కమాల్ ఐకియా


Sat,August 11, 2018 01:03 AM

రెడీ టూ ఫిట్ అంటే బిగించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఫర్నీచర్ అని అర్థం. ఇదే ఫార్ములాతో స్వీడిష్ సంస్థ ఐకియా.. అంతర్జాతీయ స్థాయి ఫర్నీచర్‌ను రూపొందించి.. భారతదేశంలోనే ప్రప్రథమంగా.. హైదరాబాద్‌లో రంగప్రవేశం చేసింది. ప్రపంచ నాణ్యత గల ఫర్నీచర్‌కు లోకల్ హంగులను జోడించింది. ధరలూ అందుబాటులో ఉండటం.. ఆధునిక డిజైన్లు కావడంతో.. హైదరాబాదీల నుంచి ఐకియా స్టోర్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది.
BED
స్వీడన్‌కు చెందిన ఐకియా స్టోర్ హైటెక్ సిటీలో దాదాపు 13 ఎకరాల్లో కొలువుదీరింది. ఈ స్టోర్‌లో ఇంటికి కావాల్సిన అన్ని రకాల ఫర్నీచర్ లభిస్తున్నాయి. అకర్షణీయమైన హంగులు, నాణ్యతకు తోడు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల ప్రజలు అధిక ఆసక్తి చూపిస్తున్నారు. ఐకియా స్టోర్‌కు సంబంధించిన ఫర్నీచర్ తమ ఇంట్లో ఒక్కటైన ఉండాలని భావిస్తున్నారు. ఇంతగా ఆదరణ పెరగడానికి వస్తు నాణ్యత, ధర అందుబాటులో ఉండటమే ప్రధాన కారణం.

నగర వాసుల ఫర్నీచర్ అభిరుచిని ఇన్నాళ్లుగా స్థానిక ఫర్నీచర్ సంస్థలే తీరుస్తున్నాయి. మరికొన్ని ఫర్నీచర్ సంస్థలు ప్లాట్ లేదా విల్లాకు సంబంధించిన ఫర్నీచర్‌ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాయి. పెద్ద ఫర్నీచర్ సంస్థలు కొనుగోలుదారుల్ని స్వయంగా విదేశాలకు తీసుకువెళ్లి నచ్చిన ఫర్నీచర్‌ను ఇప్పించేందుకు తోడ్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ నాణ్యత, ఆధునిక హంగులతో ఐకియా భారతదేశంలోకి ప్రవేశించింది. అందులోనూ హైదరాబాద్‌ని ఎంచుకున్నది. ఇన్నాళ్లూ స్థానిక ఫర్నీచర్‌ను చూసినవారంతా ఐకియా బాట పడుతున్నారు.
HALL

ఐకియాలో ఏం ఉన్నాయి..

లివింగ్ రూం, డైనింగ్, వర్క్‌స్పేస్, కిచెన్, బాత్‌రూం, బెడ్ రూం, వార్డ్‌రోబ్ అండ్ స్టోరేజ్ ఇలా రకరకాలుగా ఏర్పాటు చేసిన మోడల్ డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆర్మ్‌చైర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, బేబీ కాట్స్, బేబీ టెక్స్‌టైల్స్, ఫ్యాబ్రిక్ సోఫాస్, గ్లాసెస్, హాల్ ఫర్నీచర్, హ్యాండ్ నోటెడ్ రగ్స్, బెడ్స్, జూనియర్ బెడ్స్, మ్యాట్రెస్, కాట్స్, కిచెన్ యాక్సెసరీస్, మీడియా ఫర్నీచర్, ఆఫీస్ ఫర్నీచర్ వంటివి స్వాగతం పలుకుతున్నాయి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మోడల్ డిజైన్లను 1 నుంచి 27 వరకు ఒక వరుస క్రమంలో ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చేందుకు వందల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు అడుగు దూరంలోనే అందుబాటులో ఉంటున్నారు.

బిగించుకోవడమే అసలు సమస్యా?

ఇప్పటివరకూ మనకు తెలిసిన ఫర్నీచర్.. అలా కొనగానే ఇలా వాడుకునేలా ఉంటాయి. కాని ఐకియా ఫర్నీచర్ మాత్రం ఇందుకు కాస్త భిన్నం. రెడీ టు ఫిట్ రూపంలో అందించే ఈ ఫర్నీచర్‌ను వినియోగదారులే బిగించుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇంటికి చేరిన ఫర్నీచర్ విడిభాగాల రూపంలో ఉంటుంది. బిగించుకోవడం కష్టమనిపిస్తే మళ్లీ కార్పెంటర్ల సాయం తీసుకోక తప్పదు. ఇళ్లు మారినప్పుడు లేదా ఎక్కడికైనా తరలించాలనుకున్నపుడు ఇబ్బంది పెడుతుంది. వీటిని బిగించుకునేందుకు నిర్దేశించిన పనిముట్లు ఉండాలి. ఇది మరొక సమస్య. కూకట్‌పల్లిలో నివసించే శ్రీధర్.. తొలిరోజు ఐకియా స్టోర్ వెళ్లి కాఫీ టేబుల్ కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకువచ్చి బిగించేందుకు ప్రయత్నించాడు. రెండు గంటలు ప్రయత్నించినా సఫలం కాలేదు. దీంతో దగ్గర్లోని కార్పెంటర్‌ను పిలిచాడు. అయినా లాభం లేకపోవడంతో టూల్ కిట్‌ను కొనుగోలు చేసి బిగించుకున్నట్లు నమస్తే సంపదకు చెప్పారు. కాబట్టి ఐకియాలో ఫర్నీచర్ కొనుగోలు చేసేటప్పుడు బిగించడం గురించి పూర్తిగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేస్తే ఎలాంటి సమస్యా ఉండదు.

1121
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles