మలి వయసులో..తోడూ నీడై!


Sat,August 4, 2018 01:48 AM

బాల్యంలో.. నిలువెత్తు నీడలా అమ్మ ఉంటుంది. నాన్న ఉంటాడు! పడితే లేపడానికి.. వేలు పట్టుకొని నడిపించడానికి.. నా అనే తోడు ఉంటుంది! పెద్దయ్యాక.. పెళ్లయ్యాక జీవితంతో నడిచేందుకు తోడు-నీడ ఉంటుంది! కానీ ఆ తోడు మధ్యలోనే వీడిపోతే.. నీడ జాడను కోల్పోతే.. మధురంగా గడపాల్సిన జీవన మలిదశ అంధకారమై పోతుంది! ఘడియొక గండంలా బతకాల్సి వస్తుంది! ఆ గండం నుంచి గట్టెక్కించడానికి తోడునీడలా కంకణం కట్టుకొని కదిలిన రాజేశ్వరి పరిచయం!
ఇప్పుడు అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలే. అందరివీ తాత్కాలిక బంధాలే. భార్యను భర్త పట్టించుకోడు.. భర్తను భార్య వదిలించుకుంటుంది. తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తారు. మానసిక స్పర్ధలతో మధ్యలోనే జీవితాల్ని ఒంటరి చేస్తున్నారు. ఇక చేతికి అందివచ్చిన పిల్లలేమో పొలిమేరలు దాటి వెళ్లి కన్నవాళ్లకు తోడు-నీడ లేకుండా చేస్తున్నారు. ఇలా ప్రతీయేటా ప్రపంచవ్యాప్తంగా 60 సంవత్సరాలు దాటి ఒంటరి జీవితం అనుభవిస్తున్నవాళ్లు దాదాపు 1.1 మిలియన్‌ల మంది ఉంటున్నట్లు ఇంగ్లండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ పరిశోధకులు అంటున్నారు. ఇలా అయితే ఎలా అని ఆలోచించింది రాజేశ్వరి.

rajeswari
తోడు నీడై: వీరేశలింగం ఏమనేవారు? వితంతువులు.. ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించి మళ్లీ పెండ్లిచేసి వాళ్లకు కొత్త జీవితం ప్రసాదించాలనేవారు. అలా ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు కూడా. అయితే ఇప్పుడు అలా సాధ్యమా? వీరేశలింగం లాంటివాళ్లు ఎవరో ఒకరు.. ఎపుడో అప్పుడు.. అటో ఇటో ఎటోవైపు కదిలితే కచ్చితంగా సాధ్యమే. అలా ముందుకు కదిలిన మహిళే రాజేశ్వరి. పెండ్లిళ్లు చేయాలనే ఉద్దేశంతో కాదుగానీ.. జీవిత మలిదశలో తోడు లేకుండా ఉన్నవారికి తోడునీడను వెతికిపెట్టే ప్రయత్నం చేస్తున్నది. కొత్తగా.. వింతగా అనిపించినా తోడునీడ వెతికిపెట్టి ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో తోడు నీడ అనే సంస్థను కూడా స్థాపించింది.

ఎవరి కోసం?: తోడు నీడ స్థాపన వెనక మంచి ఉద్దేశం ఉన్నది. భర్త చనిపోయిన మహిళలు, కుటుంబం నుంచి ఆదరణ కరువైన మహిళలు, ఒంటరిగా ఉన్నవారిని చేరదీసి వారికి జీవితం పంచుకునే భాగ్యం కల్పించడమే ఈ సంస్థ ఉద్దేశం. ఇందులో ఆడ-మగ అనే భేదాలు లేవు. ఒంటరితనంతో బాధ పడుతున్నవారిని ఏకం చేస్తున్నారు. ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే ఈ సంస్థను ఆశ్రయిస్తున్న వారిలో చాలామంది కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలనుకొని పెండ్లిళ్లు చేసుకునేవాళ్లు ఉన్నారు. కాకపోతే కచ్చితమైన ఆధారాలు ఉండాలి. కుటుంబ వివరాలు కూడా చెక్ చేసిన తర్వాత ఒక్కటవ్వడానికి అవకాశం కల్పిస్తారు. అంటే ఒక రకంగా ఇది సెటిల్‌మెంట్ బ్యూరో లాంటిది. ఎవరికి తోడు కావాలంటే వాళ్ల వివరాలు తోడు నీడ సంస్థలో ఉంటాయి. ప్రొఫైల్స్ షేర్ చేస్తారు. నచ్చినవాళ్లు తమ ఇష్టాయిష్టాలను పంచుకుంటారు. అలా ఓ జంట కలుస్తుంది.

అవమానాలు ఎన్నో: రాజేశ్వరిది స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు. 10వ తరగతి వరకూ అక్కడే చదువుకున్నది. ఆమెకు 13వ యేటనే తల్లిదండ్రులు పెండ్లి చేశారు. 20 యేండ్లు వచ్చేనాటికి ముగ్గురు బిడ్డలకు తల్లి అయింది. తన 30వ ఏటా భర్త వదిలేయడంతో తల్లిదండ్రులు చేరదీశారు. దీంతో ఇతరులపై ఆధారపడి జీవించడం ఇష్టం లేక మళ్లీ చదువు కొనసాగించింది. బీకాం, బీఈడీ, ఎంఏ, ఎంఈడీ, వరకూ ఎంతో కసితో చదివింది. ఇలా చదువు కొనసాగిస్తూనే సమాజాన్ని కూడా పూర్తిగా చదివింది. ఈ క్రమంలో టీచర్‌గా ఉద్యోగం సంపాదించి ముగ్గురు పిల్లలకు వివాహం చేసింది. ఈ క్రమంలో కేవలం పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, హేళనలను భరించింది. బంధువులు శుభకార్యాలకు పిలిచేవారు కాదు.

తోడు నీడకు శ్రీకారం: ఎన్నో అవమానాలను, హేళనలు ఎదుర్కొన్న ఆమె ఒంటరిగా ఉంటే సమాజం ఎంత చులకనగా చూస్తుందో గ్రహించింది. చదువుకున్న తానే ఇన్ని ఇబ్బందులు పడటాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏదో చేయాలన్న ఆశ, ఏదైనా ఒకటి చేయాలన్న సంకల్పం. తనను తోడు నీడ సంస్థ స్థాపనకు పురికొల్పాయి. ఈ కొత్త జీవితం అనేది తోడుగా చూడాలే తప్ప సమాజానికి చెడ్డపేరు తీసుకొచ్చేది ఏమీ కాదు. వాటన్నింటినీ ఎదురించి రాజేశ్వరి తాను అనుకున్నది విజయవంతంగా చేస్తూ ఎందరో వృద్ధులకు నూతన తోడునీడను వెతికి పెడతున్నది.
rajeswari1
రాజేశ్ తోడుగా: ఇన్ని ఆటుపోట్లను భరించిన రాజేశ్వరి తనలా సమాజం వెలివేసిన వారి కోసం ఏదైనా చేయాలని హైదరాబాద్‌కు వచ్చేసింది. తన నిర్ణయాన్ని తెలిసిన వారికి, పెద్దలకు, అధికారులకు విన్నవించింది. అంతా చాలా బాగుంది, మంచి ప్రయత్నమని అంటున్నారే తప్పా.. ఎవ్వరూ ఇసుమంతైనా సహాయం చెయ్యలేదు. అలాంటి పరిస్థితుల్లో రాజేశ్ అనే వ్యక్తి రాజేశ్వరి ఆలోచనతో ఏకీభవించాడు. సంస్థను స్థాపించేందుకు తోడుగా తానుంటానని భరోసా ఇచ్చాడు. సంస్థ పేరు నుంచి రిజిస్ట్రేషన్, అమలయ్యే వరకూ అన్నింటిలోనూ రాజేశ్వరికి సహాయ సహకారాలు అందించాడు. ఇలా మొదలైన రాజేశ్వరి మరో ప్రస్థానం ఎంతోమందిని విజయతీరాలు, సంతోషాల పూదోటకు నడిపించింది. మాటలు చెప్పే సంస్కర్తలా కాకుండా.. చేతల్లో చేసి చూపించే నిజమైన సంఘ సంస్కర్తలా మారి.. సమాజాన్ని ఎదురించి సగర్వంగా ముందుకు సాగుతున్నది.

పక్కా వివరాలతో: ఈ సంస్థ ద్వారా ఎవరైనా తోడు కావాలనుకునే వారు కచ్చితమైన ఆధారాలతో వీరిని సంప్రదించాలి. అవి బోగస్ డీటెయిల్స్ ఉండకూడదు. ఒంటరి మహిళలు, పురుషులు ఈ సంస్థ ద్వారా ఒక్కటవ్వాలనుకుంటే రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు, ఐడీ ప్రూప్స్, ఆధార్ కార్డు, విడాకుల పేపర్స్, భర్త/భార్య చనిపోయిన సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల అంగీకారపత్రాలు తీసుకొని రావాలి. ఇవన్నీ తీసుకొచ్చి సంస్థ అందించే దరఖాస్తు పూర్తి చేసిన వారికి సమావేశం ఏర్పాటు చేసి, సంస్థ ఉద్దేశాలు, జరగాల్సిన మంచి పనులను చెప్తారు. అక్కడే తమకు నచ్చిన వారితో చూపులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఒకరికొకరు తెలుసుకొని, అభిప్రాయాలు పంచుకునేందుకు రెండు గంటల సమయం ఇస్తారు. ఇలా అభిప్రాయాలు నచ్చిన వారికి సంస్థ తరఫున అధికారికంగా మరో పెళ్లి చేస్తారు. పెండ్లి నచ్చని వారు లివ్ అండ్ రిలేషన్ షిన్‌ను కొనసాగించవచ్చు.
rajeswari2
150 మందిని కలిపింది: తోడు నీడ సంస్థ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పైగా కొత్త జీవితాలను ప్రసాదించింది రాజేశ్వరి. తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులను చూసి పెండ్లి చేసుకున్నవారూ ఉన్నారు. ఒక్కటి చేయడమే కాదు.. ఆ తర్వాత వారి బాధ్యలతను ఈ సంస్థే చూసుకుంటుంది. వారి మంచి చెడుల్లో భాగస్వామి అవుతుంది.

విహారయాత్రలు: ఇలా జీవితం పంచుకున్న వారు ఒకరికొకరు బాగా అర్థం చేసుకునేందుకు రాజేశ్వరి విహారయాత్రలు కూడా ప్లాన్ చేస్తుంటారు. తన సంస్థ ద్వారా పెండ్లి చేసుకున్న జంటలను, వారి పిల్లలకు ప్రత్యేకంగా టూర్‌లు ఏర్పాటు చేస్తారు. వీకెండ్స్‌లో వీరంతా కలిసి సరదాగా పలు ప్రదేశాలు చుట్టొస్తారు. అంతేకాకుండా వారి పిల్లలు, తల్లిదండ్రులు ఆడుకునేందుకు, సేద తీరేందుకు డే కేర్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇలా ప్రతి విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది రాజేశ్వరి. కారణం.. తాను అనుభవించిన కష్టాలే. ఈనెల 5న ఉదయం 9 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మెజిస్టిక్ హోటల్ దగ్గర తోడు-నీడ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జీవిత మలి వయసులో కొత్త జీవితం ఏర్పర చుకోవాలి అని ఆసక్తి ఉన్నవాళ్లు హాజరుకావచ్చు. వివరాలకు 7702455210, 8106367014 నంబర్లను సంప్రదించవచ్చు.

సంతోషంగా ఉన్నా!

rajeswari3
నా జీవితంలో అనుభవించలేనన్ని కష్టాలు అనుభవించాను. ఒక రకంగా చెప్పాలంటే నా భర్త విడిపోయిన దగ్గర్నుంచీ ఈ 30 యేండ్లు నరకం అనుభవించాను. పిల్లల కోసం వారి భవిష్యత్ కోసం అన్ని బాధలనూ పంటిబిగువున భరించాను. ఇప్పుడు వీరందరినీ చూస్తుంటే నా కష్టాలు పూలబాటలా అనిపిస్తున్నాయి. తోడు నీడ సంస్థ ద్వారా ఎంతోమంది కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా నేనూ ఓ తోడును వెతుక్కొని పిల్లలతో సంతోషంగా ఉన్నాను.
- రాజేశ్వరి, తోడు నీడ వ్యవస్థాపకురాలు

వి. వనజ
వీరగోని రజినీకాంత్‌గౌడ్

2400
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles