ఐటీ నాయకురాలు


Mon,July 17, 2017 12:58 AM

అనుకున్న రంగంలో తిరస్కరణలు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో ముందుకు నడిచారామె. మునిగిపోతున్న సంస్థలను ఉన్నత స్థితికి చేర్చిన అనుభవం ఆమె సొంతం. అందుకే ఆమె ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర కనిపిస్తుంది. పనిచేస్తున్న సంస్థ గౌరవాన్ని పెంచడంలోనూ కీలకంగా వ్యవహరిస్తారు. చేయాలనుకున్న పని విషయంలో పట్టుదలతోనూ, పని పూర్తయ్యే వరకు అదే అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. ఏ కంపెనీలో పనిచేసినా ఆ సంస్థ విజయంలో ఆమె కృషి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే, పురుషాధిక్య ఐటి రంగంలోనూ రాణించగలుగుతున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే దృక్పథాన్ని ఒంటబట్టించుకుని వ్యాపార రంగంలో తనప్రత్యేకత చాటుకుంటున్న హెచ్.పీ. ఇండియా ఎమ్‌డీ నీలం ధావన్ సక్సెస్‌మంత్ర ఇది.
micro
భారతదేశంలో హెవ్లెట్ - ప్యాకర్డ్ సక్సెస్ కావడంలో నీలం ధావన్ కృషి చాలా ఉంది. ఇద్దరు పిల్లల తల్లి, బాధ్యతగల భార్య అయిన నీలం దేశంలోనే గుర్తింపు పొందిన ప్రముఖ ఐటీ కంపెనీకి సీఈవో. అంతేకాదు ఆమె కార్పొరేట్ ప్రపంచంలో మహిళలకు ఆదర్శం కూడా. ప్రధానంగా పురుషాధిక్య ఐటీ పరిశ్రమలో ఆమె రాణించడం అంటే ఒక రకంగా అద్భుతమనే చెప్పాలి. ఆ అద్భుతం ఏ ఒక్కరోజులోనో సాధ్యం కాలేదు. ఆమె విజయాల వెనుక సుదీర్ఘమైన సవాళ్లు, అనుభవాలున్నాయి. అమె ఎదుగుతున్న క్రమంలో ఎదురైన సవాళ్లపై ఒక రకంగా పెద్ద యుద్ధమే చేశారని చెప్పాలి. కఠినమైన కార్పొరేట్ రంగంలో ఒక మహిళగా మనుగడ సాగించడమంటే అంత సులువైన విషయమేం కాదు. అలాంటిది అంచెలంచెలుగా ఎదిగిన ఆమె విజయసోపానం వ్యాపార రంగంలో ఎదగాలనుకుంటున్న యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మనుగడ కోసం పోరాటం : నీలం ధావన్ విజయాలు సాధించడానికి ముందు అంతే స్థాయి వైఫల్యాలను కలిగి ఉండడం గమనార్హం. మార్కెటింగ్ రంగంలో ఆడవారికి అంతగా ప్రాధాన్యం లేని 80-90 దశకంలో తనకు అభిరుచి గల ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో కొనసాగుదామనుకున్నా హిందుస్థాన్ లీవర్, ఏషియన్ పెయింట్స్ సంస్థలు మహిళలను మార్కెటింగ్ విభాగంలో నియమించుకోవడానికి సిద్ధంగా లేవు. అలాగని నీలం ఆ రోజులను తిట్టుకుంటూ కూర్చోలేదు. అప్పటి వరకు ఐటీ పరిశ్రమలో ఎవరూ గుర్తించని మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకుని ఏ భారతీయ మహిళా సాధించని, అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకొని, వేలాది మంది యువతులకు స్ఫూర్తిగా నిలిచారు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ : హెచ్‌సీఎల్‌లో పనిచేసిన 14 సంవత్సరాల కాలంలో మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడమే కాకుండా ఐటీ ఇండస్ట్రీలో మార్కెటింగ్ రంగం ఎంత కీలకమో గుర్తించగలిగారు. చేరడానికి ముందు ఆరు సంవత్సరాలపాటు కాంప్యాక్‌లో పనిచేశారు. ఐబీఎంలో చేరాక వైస్ ప్రెసిడెంట్‌గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యురాలిగా నియమితురాలైంది. ఈ క్రమంలోనే భారతదేశంలోని ఐటీ పరిశ్రమల్లో ఆమె ప్రముఖంగా గుర్తింపు పొందారు. ఆమె హెవ్లెట్ - ప్యాకర్డ్ సంస్థ కస్టమర్ అండ్ సొల్యూషన్స్ గ్రూపులో ఉపాధ్యక్షురాలిగా చేరారు. ఇది కార్పొరేట్ రంగంలో ఆమె ఎదుగుదలకు ఎంతో దోహదపడింది. ఒక రకంగా ఐటీ రంగంలో ఒక అసాధారణ విజయాన్ని సాధించడానికి అవకాశంగా ఉపయోగపడింది. నిజానికి అప్పటికీ ఐటీ రంగంలో ఉన్న మహిళల నిష్పత్తి కేవలం 18 శాతం మాత్రమే.

ఇల్లు పిలిచింది!

2008లో నీలం హెచ్‌పీలో చేరారు. అక్కడ ఐటీ పరిశ్రమ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఆమెకు కల్గింది. కానీ, అప్పుడు ఆ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా మరిన్ని సవాళ్లు ఎదుర్కోవడానికి సిద్ధపడాల్సి వచ్చింది. నిజానికి అప్పటికి హెచ్‌పీ మునిగిపోయే దశలో ఉన్నది. ఈ దశ ఆమెకు ఒక రకంగా చాలా కఠినమైన కాలం. ఐటీ పరిశ్రమల మధ్య పోటీ పెరుగుతోంది. మరోవైపు డాలర్ విలువ తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె ప్రయాణం అంత సులభమేమీ కాదు. ఆ సమయంలోనే హెచ్‌పీ సంస్థ ఆమె తలపై నాయకత్వపు టోపీని ఉంచింది. నిజానికి మరొకరైతే అంత ధైర్యం చేసేవారు కాదు. కానీ, ఆమె నీళ్లలో మునుగుతున్న నావను ఒడ్డుకు చేర్చడంలో కృతకృత్యురాలయ్యారు. తన పనితనంతో హెచ్‌పీ ప్రపంచ అధినేత మెగ్ విట్మన్‌ను ఆకట్టుకుంది. నీలంకు ఐటీ సేవలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పరిశోధన విభాగాల ఫోర్ట్‌పోలియోను కేటాయించింది. ఆ సమయంలో నీలం హెచ్‌పీ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారు. అదే సమయంలో ఫిలిప్స్ ఎలక్ట్రానిక్స్ ఎన్‌వి పర్యవేక్షణ బోర్డు సభ్యురాలుగా కూడా ఉన్నారు.కుటుంబం : చదువు పూర్తయిన తర్వాత అతుల్ ధావన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన నీలంకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. వారి అత ్తకూడా వర్కింగ్ వుమన్. కానీ, నీలం ధావన్‌కు రెండవ కూతురు పుట్టిన సమయంలో పాప యోగక్షేమాలు చూసుకోవడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ధావన్‌కు ఇద్దరూ కూతుళ్లు.. నైనా, నుపుర్.

అవార్డులు, విజయాలు

భారతదేశం నుండి నీలం ధావన్ మహిళా పారిశ్రామికవేత్తగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు. తిరస్కరణలు, సవాళ్లు, ఘర్షణలు ఎదుర్కొని విజయం సాధించిన వారికి ఈ ప్రపంచం సలాం చేస్తుంది. ధావన్ విషయంలోనూ అదే జరిగింది. ఆమె పట్టుదల ముందు ప్రపంచం చిన్నదైంది. దీంతో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు ఆమెకు దాసోహం అయ్యాయి. 2009లో ఫార్చ్యున్ వార్షిక ప్రపంచ జాబితాలో అత్యంత శక్తివంతమైన మహిళా వ్యాపారిగా 37వ స్థానాన్ని సాధించారు. 2006లో ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో మైక్రోసాఫ్ట్ ఇండియాను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌కు అనుబంధ సంస్థగా బిల్ గేట్స్ నుంచి గుర్తింపును అందుకున్నారు. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నాయకత్వ లక్షణాలతో పాటు, సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగారు. ఇది భారతీయ మహిళా వ్యాపారికి చాలా గొప్ప గుర్తింపు. దీంతో ఆమె కీర్తి మరింత పెరిగింది.

మైక్రోసాఫ్ట్‌కు భారతీయ ముఖం


microsoft
నీలం 2005లో మైక్రోసాఫ్ట్ ఇండియాలో చేరారు. అప్పటి వరకు హార్డ్‌వేర్ పరిశ్రమలో మాత్రమే పయనించిన ఆమె తొలిసారి సాఫ్ట్‌వేర్ కారిడార్లో అడుగుపెట్టారు. అక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆపరేషన్స్ హెడ్‌గా తన ఉద్యోగాన్ని ప్రారంభించారు. కస్టమర్స్, చానల్స్ భాగస్వాముల మధ్య ఒప్పందాలు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ దశలో మైక్రోసాఫ్ట్‌కు ఎంతోమంది సీనియర్స్ ఉన్నప్పటికీ భారతీయ బాధ్యురాలిగా నీలం నిలిచిందంటే అతిశయోక్తికాదు. ఆ తర్వాత తిరిగి తన హార్డ్‌వేర్ రంగానికి తిరిగి వచ్చేంత వరకు మైక్రోసాఫ్ట్‌కు భారతీయ ఎండీగా ఆమె వ్యవహరించారు.

బాల్యం, విద్యాభ్యాసం


coehpnew
నీలం ధావన్ అద్భుతమైన బాల్యాన్ని అనుభవించారు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆమె 1980లో న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్‌లో బి.ఏ. చేశారు. ఆ తరువాత 1982లో ఎఫ్‌ఎంఎస్‌లో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ చేశారు. మార్కెటింగ్ రంగంలో అవకాశం రాకపోవడంతో ఐటీ రంగానికి చెందిన హెచ్‌సీఎల్‌లో చేరాల్సి వచ్చింది. మార్కెటింగ్ కెరీర్‌ను కొనసాగించడం, అవసరమైన కొత్త విషయాలు నేర్చుకోవాలన్న సంకల్పంతోనే ఐటీ రంగాన్ని ఎంచుకోవలసి వచ్చింది. హెచ్‌సీఎల్‌లో ట్రైనీ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన ఆమె ఆశ్చర్యకరంగా 14 సంవత్సరాల పాటు అక్కడే పనిచేశారు. వృద్ధి చెందుతున్న క్రమంలోనే ధావన్ కెరీర్ కూడా అదే స్థాయిలో ఎదిగింది.

హార్డ్‌వేర్ రంగంపై ఆసక్తి


computer-hardware
మైక్రోసాఫ్ట్ నుంచి బయటికి రావడానికి ముఖ్యకారణం నీలంకు హార్డ్‌వేర్ రంగం పట్ల ఉన్న ఆసక్తే అంటారు నిపుణులు. మరోవైపు అప్పటికే వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్‌పీ సంస్థను పూర్తిగా నిలబెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందులో ఆమె విజయం సాధించారు కూడా. మైక్రోసాఫ్ట్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ రెండు సంస్థలను ఉన్నత స్థానంలో నిలబెట్టారు. వీటి ఆపరేటింగ్ సామర్ధ్యాన్ని, నిర్వహణను ఉన్నత స్థితికి చేర్చి కంపెనీల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో ధావన్ విజయం సాధించారు. అందుకే, ఆమె ఐటీ కంపెనీల్లో విజయవంతమైన నాయకురాలిగా పేరు సంపాదించారు.

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles