పే......ద్ద ప్రపంచం


Wed,September 5, 2018 11:15 PM

విశాలమైన ఈ ప్రపంచంలో..
చిన్నచిన్న భవంతులు.. వాహనాలు..
మైదానాలు.. ఇతరత్రా అన్నీచిన్నగానే కనిపిస్తాయి..
కానీ కొన్ని మాత్రం అసాధారణంగా పే..ద్దగా తయారు చేశారు మనుషులు..
ఇలాంటివి కొన్ని మాత్రమే ఈ భూమ్మీద ఉన్నట్లు నిర్ధారణ అయింది కూడా..
మరి ఆ పే..ద్ద ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమైపోయారా?
లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ..
సరికొత్త ప్రపంచంలోకి..

రాకెట్‌లను మోసుకెళ్లడానికి..


visesha
రెండు విమానాలను కలిపితే ఎంత ఉంటుందో.. ఈ విమానం అచ్చు అలాగే ఉంటుంది. దీని పేరు స్ట్రాటోలాంచ్. దీన్ని పార్క్ చేయాలంటే కనీసం ఫుట్‌బాల్ మైదానమంత స్థలం కావాలి. ఈ విమానాల పొడవు.. 360 అడుగులు. కేవలం రెక్కలు 385 అడుగుల మేర విస్తరించి ఉంటాయి. రాకెట్‌లను స్ట్రాటోస్పియర్ వరకు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. 6 ఇంజిన్లతో, 28 చక్రాలతో ఈ విమానం గంటకు 853 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.


టైటానిక్ కంటే..


Symphony
రాయల్ కరేబియన్‌గా పేరు పొందిన ఈ ఓడ పేరు.. సింఫనీ ఆఫ్ ద సీస్. టైటానిక్‌ని చూసే మనం ఔరా అనుకున్నాం. దానికంటే ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఓడ ఇది. 2లక్షల 30వేల టన్నుల బరువుతో ఈ ఓడను తయారు చేశారు. దీంట్లో ఒకేసారి 6వేల పైచిలుకు ప్యాసింజర్లు ప్రయాణించొచ్చు. కాకపోతే ఇందులో 2వేల మంది పనిచేసేవాళ్లు ఉంటారు. 1,188 అడుగుల పొడవు ఉన్న ఈ ఓడలో సుమారు 20వేల మొక్కలు కూడా ఉన్నాయట. గత సంవత్సరమే మొదలైన ఈ ఓడ స్పెయిన్‌లోని బార్సిలోనాకి అక్టోబర్‌లో చేరుకోనుందట. దీంట్లో పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, గదులు.. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంకా ఎన్నో ఉన్నాయి.

బరువైన ట్రక్..


Belaz
ఇరవై మోటార్ సైకిల్స్, పది కార్లు, రెండు బస్సులు పట్టే ట్రక్కులు మనకు సుపరిచితం. ఏకంగా 36 బస్సులను మోసే కెపాసిటీ ఉన్న ట్రక్కులను చూడడం ఇదే ప్రథమం. అందుకే దీన్ని ప్రపంచంలో అత్యంత బరువైన ట్రక్‌గా ముద్ర వేసేశారు. దీని పేరు బీలాజ్ 75710. ఎనిమిది చక్రాలతో, ఫోర్-వీల్ హైడ్రాలిక్ స్టీరింగ్‌తో మిగతా వాటికి భిన్నంగా ఈ ట్రక్ ఉంటుంది. ఇది ఒక టర్న్ తీసుకోవాలంటే కనీసం 20 మీటర్ల వ్యాసార్ధం కావాల్సిందే! 450 మెట్రిక్ టన్నుల బరువును అవలీలగా ఎక్కడికంటే అక్కడికి చేరవేస్తుంది. 20మీటర్ల పొడవు, 8 మీ. ఎత్తు, 9 మీ. వెడల్పుతో ఈ ట్రక్‌ని తయారుచేశారు. గంటకు 64 కి.మీ. వేగంతో ఈ ట్రక్ నడుస్తుంది.

నోరూరించే పిజ్జా..


world

పిజ్జా పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా! రోమ్ అంటే ప్రేమ నగరం. మరి అక్కడి ప్రేమతో పిజ్జా.. అది కూడా ప్రపంచంలోనే అతి పెద్ద పిజ్జాను తయారుచేశారు. డాక్టర్ సాచర్ గ్రూప్ ఇతరులు కలిసి గూల్టెన్ ఫ్రీ పిజ్జాను తయారు చేశారు. 48 గంటల పాటు కష్టపడి, 131 అడుగుల వ్యాసంతో ఉన్న పిజ్జాను తయారుచేశారు. అంటే.. ఒలింపిక్ ఆటల కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూలంతా. 50వేల పౌండ్ల బరువుతో, 5 టన్నుల టమాటాలను, 4.4 టన్నుల మోజిల్లా చీజ్‌ని ఉపయోగించి మరీ ఈ పిజ్జాను చేశారు.


పూల్.. పూల్..


San
రిసార్ట్‌లో చిన్న చిన్న స్విమ్మింగ్‌పూల్స్ ఉండడం సర్వసాధారణం. కానీ చిలీలోని సాన్ ఆల్ఫాన్సో డెల్ మార్ అనే ప్రైవేట్ రిసార్ట్‌లో ఎక్కడ లేనంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అది కూడా సముద్రానికి అతి చేరువలో. 2006లో ఈ స్విమ్మింగ్ పూల్‌ని ప్రపంచంలోనే అతి పెద్ద స్విమ్మింగ్ పూల్‌గా గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ల్లో స్థానం కూడా కల్పించారు. 3,323 అడుగుల పొడవు, సుమారు 20 ఎకరాల్లో ఈ పూల్ విస్తరించి ఉంది. దీంట్లో సుమారు 250 మిలియన్ లీటర్ల నీటిని నింపుతారు. అది కూడా పసిఫిక్ సముద్రంలోని నీటిని ఫిల్టర్ చేసి దీంట్లో నింపుతారట.


మే డే స్టేడియం


stadium

1989 మే 1న ఈ స్టేడియం ప్రారంభమైంది కాబట్టి దీనికి ఆ మే డే స్టేడియం అని పేరు వచ్చింది. కానీ దీని అసలు పేరు రన్‌గ్రాడో స్టేడియం. నార్త్‌కొరియాలో ఉన్న ఈ స్టేడియంలో 13వ వరల్డ్ ఫెస్టివల్ ఆఫ్ యూత్ అండ్ స్టూడెంట్స్ అనే పెద్ద ఈవెంట్ మొదటగా జరిగింది. దీంట్లో ఒకేసారి లక్షా 14వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉంది. 51 ఎకరాల్లో ఉన్న ఈ స్టేడియం ప్రత్యేకంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల కోసం కట్టించారు. ఈ స్టేడియంలో లోపలనే కాదు.. బయట నుంచి పూర్తిగా విచ్చుకున్న పువ్వులా కనిపిస్తుంది.

810
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles