మీకూ సాధ్యమే!


Mon,February 5, 2018 10:53 PM

క్యాన్సర్‌ను వీరు జయించారు..
yuvraj-singh
ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురైనప్పుడు అందరూ ఆందోళన చెందారు. ఆరోగ్యవంతమైన జీవనశైలి గడుపుతున్నా క్యాన్సర్ వస్తుందా? అని భయపడ్డారు. తర్వాత ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. పూర్తిగా కోలుకుని ది టెస్ట్ ఆఫ్ మై లైఫ్8 అనే పుస్తకాన్ని రచించారు. ఇంతకు ముందులాగే ఆయన క్రీడా జీవితం గడుపుతున్నారు. అనేక భాషల్లో నటించి ఎందరికో అభిమాన నటి అయిన మనీషా కొయిరాలా 2012లో అండాశయ క్యాన్సర్‌కు గురయ్యారు. సర్జరీ తర్వాత ట్రీట్‌మెంట్స్ తీసుకుని ఇప్పుడు క్యాన్సర్ మీద అవగాహన కలిగించే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 16 ఏళ్ల నుండే రేసుల్లో పాల్గొనేవాడు. 25 ఏళ్ల వయసులోనే మెదడు, ఊపిరితిత్తులు, తర శరీర భాగాల్లో అంతా పాకిపోయి లేట్ స్టేజ్‌లో వృషణాల క్యాన్సర్ బయటపడినప్పుడు ఇక ఆయన బతకడం కష్టం అనుకున్నారు. కాని పట్టుదలతో, ఆత్మైస్థెర్యంతో అన్ని రకాల కాంబినేషన్‌తో ట్రీట్‌మెంట్ తీసుకుని ఆ మహమ్మారిపై విజయం సాధించారు. తరువాత ఆరుసార్లు టూర్ డిఫ్రాన్స్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ గెల్చుకున్నారు.
mandela
ఒకప్పటి సౌత్ ఆఫ్రికా దేశాధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి విజేత, భారతరత్న నెల్సన్ మండేలా పిఎస్‌ఎ పరీక్షతో ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందే పసిగట్టి ఏడు వారాల రేడియేషన్ థెరపీ తర్వాత 1990లో ప్రొస్టేట్ గ్రంథిని తొలగించుకుని క్యాన్సర్ నుంచి విముక్తిని పొందారు. 95 ఏళ్ల వయసులో డిసెంబర్ 5, 2013లో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో మరణించారు. నటి గౌతమి, గ్రామి అవార్డ్ దక్కించుకున్న పాటల రచయిత, గాతని షెరిల్ క్రౌ, జీన్ మ్యుటేషన్ పరీక్షతో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మాస్టెక్టమీ చేయించుకున్న హాలివుడ్ నటి ఏంజెలీనా జూలీ బ్రెస్ట్ క్యాన్సర్ మీద విజయం ప్రకటించిన చాలామందిలో కొందరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకప్పటి ప్రెసిడెంట్ నీలం సంజీవరెడ్డి 1977లో లంగ్ క్యాన్సర్‌ను, ఆసిన్ (నటి), మమతా మోహన్‌దాస్ (నటి, సింగర్), లీసా రే (టొరంటో నటి, మోడల్) మల్టిపుల్ మైలోమాకు స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుని క్యాన్సర్‌ను ఎదిరించిన ప్రముఖులలో నిలిచారు.
gauthami
మనకు తెలిసిన ఈ ప్రముఖ విజేతలతో పాటు తెలియనివాళ్లలో కూడా గుండెధైర్యంతో జీవితంలో అనేక ఒడిదుడుకులతో పాటు క్యాన్సర్‌ను జయించిన విజేతలు ఎందరో. వీరిలో కొందరు జీన్ మ్యుటేషన్, ఇతర పరీక్షలతో ముందే ప్రమాదాన్ని గుర్తించి క్యాన్సర్ రాకుండా చికిత్స తీసుకున్నవారైతే మరికొందరు శరీరమంతా పాకి ఇంక ఏ విధంగా ఆశలు లేవన్న స్థితి నుంచి బయటపడి సాధారణ జీవితం గడుపుతున్నవారూ ఉన్నారు.
ఇలాంటి విజేతలలో ఉండే లక్షణాలు ఏమిటని ఆలోచిస్తే వారికి సోకింది క్యాన్సర్ అని తెలిసినా కుంగిపోకుండా మనో నిబ్బరంతో ఎదుర్కోవడమే. ముందుగా కొంత ఆందోళనకు గురైనా తర్వాత వారు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? చికిత్సలు ఎలా తీసుకోవాలి? ఏయే జాగ్రత్తలు పాటిస్తే మంచిది? ఆహారం పట్ల ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి? ఇలాంటి విషయాల్లో చక్కని అవగాహన పెంపొందించుకుని డాక్టర్ సలహాలు పాటిస్తూ, చికిత్స తీసుకుంటూనే నటించినవారు, నర్తించినవారు, ఆటల్లో పాల్గొన్నవారు, పుస్తకాలు వ్రాసినవారు ఉన్నారు.
Manisha-Koirala

అందుబాటులో ఆధునిక వైద్యం..

క్యాన్సర్ వ్యాధిగ్రస్తులవడానికి కచ్చితమైన కారణం ఇదీ అని తెలియదు. ఈ వ్యాధికి గురైనవారిలో చక్కటి ఆరోగ్యవంతమైన జీవనశైలి గడుపుతూ ఉన్నవారు, దురలవాట్లకు లోనైనవారు, వయసు పైబడినవారూ ఉంటారు. అయితే మనం చేయాల్సిందల్లా మంచి జీవనశైలితో పాటు అవగాహనతో ముందే పసిగట్టగలగడం. ఏ క్యాన్సర్‌నైనా తొలిదశలో గుర్తిస్తే ఆ కణం మీద విజయం సాధించం తేలికే. పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాల్ అలవాట్లు, అధిక బరువు, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువని తెలుసుకుంటే మంచిది. పర్యావరణ పరిస్థితులు, వారు చేసే వృత్తి, వంశపారంపర్య లక్షణాలు, ఇతర మందులు, మానసిక ఒత్తిడి, అలవాట్లు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ఇలా అనేక విషయాలతో ముడిపడి ఈ సమస్య వచ్చే రిస్క్ ఉంటుంది. అయితే మనలో చాలామందికి అవగాహన లేమితో పాటు అపోహలు అనవసరమైన అనుమానాలు ఎక్కువే.

ఇప్పటి వైద్య విధానాలతో ఇతర దీర్ఘకాలిక వ్యాధుల మీద, క్యాన్సర్ మీద పట్టు సాధించగలుగుతున్నారు. నయం చేయడం అన్ని సందర్భాలలో సాధ్యం కాకపోయినా అదుపులోకి బాగా తీసుకురాగలుగుతున్నారు. కీమోథెరపీ మందులలో కొత్తదనాలు చోటు చేసుకుని వ్యక్తిగత చికిత్సా విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ చాలావరకు తగ్గుతున్న ఈ కీమో మందుల ధరలు ఇంకా అదుపులోకి రావాల్సి ఉంది. ఇతర శరీర భాగాల మీదా చాలా తక్కువ ప్రభావం చూపే రేడియేషన్ థెరపీలు అందుబాటులోకి వచ్చేశాయి. విఎంఎటి, సైబర్‌నైఫ్ వంటి రేడియో రోబోటిక్ సర్జరీలతో దుష్ఫలితాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇక సర్జరీలు, శరీర భాగాలను తొలగించినపుపడు చేసే రీకన్‌స్ట్రక్షన్ సర్జరీలతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్న కోతతో చేసే సర్జరీలు కీహోల్ సర్జరీలు క్యాన్సర్‌కు చేయగలగడమే కాకుండా వెంటనే వారికి ఏమాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా తొలగించిన శరీర భాగాలను పునర్నిర్మించగలుగుతున్నారు.
mohana-vamshi

మీరే విజేతలు!

తొలిదశలో కనుగొనగలగడం, అనుభవజ్ఞుడైన డాక్టర్‌ను సంప్రదించడం, మందులు, చికిత్సలు కరెక్టుగా తీసుకోవడంతో పాటు వీలైతే వారి వృత్తులకు వెళ్లడం, కౌన్సెలింగ్, గ్రూప్ కౌన్సెలింగ్‌లకు హాజరు కావడం, యోగా, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేయడం, నలుగురితో ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చేస్తే మంచిది. క్యాన్సర్ అని తెలియగానే మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్య ధోరణిలో వెళ్లేవాళ్లలో ఎక్కువగా స్త్రీలు ఉంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో మంచి ఆహారం తీసుకుంటూ, ఇతర వ్యాపకాలు పెంపొందించుకుని చికిత్సలు తీసుకుంటే క్యాన్సర్‌ను జయించిన విజేతలూ మీరూ కావొచ్చు.

295
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles