ఈ తిమ్మిరి ఎందుకు?


Fri,May 4, 2018 11:34 PM

నా వయసు 38 సంవత్సరాలు. ఈ మధ్య కొంత కాలంగా నా కుడి అరచేతిలో తిమ్మిర్లు వస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే తిమ్మిర్లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాదు నా చేతి పట్టులో కూడా బలం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నది. దీనికి చికిత్స ఇతర వివరాలు తెలియజేయగలరు?
వసంత, ఆర్మూర్

Carpal-Tunnel
మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు కార్పల్ టనెల్ సిండ్రోమ్ అనే జబ్బుతో బాధ పడుతున్నారు. ఆర చేతిలోకి పయనించే మీడియన్ నాడి మీద ఒత్తిడి పడడం వల్ల ఇలా తిమ్మిర్లు వస్తాయి. థైరాయిడ్, షుగర్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని ఎక్కువగా ఈ సమస్య వేధిస్తుంది. ఒక్కోసారి మణికట్టు దగ్గర ఎక్కువ కదలికలు కలిగిన పనులు చేసేవారిలో కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమందిలో మీడియన్ నాడిమీద పడే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నపుడు చేతిలో స్పర్శ లేకపోవడం, బలం తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్ని నిర్ధారించడానికి ఎన్ సీ ఎస్ అనే పరీక్ష అవసరమవుతుంది. సమస్య మొదటి దశలో ఉన్న వారికి మణికట్టు దగ్గర పట్టీ వేసుకోవడం, కొన్ని రకాల మందులు వాడడం వంటి చికిత్సలు సరిపోతాయి. చేతిలో బలం కూడా తగ్గుతున్న వారికి చిన్న సర్జరీ అవసరమవుతుంది. ఈ సర్జరీతో సమస్య మరింత తీవ్రం కాకుండా నివారించవచ్చు. మీరు అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మీ సమస్యను నిర్ధారణ చేసుకొని చికిత్స ప్రారంభించడం మంచిది.

డాక్టర్ లలిత
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
హైదరాబాద్

674
Tags

More News

VIRAL NEWS