ఎండ వల్ల జుట్టుకు నష్టమా?


Fri,February 16, 2018 02:07 AM

నేను ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తాను. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చెయ్యాల్సి ఉంటుంది. ఎక్కువ సమయం ఎండలో గడుపాల్సి కూడా ఉంటుంది. ఈ మధ్య జుట్టులో తేమ చాలా తగ్గిపోతున్నట్టు అనిపిస్తున్నది. జీవం లేనట్టు కనిపిస్తున్నది. ఇలా జరుగడానికి కారణం ఏమిటి? ఎండ వల్ల జుట్టుకు నష్టం వాటిల్లుతుందా? వచ్చేది ఎండాకాలం. వేసవిలో జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తిగా వివరించగలరు.
నిహారిక, హైదరాబాద్

GTY_hair
ఎండ వల్ల జుట్టుకు కూడా నష్టం వాటిల్లుతుంది. సూర్యరశ్మి వల్ల జుట్టుమీది పైపొర తొలగిపోతుంది. ఫలితంగా జుట్టు చివర్లు చిట్లి పోతాయి. ఇలా జరిగినపుడు జుట్టులోని తేమ చాలా త్వరగా నష్టపోతుంది. అందువల్ల జుట్టు జీవంలేనట్టుగా కనిపిస్తుంది. ఎండాకాలంలో కేవలం చర్మం కోసం మాత్రమే కాదు జుట్టుకోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమవుతుంది. ఎండాకాలంలో ఎక్కువగా చమట పడుతున్నదన్న కారణంగా కొంతమంది ప్రతిరోజూ షాంపులు ఉపయోగించి తలస్నానం చేస్తుంటారు. ఇది అంత మంచిది కాదు. రోజూ షాంపు వాడడం వల్ల జుట్టు, తల మీది చర్మంలోని తేమ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారంలో రెండుసార్లు షాంపూ ఉపయోగించి తలస్నానం చేస్తే చాలు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా జుట్టును స్కార్ఫ్‌తో కప్పుకోవడం అవసరం. అందువల్ల అతినీలలోహిత కిరణాల బారి నుంచి జుట్టును రక్షించుకోవచ్చు. వారంలో రెండు సార్లు తలస్నానానికి ముందు కొబ్బరి నూనె జుట్టుకు, మాడుకు రాసుకోవడం వల్ల జుట్టు, తలమీది చర్మంలో తేమ తగ్గిపోకుండా ఉంటుంది. తడి జుట్టును వీలైనంత వరకు సహజంగా ఆరిపోయేట్టు చూసుకోండి. జుట్టును ఆరబెట్టడం కోసం హైయిర్ డ్రయర్లను, బ్లోయర్లను ఉపయోగించడం, పలు రసాయనాలను జుట్టు మీద వాడడం, జుట్టు దువ్వే సమయంలో సున్నితంగా ప్రవర్తించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు కూడా జుట్టుకు జరిగే నష్టం నుంచి కాపాడుతాయి.

డాక్టర్ ఆకాన్ష్ జైన్
డెర్మటాలజిస్ట్
సన్‌షైన్ హాస్పిటల్స్
సికింద్రాబాద్

350
Tags

More News

VIRAL NEWS

Featured Articles