నేను పెళ్లి చేసుకోవచ్చా?


Mon,January 29, 2018 11:13 PM

ఈ మధ్య నాకు కామెర్ల వ్యాధి సోకింది. ఆ సమయంలో పరీక్షలు నిర్వమించి హెపటైటిస్ బిగా నిర్ధారించారు. ఈ వ్యాధి ఒకసారి సోకితే ఇక అది పూర్తిగా శరీరం నుంచి తొలగిపోవడం సాధ్యపడదని మిత్రుడు ఒకరు అన్నారు. అది నిజమేనా? అంతేకాదు.. పెళ్లి చేసుకుంటే భాగస్వామికి కూడా సోకుతుందని కూడా అన్నాడు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను పెళ్లి చేసుకోకూడదా? ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుందా? నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకెందుకు ఈ ఇన్ఫెక్షన్ సోకింది. దయచేసి పూర్తి వివరాలు తెలియజేయగలరు.
ఆనంద్, మంచిర్యాల

councelling
హెపటైటిస్ గురించిన సరైన అవగాహన లేకపోవడం వల్ల రకరకాల అపోహలు ప్రాచూర్యంలో ఉన్నాయి. హెపటైటిస్‌లో 5 రకాల వైరస్‌లు ఉంటాయి. వాటిని హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ గా గుర్తిస్తారు. వీటిలో ఏది సోకినా కనిపించే ప్రధాన లక్షణం కామెర్లు. ఇందులో ఒక్కో వైరస్ ఒక్కోవిధంగా వ్యాపిస్తుంది. మీకు సోకిన హెపటైటిస్ బి కలుషిత రక్తం లేదా కలుషితమైన సూదులు, శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. చాలా మంది హెపటైటిస్‌ను హెచ్‌ఐవీతో పోలుస్తారు. ఇందుకు ఈ రెండు వైరస్‌లు వ్యాప్తి చెందే తీరు ఒకటే కావడం మాత్రమే. అంతకుమించి ఈ రెండింటిలో ఎలాంటి సారూప్యం లేదు. హెపటైటిస్ బి వల్ల కాలేయం ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే దెబ్బతింటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్‌గా మారే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి స్థితిలో కాలేయ మార్పిడి తప్పమరో మార్గం ఉండదు. డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటూ ఉంటే హెపటైటిస్ బి వైరస్‌తో కూడా సాధారణ జీవితం గడపడం సాధ్యమే. క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ, పోషకాహారం, తగినంత వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తే వ్యాధిని పూర్తిస్థాయిలో అదుపులో పెట్టుకోవచ్చు. హెపటైటిస్ బి వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇది పూర్తిగా సురక్షితం. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జీవిత భాగస్వామికి వ్యాక్సిన్ వేయించి, సురక్షిత శృంగారం జరుపడం ద్వారా ఆటంకాలు లేకుండా దాంపత్య జీవితం కూడా గడుపవచ్చు. కాబట్టి మీరు చింతించాల్సిన పనిలేదు. ముందుగా మీరు మీ డాక్టర్‌తో పరిస్థితిని గురించి పూర్తి స్థాయిలో చర్చించి చికిత్స ప్రారంభించండి. మీరు తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు.
ravi-shankar

556
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles