విద్య కోసం మనం.. ఏ దేశం వెళ్దాం?


Wed,August 22, 2018 01:12 AM

పుష్కలమైన విశేషమైన మానవ వనరులున్న మన దేశం తన శక్తి సామర్థ్యాల సత్తాను చాటుకునేందుకు కేవలం అమెరికాపైనే ఆధారపడి ఉండాలా?
అగ్రరాజ్యంలో పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో మన యువత ప్రత్యామ్నాయంగా ఏ దేశాన్ని ఎంచుకోవాలి?

University-Library1
రాష్ర్టాన్ని వందశాతం సాంకేతిక అక్షరాస్యత సాధించే దిశగా చేస్తున్న కృషికి, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సహకరిస్తున్న విధానాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడేండ్ల పాటు తెలంగాణ ఐటీ అసోసియేషన్‌కు అవార్డులను అందించింది. ఈ క్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టెకీలు ఒక్కతాటిపైకి రావడం, స్వరాష్ట్ర అభివృద్ధికి వారు ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి అంశాల గురించి పలు సందర్భాల్లో పంచుకున్న నేపథ్యంలో ఆ లక్ష్యాలను అమల్లో పెట్టడంతో పాటుగా టీటా విస్తరణ కోసం మూడు దేశాల పర్యటన సిద్ధం చేసుకున్నామని సందీప్‌కుమార్ మక్తాల తెలిపారు. జూన్ 27న మొదలైన పర్యటన జూలై 15తో మూడు దేశాల్లో ముగిసింది. హ్యూస్టన్‌లో జరుగుతున్న ప్రపంచ తెలంగాణ మహాసభలు-2018కి అతిథిగా సందీప్‌కుమార్ మక్తాల హాజరైన ఆరువేల మందిని ఉద్దేశించి ప్రసంగించిన సెషన్‌లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న తీరు, ఎన్నారైలు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన విధానం గురించి వివరించారు. ఆటా బాధ్యులు సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, కరుణాకర్ రెడ్డి, మహిధర్ రామసహాయం, వెంకట్ మంతెనల సహకారంతో పెట్టుబడులు, డిజిటల్ లిటరసీపై టీటా పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

మెక్సికోలో రికార్డ్! : లాటిన్ అమెరికా దేశమైన మెక్సికోలో ఇప్పటివరకు తెలుగురాష్ర్టాలకు చెందిన సంఘాలు లేవు, అందులోనూ ఐటీ పరంగా అసలు లేవు. అలాంటి దేశంలో సుమారు 500మందితో టీటా మెక్సికో చాప్టర్‌ను జూలై5వ తేదీన సందీప్‌కుమార్ మక్తాల ప్రారంభించారు. ఈ సందర్భంగా మెక్సికో గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మెక్సికోలోని కీలక నగరమైన గ్వాడలహరలోని ఐటీ పార్క్‌లో 123 కంపెనీలు కొలువుదీరి ఉన్నాయని, తెలంగాణవారు మెజార్టీ సంఖ్యలో ఉండటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వివరించారు. వివిధ దేశాలు భారతీయులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కత్తెర వేస్తున్నప్పటికీ మెక్సికోలో స్థానికులకు ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు తక్కువగా ఉండటం వల్ల బేసిక్ ఇంగ్లిష్ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మన యువత ఉద్యోగాలు సులభంగా సంపాదించుకోవచ్చునని స్పష్టం చేశారు. మెక్సికో కరెన్సీ అయిన పెసో భారతీయ కరెన్సీకి రూ.3.50తో సమానమైనందున కనీసం 30,000-40,000 పెసోల జీతం ఉంటున్నందున దాదాపు లక్షకు పైగా జీతం సంపాదించవచ్చని, ఫ్రెషర్స్‌కు ఇది గోల్డెన్ అపార్చునిటీ అని పేర్కొన్నారు. తమ పర్యటనలో పలు ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీ సందర్శించామని ఇక్కడి భారతదేశ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆహారపు అలవాట్లు, సంపాదన వంటి అంశాల్లో సారూప్యత ఉందన్నారు.
University-Library2
విద్యావిధానంపై అధ్యయనం : మెక్సికో అనంతరం తిరిగి అమెరికా పర్యటనకు వెళ్లిన సందీప్‌కుమార్ మక్తాల కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రీమాంట్, శాక్రమెంటో, నాప ప్రాంతాల్లో పర్యటించినట్లు వివరించారు. ఫ్రీమాంట్, శాక్రమెంటో, నాప ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యావిధానాన్ని అధ్యయనం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు అద్భుతమైన మౌళిక సదుపాయాలను కలిగి ఉన్నాయని వెల్లడించారు. ఈ విషయంలో మన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికే దృష్టి సారించాయని, దీన్ని వేగవంతం చేసి పూర్తి సదుపాయాలను కల్పిస్తే విద్యావిధానం అత్యున్నత స్థితికి చేరుతుందని ఆయన విశ్లేషించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, బర్కిలీ యూనివర్సిటీలను సందర్శించినట్లు సందీప్‌కుమార్ వివరించారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఆవిష్కరణలపై ఫోకస్ చేస్తారని తెలిపారు.

అంకుర సంస్థలకు ఇంత ప్రాధాన్యం ఇచ్చినందుకే డ్రాపౌట్ విద్యార్థులు అయినప్పటికీ బిల్‌గేట్స్, స్టీవ్‌జాబ్స్ ప్రపంచం చూపును తమవైపు తిప్పుకొనేలా ఆవిష్కరణలు చేశారన్నారు. సియాటెల్‌లోనే ఉన్న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన కొమోషన్స్ టీటాకు చెందిన ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కలిసి పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని వివరించారు. 80-85% విద్యార్థులు ప్రభుత్వ పాఠాశాలలకే వెళుతుంటారని, ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్, ప్రభుత్వ పాఠశాలలను బట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రభావితం అయి ఉండటం అక్కడి సర్కారీ విద్య సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేవారికి తెలంగాణ ఇన్నోవేషన్ ఆండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు ప్రతిపాదనలు పెట్టినట్లు వివరించారు. కోర్‌స్టాక్, మెక్సికోలోని యొనివాయూనివర్సిటీ స్టూడెంట్ ఎక్సేంజ్ ప్రోగామ్ ఒప్పందాలు జరిగినట్లు వివరించారు.

కెనడాలో టీటా ప్రత్యేకత: కెనడాలో టీటా శాఖను ఏర్పాటు చేయడంతోపాటు విద్యార్థుల కోసం ప్రత్యేక సెషన్స్ నిర్వహించారు. ఉద్యోగస్తుల కోసం అప్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టారు. సిలికాన్ వ్యాలీ కంటే టోరంటోలో సమానంగా అవకాశాలు ఉన్నందున యూఎస్ వైపే కాకుండా కెనడా వైపూ దృష్టి సారించాలన్నారు. కెనడా డాలర్ రూపాయితో పోలిస్తే 50 రూపాయల మారకం రేటు, జాతి విద్వేషం, గన్ కల్చర్ లేవ ని పేర్కొన్నారు.
University-Library4
ప్రభుత్వానికి ప్రతిపాదనలు: అమెరికా కరిక్యులం అత్యున్నత స్థాయిలో ఉండి ప్రాక్టికల్ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తుందని, మన విద్యావిధానంలో ఈ ధోరణి పెరగాలని సందీప్ కుమార్ ఆకాంక్షించారు. విలువల విషయంలో భారతదేశం అత్యుత్తమమని, అయితే విద్యా విధానంలో మారు్పులు వస్తే అత్యున్నత స్థాయికి ఎదుగుతామని సందీప్‌కుమార్ మక్తాల విశ్లేషించారు. అమెరికా, కెనడా, మెక్సికోల్లో 9-12 తరగతుల నుంచి హైస్కూల్ దశలో భాగంగా ఈవెనింగ్ స్కూల్ పారంభం అవుతుందని, సాయంత్రం 6 గంటల వరకు పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవచ్చని తెలిపారు. అదే సమయంలో ఇన్నోవేషన్స్‌పై సిలబస్‌లో ప్రాధాన్యం కల్పించడం వల్ల ఉద్యోగం కోరుకునే విద్యార్థులు స్కూల్ దశలోనే నైపుణ్యాలు పొందడంతో పాటుగా భవిష్యత్‌లో వారికి అవసరమైన సామర్థ్యాలనూ కలిగి ఉంటారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం యువతలోని ఇన్నోవేషన్ నైపుణ్యాలను చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు, ఇదే రీతిలో విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించేందుకు కావాల్సిన ప్రతిపాదనలను త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు సందీప్ తెలిపారు.

ద్వితీయ శ్రేణి నగరాలకు ఊతం: జయేశ్ రంజన్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి

Telanganas
రాష్ట్ర ఐటీ పరిశ్రమలోని ఉద్యోగాలకు సుదీర్ఘ కాలంగా వేదికగా నిలుస్తున్న టీటా తన చాప్టర్‌లను కీలకమైన మూడు దేశాల్లో విస్తరించడం సంతోషకరం. కెనడాలోని తెలుగు టెకీలతో నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం అయినపుడు వారు తెలంగాణ పట్ల చూపుతున్న ఆసక్తి మాకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్నారైలు టీటా ద్వారా మాతో అనుసంధానం అయిన సమయంలో వారి డిజిటల్ లిటరసీ కార్యక్రమాలకు, తెలంగాణ ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టుబడులకు సహకారం అందిస్తాం.

కెనడాలో మీకు మేమున్నాం : రంజిత్ గవల్ల, టీటా కెనడా ఇంచార్జ్

కెనడాలోని విశేష అవకాశాలను అధ్యయనం చేసి, వాటిని గ్లోబల్ టీం దృష్టికి తీసుకురాగా మేము చాప్టర్ ఏర్పాటు చేశాం. ఇక్కడికి విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేవారికి సమాచారం అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఐటీ, వ్యవసాయం, విద్య, ఇంజినీరింగ్ వంటి వాటిల్లో అవకాశాలు చాలా ఉన్నాయి.

ఫ్రెషర్స్‌కు స్వర్గధామం: రాజశేఖర్ రైడ, మెక్సికో టీటా అధ్యక్షుడు

మెక్సికో అనగానే క్రైం రేటు ఎక్కువగా ఉందనే భ్రమలు వద్దని భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న గ్వడలహరలో శాంతియుత వాతావరణం ఉంది. అవకాశాల స్వరధామంగా నిలుస్తుందన్నందున మన ఫ్రెషర్స్ మెక్సికోపై దృష్టిసారించాలి. ఫ్రెషర్స్‌కు టీటా చాప్టర్ ద్వారా సహాయ సహకారాలు అందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడి తెలుగువారు మెక్సికన్ మహిళలను వివాహం చేసుకున్నారు.

గ్రామాన్ని దత్తత తీసుకున్నా: మనోజ్ తాటికొండ, టీటా అమెరికా సెక్రటరీ

టీటా వ్యవస్థాపక అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల పర్యటనను సమన్వయం చేయడం రెండోసారి. ఈ పర్యటన సందర్భంగా కాలేజీ, యూనివర్సిటీల గురించి అనేక అంశాలను తెలుసుకునేందుకు అవకాశం దక్కింది. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఎంతో పరిజ్ఞానాన్ని అందించింది. విద్యావిధానంలో గమనించిన మార్పులను భారతదేశంలోని నా గ్రామంలో రాబోయే విద్యార్థుల కోసం అమల్లో పెడతాను.

శ్రీధర్ సూరునేని స్టేట్ బ్యూరో, నమస్తే తెలంగాణ

862
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles