మీ గుండె పదిలమా?


Mon,September 17, 2018 11:55 PM

పిడికెడంత గుండె.. చెట్టంత మనిషిని బతికిస్తుంది! గుండె ఒక్కటి బలంగా ఉంటే.. మనిషి జీవితమంతా ధైర్యంగా బతకొచ్చు! దానికేమాత్రం చిన్న అపాయం జరిగినా మనిషి కుప్పకూలిపోవాల్సిందే! అలాంటి గుండెను ఎంత సురక్షితంగా చూసుకుంటే.. అంత మనం సురక్షితంగా ఉన్నట్లు! కానీ మానవ స్వయంకృతాపరాధం వల్ల గుండె ఎప్పుడు గుభిళ్లుమంటుందో తెలియని పరిస్థితులేర్పడుతున్నాయి! జాగ్రత్త వహించి సమస్య జటిలం కాకుండా చూసుకుంటే మీ గుండె పదిలంగానే ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం!
heart
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం ప్రతీ సంవత్సరం దాదాపు 4 లక్షల మంది మహిళలు గుండె జబ్బులతో చనిపోతున్నారు. అంటే ప్రతీ నిమిషానికి ఒకరు మరణిస్తున్నారన్నమాట. వీరిలో 50% మహళలు ఆకస్మికంగా మృత్యువాత పడుతున్నారు. అయితే గుండె సమస్య ఉన్నట్లు వారికి ముందస్తు హెచ్చరికలు ఉండటం లేదు. పొగతాగడం వల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొని 12% భారతీయ మహిళలు చనిపోతున్నట్లు వారు పేర్కొన్నారు.

heart-attack

కారణమేంటి?

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. యువకుల్లో గుండె జబ్బులు రావడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే గుండె జబ్బులు వచ్చిన తర్వాత బాధపడటం కంటే రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేటివల్ల ముప్పు ఉంటుందో గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి పాటించాలి. డయాబెటీస్, అధిక రక్తపోటు, హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


లక్షణాలు

కొద్దిదూరం నడవగానే ఆయాసం, చాతీ ఒక్కోసారి పట్టేసినట్లుగా ఉండటం, చెమట ఎక్కువగా పడుతుండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం ఉంటే గుండె జబ్బుగా అనుమానించాల్సి ఉంటుంది. అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె జబ్బు ఉందని నిర్ధారించుకోవడానికి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.


చికిత్స ఏంటి?

ఈసీజీ, 2డీ ఎకో, కొలెస్ట్రాల్, టీఎమ్‌టీ పరీక్షల ద్వారా గుండె పనితీరు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షల ద్వారా జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు. గుండె జబ్బు ఉందని తేలితే సమస్య ఎక్కడ ఉంది? ఎన్నిచోట్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నాయి? తదితర విషయాలు తెలుసుకోవడానికి యాంజియోగ్రామ్ పరీక్ష అవసరమవుతుంది. ఒకటి లేదా రెండు బ్లాక్‌లు ఉన్నట్లయితే యాంజియోప్లాస్టి చికిత్స ద్వారా సమస్యను తొలగించుకోవచ్చు. మూడు లేక అంతకంటే ఎక్కువ బ్లాక్‌లు ఉన్నా, గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్‌ఎంసీ)లో సమస్య ఉన్నట్లయితే బైపాస్ సర్జరీ అవసరమవుతుంది. ప్రస్తుతం ఔషధపూరిత స్టెంట్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినట్లయితే స్టెంట్‌లో మళ్లీ బ్లాక్‌లు ఏర్పడకుండా ఉంటాయి. స్టెంట్‌లు వేసినా, బైపాస్ సర్జరీ జరిగినా మళ్లీ గుండె సమస్యలు తలెత్తకుండా ఉండటానికి తగిన మందులు వాడటం చాలా అవసరం.


ముందస్తు నియంత్రణ

కొలెస్ట్రాల్ పెరగడం అన్నది ఆ వ్యక్తి లావుగా ఉన్నాడా? సన్నగా ఉన్నాడా? అన్నది ముఖ్యం కాదు. లావుగా ఉన్న వారిలో కొలెస్ట్రాల్ నార్మల్‌గానే ఉండవచ్చు. సన్నగా ఉన్నవారిలో చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ రక్త పరీక్షల్లో తెలుస్తాయి. అంతేగానీ శరీరం బరువును బట్టి అంచనాకు రావద్దు. కాకపోతే లావుగా ఉన్నవారిలో కాస్త ఎక్కువ శాతం ఈ సమస్య ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే దానిని దృష్టిలో ఉంచుకొని చిన్న వయసు నుంచే కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తీవ్రతను అనుసరించి ఆహార నియమాలు పాటించాలి. కొన్ని మందులు వేసుకోవాలి. వీటి ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చు. అలాగే గుండెపోటు రావడానికి మధుమేహం ఒక ప్రధాన కారణం. అదుకే ఆ సమస్య ఉన్నవారు వ్యాధిని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి.


తెలుసుకోవడం ఎలా?

మహిళల్లో విపరీతంగా ఛాతినొప్పి వస్తుంది. ఇది గుండె నొప్పా? ఛాతి నొప్పా అనేది వారికి తెలియదు. దాదాపు 43% మహిళలు ఈ విధమైన నొప్పిని తట్టుకోలేరు. చాలామందికి రొమ్ము నుంచి భుజాల వరకు, వెనుక, ఎడమ బాహువు, పొత్తి కడుపులో నొప్పి, ఛాతి, వీపులో నిరంతర అసౌకర్యం ఉంటుంది. దీన్నిబట్టి మహిళల్లో గుండెవ్యాధి లక్షణాలు వేరుగా ఉంటాయని చెప్పొచ్చు. మహిళలకు ఎలాంటి నొప్పి లేదా ఒత్తిడి లేకుండా ఛాతిలో మంట ఉంటుంది. చాలామంది మహిళలు అజీర్ణం వల్ల ఇబ్బందికి గురవుతుంటారు. మహిళలు కూర్చుని ఉన్నప్పుడు లేదా కింద పడుకున్నప్పుడు చెమటలు పడుతుంటే జాగ్రత్తగా ఉండాలి. వెంటనే హృద్రోగ నిపుణులను సంప్రదించాలి. ఒత్తిడి, అజీర్ణం, కీళ్ల నొప్పులు, పంటి నొప్పులు ఉంటే సీరియస్‌గా తీసుకొని కార్డియాలజిస్ట్‌ను కలవాలి. లేకపోతే అవి మరిన్ని సమస్యలకు దారితీస్తాయి. గుండెనొప్పి ఉన్న మహిళలకు అలసట సాధారణంగా ఉంటుంది. గుండెనొప్పి వచ్చిన రోజు నుంచి కొందరు మహిళలు కొన్నిసార్లు తీవ్ర బలహీనంగా ఉంటారు. కనీసం నడవలేరు.


మహిళల్లో గుండె జబ్బులు

cardiac-arrest
సహజంగా స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలిచిపోవడం అన్నది చాలా తక్కువ. కాకపోతే మెనోపాజ్ తర్వాత మాత్రం పరిస్థితి మారిపోతుంది. దీనికితోడు గర్భాశయాన్ని, అండాశయాన్ని కూడా తొలగించిన వారిలో పురుషులకు సమానంగానే గుండెపోటు వస్తుంది. అలా అని ఆ హార్మోన్ సప్లిమెంట్‌లు ఇవ్వడం ద్వారా ఈ స్థితిని అరికట్టలేం. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అన్నది నిదానంగా జరిగితే ఈ లక్షణాలు కూడా అంతే నిదానంగా కనబడుతాయి. అలా కాకుండా ఏ కారణంగానైనా ఒక్కోసారి ఈ కొలెస్ట్రాల్ చిట్లిపోవచ్చు. సరిగ్గా అదే సమయంలో రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోతుంది. ఇప్పటిదాకా ఏ 70% ఉన్న ఆటంకం క్షణాల్లో 100%గా మారిపోతుంది. ఆ వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది. గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఈ స్థితి ఏర్పడినవారిలో సుమారు 50% మంది ప్రాణాలు కోల్పోవచ్చు. కొలెస్ట్రాల్ చితకడానికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా శారీరక, మానసిక ఒత్తిళ్లు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అందుకే కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించడం, పొగ తాగడం, పొగాకు సంబంధిత వస్తువులు వాడకాన్ని పూర్తిగా మానుకోవడం ముఖ్యం.


మీ గుండె పదిలంగా ఉండాలంటే వీటిని పాటించాలి. ఏదో బలవంతంగా కాకుండా మీ సురక్షితమైన హృదయం కోసం ఇలాంటివి పాటించాల్సిన అవసరం ఉంది.


food
ఆహారం : నిత్యం మన ఆహారంలో కూరగాయలు, పండ్లు దండిగా తీసుకోవడం అవసరం. కాబట్టి వాటిని ఎక్కువగా కొనండి. ఇంట్లో అందరికీ వాటి ప్రాధాన్యాన్ని వివరంగా చెప్పండి. వీటితోపాటు ముడి బియ్యం, రాగులు, సజ్జలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు, తీపి, కొవ్వులను చాలా పరిమితంగా తీసుకోవడం గుండెకు మంచిది.


smoking
పొగాకు: చుట్ట, బీడీ, సిగరెట్, పాన్, గుట్కా ఏ రూపంలోనూ కూడా పొగాకుకు ఏ విధంగా అలవాటు కావద్దు. ఇంట్లో ఒకరు పొగ తాగుతుంటే మిగతా వారికి ముప్పు ఉంటుంది. పొగ మానేస్తే వెంటనే గుండెపోటు, పక్షవాతం ముప్పు కూడా తగ్గడం మొదలువుతుంది.


shuger
మధుమేహం : మధుమేహం అదుపులో లేకపోతే గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎక్కువ. కాబట్టి మధుమేహం రక్తంలో గ్లూకోజు స్థాయిని, రక్తపోటును కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం.


exercise
వ్యాయామం : రోజూ కనీసం 30 నిమిషాలైన వ్యాయామం చేయడం కీలకం. ఇంట్లో అంతా టీవీలు చూస్తూ కూర్చోకుండా వ్యాయామానికి పూనుకుంటే మేలు. రోజూ కుదరకపోతే వారంలో నాలుగైదుసార్లయినా అంతా కలిసి ఓ గంటపాటు ఒళ్లు వంచడం వల్ల ఊబకాయం, గుండెపోటు దరిచేరవు.


high-bp
హైబీపీ: గుండెపోటును తెచ్చిపెట్టే ముప్పుల్లో ప్రధానమైంది అధిక రక్తపోటు. హైబీపీ ఉన్నా పైకి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ ఉన్నట్టుండి గుండెపోటు, పక్షవాతం ముంచుకురావచ్చు. కాబట్టి ఇంట్లో అంతా తరుచూ బీపీ చూసుకోవడం ఉత్తమం.


cholesterol
కొలెస్ట్రాల్ : రక్తంలో కొలెస్ట్రాల్ పరిమితికి మించి ఎక్కువగా ఉండటం వల్ల కూడా గుండెపోటు, పక్షవాతం ప్రమాదాలు పెరుగుతాయి. కాబట్గి ఆహారపరమైన జాగ్రత్తలతో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం, అవసరమైతే మందులు వేసుకోవడమూ మరవద్దు.
anuj-kapadia

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles