ఈయన నాట్యం.. సప్తవర్ణ శోభితం!


Wed,September 19, 2018 11:10 PM

సాహితీ, సంగీత సంగమానికి చతుర్విదాభినయాల మేళవింపు.. విజ్ఞాన, వినోదాల మేలు కలయికే నృత్యం. సమాజాన్ని చైతన్యపరిచే కళల్లో నృత్యానిది
అద్వితీయ పాత్ర. జానపదం, శాస్త్రీయం , పాశ్చాత్యం ఇలా నృత్యరీతులు ఏవైనా అంతిమంగా వాటి లక్ష్యం ఒక్కటే. జనాన్ని రంజింపజేయడం. ఒకటో రెండో నృత్యాలలో ప్రావీణ్యం సంపాదించి రాణించేవారిని మనం చూస్తుంటాం. కానీ ఏకంగా ఏడు రకాల నృత్యాలను నేర్చుకోవడమే కాకుండా ఒకే వేదికపై ప్రదర్శిస్తూ తనదైన
ప్రత్యేకతను చాటుకుంటున్నాడు కామారెడ్డికి చెందిన వంశీ ప్రతాప్‌గౌడ్.

bharth
మనది వేదభూమి, కర్మభూమి. అంతే కాదు కళల భూమి కూడా. మనకు అరవై ఆరు కళలున్నాయంటారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉండే ఉంటుంది. ఆసక్తిని బట్టి ఆయా కళలకు మెరుగులు దిద్దుకుంటే ప్రావీణ్యం సంపాదించడంతో పాటు నలుగురిలో ప్రత్యేకతను చాటుకున్నవాళ్లమవుతాం. శంకరాభరణం సినిమాతో స్పూర్తి పొందిన ఆయన పలు నృత్యకళల్లో ప్రావీణ్యం సంపాదించి రాణిస్తున్నాడు. నాలుగు సంవత్సరాల్లోనే మరో ఆరు భారతీయ నృత్యరీతుల్ని ఆయన అభ్యసించారు. 2012లో భువనేశ్వర్‌కు చెందిన డాక్టర్ సొనాలీ ఆచార్యజీ వద్ద ఒడిస్సీ, 2013లో బెంగళూరులో ప్రభాల్ గుప్తా వద్ద కథాకలి, 2013లోనే కేరళలో మైథిలీ మరాఠ్ అనూప్ వద్ద మోహినీ అట్టం, 2014లో అమితావ దత్త వద్ద కోల్‌కతాలో కథక్. 2014నిజామాబాద్‌లో దేవులపల్లి ప్రశాంత్ కుమార్ వద్ద భరతనాట్యం, 2015లో మణిపూర్‌లో సుమన్ సరావ్గి వద్ద మణిపురి నేర్చుకున్నారు. ఇలా తన బహుముఖ ప్రావీణ్యంతో ఏడు నృత్యరీతుల్ని ఆకళింపు చేసుకున్నారు. ఆయన నేర్చుకున్న ఏడు కూడా భారతీయ నృత్యకళలే అయినప్పటికీ ప్రతి నృత్యానికి ప్రత్యేక భంగిమలు, ముద్రలు వేర్వేరుగా ఉంటాయి. ప్రతి నృత్యంలోనూ ఆయా సంప్రదాయాల మేళవింపు, అభినయం తప్పక ప్రస్ఫుటించాలి. లేదంటే ఒక నాట్యంలోని ముద్రలు, భంగిమలు వేరే కళలో మిళితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన ప్రతి నృత్యాన్ని కూడా అత్యంత శ్రద్ధతో, ఆసక్తితో ఆయా సంప్రదాయ దుస్తులను ధరించి ప్రదర్శిస్తాడు.


డ్యాన్స్ ఇనిస్టిట్యూట్


big-size-
ఒక కళ ఎక్కువ కాలాల పాటు జీవించి ఉండాలంటే ఆ కళను సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే వంశీ కామారెడ్డిలో 2009లో ఎన్-3(నవరసనాట్యానికేతన్) పేరుతో నృత్యశిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణనిస్తున్నాడు. వంశీప్రతాప్ గడచిన 28 సంవత్సరాలుగా తను నేర్చుకున్న కళలను పలువురికి నేర్పుతూ ఎందరో శిష్యులను తయారు చేశారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వందకు పైగా పాఠశాలల్లో డ్యాన్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతీ తెలంగాణ పండుగలకు అమెరికాలోని తన శిష్యులకు ఆన్‌లైన్ ద్వారా డ్యాన్స్ నేర్పించడం గమనార్హం.

నాట్యంలో ప్రయోగాలు


లోక వృత్తానుకరణం నాట్యంఅని భరతముని నాట్యశాస్త్రం చెబుతున్నది. సమకాలీన సమస్యలను ఏకరువు పెడుతూ, ప్రజలను మేల్కొలిపేదిగా నాట్యం ఉండాలనేది దీని సారాంశం. అందుకే వంశీ ప్రతాప్ నృత్యాన్ని కేవలం నేర్చుకోవడం, నేర్పడం అనే ప్రక్రియతో కాకుండా ప్రతి నాట్యాన్ని ప్రయోగశాలగా తీర్చిదిద్దాడు. ఈ ఏడాది రవీంధ్రభారతీలో తెలంగాణ కళారత్నాల వీణ, తెలంగాణ భాషాసాంస్కతికశాఖ, నవరస నాట్యానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో అభినయ హరివిల్లు కాన్సెప్ట్‌తో కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మోహినీ అట్టం, కథక్, భరతనాట్యం, మణిపురి ఏడు నృత్యాలను వరుసగా ప్రదర్శించి పలు రికార్డులు స్వంతం చేసుకున్నాడు.

400కు పైగా ప్రదర్శనలు


oddisa3
వంశీ ప్రతాప్‌గౌడ్ ఇప్పటి వరకు దాదాపు 400కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అందులో 150కి పైగా శివుడి వేషధారణలోనే ఉండడం విశేషం. 2001లో గచ్చిబౌలి స్టేడియం ప్రారంభానికి వచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి సమక్షంలో నృత్యాన్ని ప్రదర్శించడం మరిచిపోలేని అనుభూతి అని ఆయన అంటారు. దూరదర్శన్‌లో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రియభారతి, సంపంగి, కోనంగి, చక్రవాకం సీరియల్స్‌లో నటించారు. 2004లో సింగపూర్‌లో, 2005లో బ్యాంకాక్‌తో పాటు పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రపంచ రికార్డులు


నాట్యరీతుల్లో వంశీ ప్రతాప్ చేసిన, చేస్తున్న ప్రయోగాలు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2018లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, గోల్డెన్ స్టార్, జీనియస్ వరల్డ్ రికార్డులు ఆయన స్వంతమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంగా తెలంగాణ జయభేరి, మహాత్మా జ్యోతిభాపులే పూలే జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రలను నృత్య రూపకాలలో ప్రదర్శించి పలువురి మన్ననలు అందుకున్నారు.

ఉచితంగా నేర్పిస్తాను...


oddisa
ప్రాచీన, జానపద నృత్య కళలంటే నాకు ఎంతో ఇష్టం. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తోంది. అన్ని విధాలా ఆదుకుంటోంది. నాకు జిల్లా కేంద్రంలో ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తే కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి, ఆసక్తి ఉన్న వారికి నాకు తెలిసిన కళలన్నీ ఉచితంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా.

-ప్రతాప్ గౌడ్, భారతీయ సాంస్కృతిక నాట్యాచార్యుడు

...?మధుకర్ వైద్యుల

404
Tags

More News

VIRAL NEWS