ఒక లక్ష్యం 31 రోజులు 31 జిల్లాలు


Sat,August 11, 2018 03:30 AM

తను బాగుంది.. తన కుటుంబం బాగుంది..అంతవరకు అంతా బాగుంది.మరి బాగులేనివాళ్ల సంగతి?బాగుండాలని అందరూ కోరుకుంటారు.. మరి బాగు చేయడం గురించి? బాగు లేనివాళ్ల బాగోగులు తెలుసుకోవడం కోసం వాళ్ల బాగోగులు చూసుకోవడం కోసం ఓ అమ్మాయి కదిలింది.31 రోజులు.. 31 జిల్లాలు తిరిగింది. ఒక లక్ష్యం పెట్టుకుంది. ఆ లక్ష్యాన్ని చేరడానికి చేసిన ప్రయాణం..ఆ లక్ష్యానికి సంబంధించిన వివరాలు.. ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనల విశేషాలు వి అండ్ షీ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు మందాడి శ్రావ్య రెడ్డి దేశ్‌ముఖ్ జిందగీతో పంచుకున్నది.
ఒక కల.. సాకారం చేసుకుంటున్న సందర్భం. అందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్న సన్నివేశం.. గమ్యం వేలమైళ్ల్ల దూరంలో ఉన్నా.. ఒక్క అడుగుతోనే ఆమె ప్రయాణం మొదలైంది. ఆ అడుగుకు ఆత్మవిశ్వాసం తోడై లక్ష్యం వైపు నడిపించింది.

SravyaReddy
నల్ల మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ చదివింది శ్రావ్య. చదువు పూర్తవ్వగానే కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగమొచ్చింది. నాలుగు గోడల మధ్య కంప్యూటర్‌లో తలపెట్టి కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి కాంట్రాక్టర్, తల్లి నీరజ లాయర్. ఒక చెల్లె. అక్కడి వరకు అంతా బాగుంది. తన కుటుంబంతో సంతోషంగా ఉన్నది. మరి బాగులేనోళ్ల గురించి ఎవరు ఆలోచిస్తారు? వాళ్ల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు? కలెక్టర్ అయి కష్టాలు తీర్చాలనుకున్నది. గ్రూప్స్‌కి ప్రిపేర్ అయింది. రెండుసార్లు ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయి మెయిన్స్ రాసింది. పాసవ్వలేదు. అయినా అస్సలు ఫీలవ్వలేదు. కలెక్టర్‌గా సాధించలేనిది, సామాన్య పౌరురాలిగా సాధించాలని లక్ష్యం ఏర్పరుచుకున్నది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఒంటరి మహిళలు పడుతున్న బాధలను తెలుసుకోవాలనుకున్నది. తెలంగాణలోని 31 జిల్లాలు 31 రోజులలో తిరిగి మహిళల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయొచ్చు అన్న నివేదికను తయారు చేసింది. మేము ఆమె కోసం పేరుతో అవగాహన సదస్సులు నిర్వహించుకుంటూ మహిళల్లో చైతన్యం కలిగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4,116 కిలోమీటర్లు తిరిగింది. కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజీలేని ప్రయాణానికి సిద్ధమయింది. అన్ని వర్గాల మహిళల్లో చైతన్యం తీసుకురావడం, వారి జీవనాభివృద్ధికి వి అండ్ షీ ఫౌండేషన్ ద్వారా ఉపాధి కల్పించడం, దిక్కు లేని వారికి దారి చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నది.

ఉపాధి కల్పించాలని.. దారి చూపాలని..

భర్త వదిలేసిన భార్యలు ఎందరో, అర్థాంతరంగా జీవితాన్ని, జీవిత భాగస్వాములను వదిలేసి కన్నుమూసిన కుటుంబ పెద్దలెందరో!? ఇలాంటి తోడు లేని అభాగ్య మహిళల పరిస్థితి ఏంటి? ఇంటికి పెద్ద దిక్కయిన ఇంటిదీపం ఆరిపోతే, కూలీనాలి చేస్తూ పిల్లల్ని చదివిస్తూ కాలం వెళ్లదీస్తున్న మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలా ఒంటరి మహిళలకు తను ఒక భరోసా ఇవ్వాలనుకుంటుంది. వీ అండ్ షీ పేరుతో స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ఒంటరి మహిళల కోసం పనిచేస్తున్న తొలి స్వచ్ఛంద సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా తను చేస్తున్న ప్రయాణంలో దాదాపు వెయ్యి మంది ఒంటరి మహిళలను కలిసింది. దాదాపు అందరి ఆశ ఏదైనా ఉపాధి దొరికితే పిల్లల్ని చదివించుకుంటామని. ఇప్పుడు ఆ పనిమీదే ఉన్నది శ్రావ్య. ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు వెతుకుతున్నది. మొదటి విడతగా 70 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణనిప్పించి వ్యాపారరంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలనుకుంటున్నది.

31 జిల్లాల ముచ్చటైన ప్రయాణం

జూలై 1న హైదరాబాద్‌లో ప్రారంభమైన శ్రావ్య ప్రయాణం 31న నాగర్‌కర్నూల్ జిల్లాతో ముగిసింది. ఈ ప్రయాణం ఇతరుల జీవితాలను మార్చడానికి ప్రారంభించినా తన జీవితం మీద ప్రభావం చూపించదని చెప్తున్నది శ్రావ్య. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో కొన్ని అంశాల పట్ల అవగాహన లేకపోవడం ఇందుకు కారణమంటున్నది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్‌వాడీ వర్కర్లు, బీడీ కార్మికులు, మహిళా సర్పంచులు, రైతులు, పారిశుధ్య కార్మికులు, కూరగాయలు అమ్మే వాళ్లు.. ఇలా అందరినీ కలిసింది. బాల్య వివాహలు, వరకట్న వేధింపుల కేసుల బాధితులను కలిసి కౌన్సెలింగ్ కూడా ఇచ్చింది. తన దృష్టికి వచ్చిన సమస్యలను, తను చూసిన విషయాలను, అనుభవాలను రాసే పనిలో ఉన్నది. తన ప్రయాణానికి సంబంధించిన రిపోర్ట్ రాసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలనుకుంటున్నది. ఈ నివేదికలో ఉన్న అంశాలను పరిశీలించి రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చుకోవాలని కోరుతున్నది.
SravyaReddy1
స్వచ్ఛంద సంస్థల మీద సమాజంలో కొంత వ్యతిరేక అభిప్రాయం ఉన్నది. కొన్ని సంస్థలు అలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి మరి. వి అండ్ షీ ద్వారా అలాంటి అభిప్రాయాలను మార్చాలనుకుంటున్నది శ్రావ్య. స్వచ్ఛంద సంస్థలంటే వ్యాపార సంస్థలు కాదు. పదిమందికి మంచి చేసే ఒక నమ్మకం అనే భావన తీసుకురావాలనుకుంటున్నది.

బ్రాస్‌లెట్ అమ్మి..

31 జిల్లాలు తిరుగాలంటే, అదీ కారులో.. కొంత ఖర్చుతో కూడుకున్న విషయం. ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్న డబ్బులు, చేతికున్న బంగారు బ్రాస్‌లెట్ అమ్మి ప్రయాణం మొదలుపెట్టింది. బ్రాస్‌లెట్ ఉంటే మహా అయితే పదిసార్లు చేతికి వేసుకుంటుంది. అదే బ్రాస్‌లెట్ అమ్మిన డబ్బులతో పదిమంది జీవితాలు మారుతాయంటే అది ఉన్నా లాభం లేదని అమ్మేసింది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశపడకుండా తనే వెళ్లి ఈ సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలని కదిలింది. తన మొదటి అడుగు వల్ల ఇంకా ఇద్దరు తనతో అడుగులు కలిపిన కార్యక్రమం విజయవంతం అయి పదికాలాల పాటు నడుస్తుందని నమ్మకాన్ని కలిగి ఉన్నది. వి అండ్ షీ ఎన్జీవోలో ఇతర సంస్థలో పనిచేస్తున్న వలంటీర్లు సేవలందిస్తున్నారని, ఇప్పుడిప్పుడే వలంటీరుగా పనిచేయడానికి చాలామంది ముందుకొస్తున్నారని అంటున్నది. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటున్న శ్రావ్య తార్నాకాలోని సెయింంట్ ఆన్స్‌లో చదువుకున్నది. తరగతి గది నుంచే మానిటర్‌గా క్లాస్ బాగోగులు చూసుకోవడం అలవాటు చేసుకున్నది. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ఇతర స్వచ్ఛంద సంస్థల్లో వలంటీర్‌గా పనిచేసింది.

ఒక సంఘటన..

సెయింట్ ఆన్స్ స్కూల్‌లో చదువుతున్నప్పుడు స్కూల్ బయట అనాథ వ్యక్తి ఉండేవాడు. రోడ్డుపై వాళ్లు వీళ్లు ఇచ్చే ఆహారాన్ని తింటూ కాలం వెళ్లదీసేవాడు. అది గమనించి శ్రావ్య ఆరోజు నుంచి రోజూ తన టిఫిన్‌బాక్స్ తినకుండా అతనికి ఇచ్చేది. వారం పదిరోజుల తర్వాత గమనించిన ఆయా శ్రావ్య తల్లికి సమాచారమిచ్చింది. ప్రతిరోజు ఇంటినుంచి తెచ్చిన లంచ్‌బాక్స్ రోడ్డుపై ఉంటున్న వ్యక్తికి ఇస్తుందని ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో శ్రావ్య వాళ్ల అమ్మ ఎలా స్పందిస్తుందో అని కొంత భయపడింది. కానీ శ్రావ్య వాళ్లమ్మ సానుకూలంగా స్పందించింది. ఇలా ఉంటే ఒక బాక్స్ ఎక్స్‌ట్రా కట్టేదాన్ని కదా! అని అన్నది. దీంతో శ్రావ్యకు మరింత ధైర్యం వచ్చింది. మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారన్న నమ్మకం పెరిగింది. అప్పటి నుంచి తనవంతుగా, చేతనైనంత మంచి పనిచేస్తూ వస్తుంది. ఆ రోజు తన తల్లి పాజిటివ్‌గా స్పందించకపోతే ఇవన్నీ చేసేదాన్ని కాదని అంటున్నది. సమాజంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ శాతం ఉంటుందని, చిన్నతనం నుంచే సేవాగుణాన్ని నేర్పించాలని సూచిస్తున్నది.
SravyaReddy2
అజహర్ షేక్

985
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles