శబ్ద తరంగం


Sat,October 27, 2018 01:33 AM

గెలుపు కోసం నువ్వు చేసే ప్రయత్నం, నీ పోరాటం మౌనంగానే ఉండనివ్వు.. ఎందుకంటే నీ గెలుపే పెద్ద శబ్దమై ఈ ప్రపంచానికి వినిపిస్తుంది అనే నానుడి సాజిదా ఖాన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఆడియో రంగంలో అడుగుపెట్టి దేశంలోనే తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్‌గా చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నది. 2018గానూ రాష్ట్రపతి అవార్డు సైతం అందుకున్నది. తాజాగా తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు కూడా సంపాదించింది. సాజిదా ఖాన్ మౌనంగా చేసిన శబ్ద పోరాటం గురించి పూర్తి వివరాలతో ఈ కథనం మీకోసం..

Sajidha Khan
సెలవు రోజు హాయిగా అమ్మానాన్నలతో గడిపిన క్షణాలు ఆమె జీవితంలో తక్కువే. కంటినిండా నిద్రపోయి పొద్దున్నే ఆలస్యంగా నిద్రలేచిన రోజులు కూడా తక్కువే. స్నేహితులతో సరదాలు, ఆటలు కూడా తక్కువే. మరి ఇంకేం ఉన్నాయి నీ జీవితంలో అని అడిగితే.. ఒకప్పుడు ఏ సమాధానం చెప్పలేకపోయేదేమో! కానీ ఇప్పుడు తన దగ్గర మంచి సమాధానం ఉంది. అదే.. దేశంలోనే తొలి మహిళా ఆడియో ఇంజినీర్, మ్యూజిక్ టెక్నీషియన్ తన పన్నెండేండ్ల కష్టానికి ఫలితం అది. ఒక సినిమాకు సౌండ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ముఖ్యమైన విభాగాన్ని సులువగా హ్యాండిల్ చేయగలదు సాజిదా ఖాన్. సినిమా షూటింగ్ అయిపోయి, ఎడిటింగ్ పూర్తయిన తర్వాత ఆడియో ఇంజినీర్ దగ్గరికి ఆ రష్ అంతా వస్తుంది. డైరెక్టర్ అభిరుచి మేరకు, కథలో ఉన్న యాక్షన్లకు తగ్గట్టుగా ఆడియో మిక్స్ చేయడం మామూలు విషయం కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆడియో టెక్నాలజీలతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. సాజిదా ఖాన్ ఈ విషయంలో ఎంతో ముందు జాగ్రత్తతో ఉంటుంది. ఓపిక, పట్టుదల, కృషి, నిరంతర అధ్యయనం మనిషిని విజయతీరాల వైపు ఎలా నడిపిస్తుందో నిరూపిస్తున్నది.


తెర దాటుకొని..

గీతాంజలి స్టూడియోలో కెరీర్ ప్రారంభించిన సాజిదా తన పన్నెండేండ్ల ప్రస్థానంలో ఇప్పటి వరకు 60 సినిమాలకు పనిచేసింది. దాసరి నారాయణరావు, భారతీ రాజా వంటి మహామహుల దగ్గర పని చేసింది. మ్యూజిక్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డీటీఎస్ మిక్సింగ్, పాటల మ్యూజిక్ ఇలా అన్నీ రంగాల్లో రాణిస్తూ మహిళలు ఏ రంగంలో అయినా గెలువగలరు అని నిరూపిస్తున్నది. ముస్లిం కుటుంబంలో పుట్టిన సాజిదా తనలోని నైపుణ్యాలను చిన్న వయసులోనే గుర్తు పట్టింది. ఎలాంటి బెరుకు లేకుండా తండ్రికి తన ఆలోచన గురించి చెప్పింది. సాజిదా తల్లిదండ్రులు బాగా చదువుకున్నవారు. తండ్రి సలీమ్ అహ్మద్‌ఖాన్ మాజీ ఆర్పీఎఫ్ ఆఫీసర్. ఆయనకు సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. సాజిదాకు ఆయన అందించిన ప్రోత్సాహ ఫలితం సాజిదా ఇప్పుడు తొలి మహిళగా నిలువడానికి తోడ్పడింది.

కల్చరల్ లీడర్..

హైదరాబాద్‌లోని మౌలాలికి చెందిన సాజిదా ప్రొబెల్స్ గార్డెన్స్ హైస్కూల్లో చదువుకున్నది. స్కూల్లో ఎలాంటి కల్చరల్ ప్రోగ్రాం జరిగినా సాజిదా ముందుండేది. ఆమె ఉత్సాహాన్ని గమనించిన టీచర్లు సాజిదాను కల్చరల్ గ్రూప్స్‌కి లీడర్‌ని చేశారు. అలా చిన్న వయసులోనే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో తన ప్రతిభను ప్రదర్శించింది. దూరదర్శన్‌లో సైతం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నది. ఆ తర్వాత అదే దూరదర్శన్‌లో కథల కార్యక్రమానికి సౌండ్ ఇంజినీర్‌గా చేసింది. ఇంటర్ పూర్తయిన తర్వాత మల్టీమీడియా కోర్సులో చేరింది సాజిదా. అక్కడ ఆడియో ఎడిటింగ్ నేర్చుకుంది. కోర్సులో భాగంగా ఓ స్టూడియోకి వెళ్లిన సాజిదాకు అక్కడి వాతావరణం బాగా నచ్చింది. ఆ క్షణమే తను ఆడియో ఇంజినీర్ కావాలని నిర్ణయించుకున్నది. కోర్సు పూర్త్తయిన తర్వాత నేరుగా వెళ్లి లలిత్ సురేష్ దగ్గర ఆడియో ఇంజినీర్‌గా చేరింది. ఆ తర్వాత గీతాంజలి, మల్లెమాల స్టూడియోల్లో ఆడియో ఇంజినీర్‌గా పనిచేసింది. ఎన్నో యాడ్స్‌కూడా చేసింది. ఆ తర్వాత ఎన్నో భక్తిగీతాలు, రాజకీయ పార్టీల పాటలు, కార్టూన్, యానిమేషన్ మూవీస్, డాక్యుమెంటరీలకు సౌండ్ ఇంజినీర్‌గా చేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండడంతో సాజిదాకు డబ్బింగ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. రామ్ రాబర్ట్ రహీం, హరి ఓం సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పింది. షోలే కామెడీ షోలో బసంతి పాత్రకు డబ్బింగ్ చెప్పింది.


కృషికి ఫలితం..


Sajida_Khan
1. 2015 ఆగస్టు 26న న్యూఢిల్లీలో తొలి మహిళా మ్యూజిక్ టెక్నీషియన్ ఆఫ్ ఇండియాగా రాజీవ్‌గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.
2. 2016 మార్చి8న మహిళా దినోత్సవం సందర్భంగా విజయ్ వనితా అవార్డు అందుకున్నది.
3. అదే ఏడాది ఏప్రిల్ 14న దేశ తొలి ఫీమెల్ ఆడియో ఇంజినీర్‌గా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్మారక సేవారత్న అవార్డు అందుకున్నది.
4. 2016 నవంబర్ 13న తెలుగు సాహిత్య కళాపీఠం అవార్డు పొందింది.
5. తిరుపతి సిటీ చాంబర్ వారు ప్రతీ ఏడాది ఇచ్చే ఉగాది పురస్కారం అవార్డు 2016 ఏప్రిల్ నెలలో అందుకున్నది.
6. 2017 జనవరి నెలలో తొలి మహిళా ఆడియో ఇంజినీర్‌గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.
7. 2017 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వంచే తాలూకా ట్రస్ట్ అవార్డు పొందింది.
8. మదర్‌థెరిస్సా మెమొరియల్ అవార్డు 2017 ఆగస్టు 26న తెలంగాణ సిటిజెన్ కౌన్సెల్ వారు ప్రదానం చేశారు.
9. తెలంగాణ ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి దేశంలో తొలి మహిళా ఆడియో ఇంజినీర్‌గా సేవలందిస్తున్నందుకు కల్చరల్ అవార్డు - 2018 అందుకున్నది.
10. 2018 మార్చి నెలలో హైరేంజ్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించింది.
11. 2018 అక్టోబర్ నెలలో మహాత్మాగాంధీ గ్లోబల్ పీస్ అవార్డు అందుకున్నది.
12. తెలంగాణ ప్రభుత్వం తరుపున భాషా, సాంస్కృతిక శాఖ నుంచి హెర్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నది.
13. తొలి ఇండియన్ వుమెన్ ఆడియో ఇంజినీర్‌గా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
14. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డుల్లో తొలి మహిళా ఆడియో ఇంజినీర్‌గా స్థానం సంపాదించింది.
వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో, జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నది సాజిదా ఖాన్.


అదే నా కోరిక..


Sajidha Khan1
పన్నెండేండ్ల నుంచి ఈ రంగంలో ఉన్నాను. దేశంలో తొలి మహిళా ఇంజినీర్‌గా స్థానం సంపాదించాను. భవిష్యత్తులో ఎంతోమందికి తక్కువ ఫీజుతో, వీలైతే ఉచితంగా ఆడియో మిక్సింగ్ నేర్పించాలన్నది నా ఆశయం. అమ్మాయిలు ఈ రంగంలోకి రావాలి. మంచి అవకాశాలున్నాయి. కష్టపడితే ఫలితం ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక భవిష్యత్తు విషయానికొస్తే.. ఒక్క సినిమాకైనా ఏఆర్ రెహమాన్, ఇళయరాజాల దగ్గర పని చేయాలని నా కోరిక.
- సాజిదా ఖాన్, భారత తొలి మహిళా ఆడియో ఇంజినీర్

...? ప్రవీణ్‌కుమార్ సుంకరి
బి.సంజయ్‌చారి

881
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles