భయాలు వీడి పెట్టుబడులకు రండి


Sat,September 15, 2018 01:03 AM

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న విపత్కర పరిణామాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఐరోపా యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగే (బ్రెగ్జిట్) అంశం, అమెరికా-చైనా పరస్పర సుంకాలు, చమురు ఉత్పాదక దేశాల్లో సంక్షోభం వంటివి మదుపరుల పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా వడ్డీరేట్లు పెంచినా.. చివరకు తీవ్రవాద దాడులు జరిగినా.. మార్కెట్లకు భీకర నష్టాలు తప్పట్లేదు. మార్కెట్ ట్రేడింగ్ అత్యంత సున్నితమైన అంశాలతో కూడుకున్నది కావడంతో వీటి ప్రకంపనలు చేసే నష్టం కూడా ఎక్కువగానే ఉంటున్నది.
stock-market
అయినప్పటికీ ఇదంతా తాత్కాలికమేనని గుర్తుంచుకోండి. ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు అత్యంత సహజం. వాటిని చూసి పెట్టుబడులకు వెనుకాడటం మదుపరుల లక్షణం ఎంతమాత్రం కాదు. మదుపరులు ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తేనే లాభాలు సాధ్యం. చాలామంది మదుపరులు మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న నిలకడలేమిని చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వరుసగా లాభపడటం, వరుసగా నష్టపోవడం జరుగుతుండటంతో పెట్టుబడులపై కొత్తవారికి ఆసక్తి లేకుండా పోతున్నది. కానీ నష్టపోయిన మార్కెట్లు మళ్లీ కోలుకోవడం అత్యంత సహజం. కాబట్టి పెట్టుబడులతో ముందుకెళ్లడం మంచి నిర్ణయం.

అయితే ఈక్విటీ పెట్టుబడులను పెంచుకోవడానికి ఇదే సరైన సమయమన్నది ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ల అభిప్రాయం. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులకు చక్కని అవకాశం. కాబట్టి పెట్టుబడులకు కావాల్సిన నిధులను సమకూర్చుకోండి. పోర్ట్‌ఫోలియోల్లో నిధులు అలాగే ఉండిపోతే మొత్తం ఈ పెట్టుబడుల ప్రణాళికే చెడిపోతుంది. కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులకు సంసిద్ధులు కావడం ఉత్తమం. పెట్టుబడులకు సరైన సమయం అనుకుని నిధుల లేమితో ముందుకువస్తే భంగపాటుకు గురయ్యే వీలుంటుంది. అంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పుష్కలంగా ద్రవ్యలభ్యత ఉన్నప్పుడే ఆకర్షణీయమైన లాభాల్ని అందుకోగలం.

ఇటీవలికాలంలో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున దేశీయ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడాన్ని చూస్తున్నాం. అయితే ఇదంతా వ్యూహాత్మక నిర్ణయాల్లో భాగమే. భారత్‌లో వెనుకకు తీసుకున్న పెట్టుబడులను మరోచోట ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలు మారినప్పుడు పెట్టుబడుల్లో కూడా మార్పు అనేది ఎక్కడైనా జరిగేదే. మొత్తంగా చూస్తే లక్ష్యాలను చేరుకోవాలంటే ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల్లో వృద్ధి కనిపించాలంటే ఇలాంటి ఒడిదుడుకులను ఎదురొడ్డి నిలబడాల్సిందే. అప్పుడు ఆశించిన లాభాలు చేతికొస్తాయి. కాబట్టి భయాలు వీడి పెట్టుబడులకు రండి. మీ కలలను నెరవేర్చుకోండి.

కే నరేశ్ కుమార్
సహ వ్యవస్థాపకులు, వెలాసిటీ,
వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ
knk@wealocity.com

682
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles