఉంటే వెంటనే కొలనోస్కోపీ చేయించుకోవాలి. మీ సమస్యలన్నింటికీ ఇప్పుడు మంచి మందులు, చికిత్సలూ ఉన్నాయి. మీరు మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకొని, తదనుగుణమైన చికిత్స తీసుకోండి.

డాక్టర్ రమేష్ కుమార్
సీనియర్ సర్జికల్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
ఉస్మానియా హాస్పిటల్
హైదరాబాద్

269
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles