ఈమె వ్యధ సినిమా కధ


Sat,October 13, 2018 01:42 AM

బయోపిక్‌ల హవా నడుస్తున్న కాలమిది.. బడా నేతలు.. పేరు గాంచిన వ్యక్తుల కథలు.. ఇలా ఎన్నో చిత్రాలు తెర మీద ప్రత్యక్షం అవుతున్నాయి.. అయితే రాణీ పద్మావత్‌గా అలరించిన దీపికా పదుకొనే అలాంటి ఓ సినిమాతో హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఆ సినిమాను తానే నిర్మిస్తానన్నది. ఇంతకీ ఎవరి గురించి ఆ కథ? అంటే.. లక్ష్మీ అగర్వాల్ గురించి. ఆమె కథ.. కాదు వ్యథ గురించే ఈ సినిమా. అంత గొప్పదనం ఏముందో లక్ష్మీలో.. అనిచాలామందికి సందేహం కలుగుతున్నది. అందుకే చదివేయండి.. ఆ సాహసవంతురాలి కథ. మొహంపై చిన్నగాటు పడితేనే అల్లాడిపోతాం. అలాంటిది ముఖమంటూ లేకుండా కాలిపోతే ఎలా ఉంటుంది? 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఆమెకు న్యాయం జరిగింది. ఆమె జీవితాన్ని తెరకెక్కించేందుకు ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ ముందుకొచ్చారు. ఆమె కథ విన్న దీపికా పదుకొనే స్వయంగా నిర్మిస్తానని చెప్పింది. ముప్పై సంవత్సరాల లక్ష్మీ అగర్వాల్.. యాసిడ్ దాడులపై గళమెత్తి పోరాడుతున్న వ్యక్తి.

Deepika Padukone

ఢిల్లీలోని మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది లక్ష్మి. యవ్వనంలో ఉన్న అందరు ఆడపిల్లల్లాగే తానూ ఉండేది. కుటుంబ పోషణ కోసం చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అయినా బాధపడలేదు. కుటుంబం కోసం ఓ బుక్‌షాప్‌లో పనికి కుదిరింది. కష్టపడి పనిచేసే మనస్తత్వం కాబట్టి అందరూ ఆమె పట్ల ఆకర్షితులయ్యేవారు. కాకపోతే అందరూ ఆరాధన భావంతోనే కాదు.. కొందరు కామంతో కూడా చూస్తుంటారు. అలా తండ్రి వయసున్న వ్యక్తి ఎప్పుడూ లక్ష్మిని ఇబ్బంది పెట్టేవాడు. అతడి చేష్టలకు విసిగిపోయినా ఏం అనకుండా వెళ్లిపోయేది. ఎప్పటిలాగే 2005లో ఒకరోజు షాపునకి బయలుదేరింది. ఆ రోజు ఆ వ్యక్తి ఒక బాటిల్ నిండా యాసిడ్ తీసుకొచ్చి ఆమె ముఖం మీద పోశాడు. మంటలకు తాళలేక.. ఏం జరిగిందో తెలిసేలోపు స్పృహ కోల్పోయింది లక్ష్మి.

దాడి తర్వాత..


మెళకువ వచ్చేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఉంది లక్ష్మి. ముఖమంతా నొప్పి పుట్టి బాధతో విలవిల్లాడేది. తల్లిదండ్రులు పక్కన లేరు. పైగా ఆ గదిలో ఒక అద్దం కూడా లేకుండా చూశారు డాక్టర్లు. రోజూ డాక్టర్లు వచ్చి చెకప్ చేసి వెళ్లేవాళ్లు. నర్స్ నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేది. అప్పుడైనా తన ముఖాన్ని ఆ నీళ్లలో చూసుకుందామనుకునేది లక్ష్మి. బ్యాండేజ్ తప్ప ముఖం కనిపించేది కాదు. ఆ సమయంలో ముక్కు మీద చిన్న గాటు కనిపించింది ఆమెకు. దాన్ని ఎలాగైనా ఆపరేషన్ చేసి తొలిగించేయమని డాక్టర్లతో పోరు పెట్టుకునేది లక్ష్మి. కానీ ఆమె ముఖం మరింత ఛిద్రంగా ఉన్నదన్న విషయం ఆనాటికి ఆమె కూడా ఊహించి ఉండదు. ఒక్కసారి బ్యాండేజ్ విప్పి ముఖాన్ని చూపించారు. ఆ క్షణం ఆమె తట్టుకోలేకపోయింది. కంటిధారగా ఏడ్వడం తప్ప ఏం చేసేది కాదు. ఎన్నో రోజులు బాధపడుతూనే కూర్చుంది. ఎన్నో సర్జరీలతో ముఖాన్ని కొంతమేర బాగు చేశారు డాక్టర్లు. కానీ మానసికంగా ఆమె ఎంతో కుంగిపోయింది.

న్యాయ పోరాటం..


laxmi
సంవత్సరం కాలం పట్టింది లక్ష్మి కోలుకోవడానికి. ఈకాలంలో తండ్రి లాలన ఆమెను ఆ ట్రామా నుంచి బయటకు వచ్చేలా చేసింది. సంవత్సరం తర్వాత సుప్రీం కోర్టులో మరో యాసిడ్‌కి గురైన రూపతో కలిసి పిటీషన్ వేసింది. యాసిడ్‌ని పూర్తిగా బ్యాన్ చేయాలని, యాసిడ్ దాడికి గురైన వారికి పరిహారం చెల్లించాలని పోరాటమే చేసింది. మొత్తానికి 2013లో కొన్ని సవరణలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేలా ఆమె విజయం సాధించింది. దీని ప్రకారం.. మైనర్‌లకు యాసిడ్ అమ్మకూడదు. ఫొటో ఐడెంటిటీ ఇస్తేనే యాసిడ్ కొనుగోలు చేసే విధంగా సవరణ చేసింది కోర్టు. అమ్మినవాళ్ల సమాచారం కూడా కచ్చితంగా పొందుపరుచాలనేది చట్టంలో ఉంది. అలాగే యాసిడ్ బాధితులకు మూడు లక్షల పరిహారం చెల్లించేలా కోర్టు తీర్పునిచ్చింది.

అక్కడితో ఆగలేదు..

చట్టం వచ్చినంత మాత్రాన అమలు కావాలనేది లేదు. అందుకే దాని గురించి కూడా లక్ష్మి పోరాటం మొదలుపెట్టింది. ఎలాంటి అడ్డు అదుపులేకుండా యాసిడ్ దొరికిపోతుంది. తన కొంతమంది వలంటీర్లను నియమించి స్వయంగా యాసిడ్ కొన్నది. దీంతో షూట్ యాసిడ్ పేరుతో ఒక ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. దీని ద్వారా యాసిడ్ అమ్మేవాళ్ల డాటాను సంపాదించగలిగింది. దానిద్వారా వారి మీద కంప్లయింట్ ఫైల్ చేసేది. ఇలా ఆమె ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. 2014లో ఆమె చేసిన సేవలకు, ధైర్యాన్ని మెచ్చి యూస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ మిచెలీ ఒబామా చేతుల మీదుగా ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు ఇప్పించింది. అయితే అదే సంవత్సరం ఆమెకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె అన్న ట్యూబ్‌క్రోలసిస్, తండ్రి హార్ట్‌ఎటాక్‌తో మరణించారు.

చెడులో మంచి..

మనం మంచి కోరుకుంటే చెడు ఎదురవుతుందంటారు. ఎంతోమంది రక్షించాలని చూసిన లక్ష్మికి మాత్రం జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలాయి. అందరూ తనకు దూరమయ్యారనే బాధ ఆమెలో ఒకింత నిరుత్సాహానికి కారణమయింది. అదే సమయంలో అలోక్ దీక్షిత్ అనే జర్నలిస్ట్ పరిచయం ఆమె జీవితాన్ని మార్చేసింది. యాసిడ్ అటాక్ క్యాంపెయిన్‌కి ఫౌండర్ అతను. వారి పరిచయం ప్రేమగా మారింది. కానీ పెండ్లి మాత్రం వద్దనుకున్నారు. సహజీవనానికి ఓటు వేశారు. దానికారణం..ఈ సమాజం. పెండ్లికూతురు రూపు రేఖలే ప్రధాన చర్చగా పెండ్లి తంతు నడుస్తుంది. అలాంటి మాటలు భరించే శక్తి, ఓపిక లేక లక్ష్మి సహజీవనానికి ఒప్పుకొన్నది. ఇప్పుడు వారికి ఒక పాప. పేరు పీహు. అయితే ఈ మధ్యే అలోక్‌తో విడిపోయి పాపను తన కస్టడీలోకి తీసుకుంది లక్ష్మి. మళ్లీ తన జీవితాన్ని సున్నా నుంచి ప్రారంభించడానికి సిద్ధమయింది. తన పాపకు బంగారు భవిష్యత్ లక్ష్యంగా పనిచేయాలని కోరుకుంటున్నది.

పాపే నా ప్రాణం..


Laxmi-Agarwal
ఇప్పటికీ నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను. కొందరు నాకు ఇళ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. నేను బ్యూటీషియన్ కోర్సు కూడా పూర్తి చేశా. కానీ నన్ను చూసి మొదట్లో ఎవరూ పని చేయించుకోలేదు. కానీ నా వ్యథ విన్నాక ఇప్పుడిప్పుడే ఆఫర్లు వస్తున్నాయి. ఒక హెయిర్ అండ్ మేకప్ అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. నేను ఏది సంపాదించినా నా కూతురు భవిష్యత్ కోసమే. తనకోసమే నేను బతుకుతున్నా.
- లక్ష్మీ అగర్వాల్

లక్ష్మి కథ నేను మొదటిసారి విన్నప్పుడే నాకు అర్థమైంది, ఆమెపై జరిగిన యాసిడ్ దాడి లాంటి హింస గురించి మాత్రమే కాదు.. ఆమెలోని ధైర్యం, సాహసాలు కూడా నా మీద చాలా ప్రభావం చూపాయి. అందుకే వ్యక్తిగతంగా, సృజనాత్మకంగా తోడుండేందుకు ఒక అడుగు ముందుకు వేయాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకే నేను నిర్మించాలనుకున్నాను.
- దీపికా పదుకొనే

Laxmi-A
లక్ష్మి కథ ద్వారా మేం కేవలం యాసిడ్ దాడి లాంటి హింసనే కాదు.. అందుకు దారి తీసిన పరిణామాలు, దాని ద్వారా అమ్మాయిలు ఎదుర్కొన్న పర్యవసానాలు కూడా
చర్చించదలిచాం. తిరస్కారాన్ని జీర్ణించుకోలేకపోవడానికి గల మూలాలను వెతుకుతున్నాం. ఈ సమాజంలో దీనికి సంబంధించి ముందు కావాల్సింది మార్పు కాదు.. అవగాహన.
- మేఘనా గుల్జార్


సౌమ్య నాగపురి

910
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles