మస్త్.. మిర్చీ టేస్ట్!


Thu,August 30, 2018 01:27 AM

Mirchi
సమోసాతో పాటు వేయించిన మిర్చీ ఉండాలి.. పప్పు తాలింపు వేశాక అంచులో.. ఒక మిరపకాయ ఉంటే.. ఆ టేస్టే వేరు.. కానీ అదే మిరపకాయని చీరి.. కూర వండితే.. అలా కూడా చేయొచ్చా అని నోరెళ్లబెట్టేరు.. మిర్చీతో నోరూరించే వంటలను కూడా చేయొచ్చు తెలుసా? ఇదిగో ఇన్ని రకాలుగా మిర్చీ వండి వడ్డించొచ్చు..

మిర్చీ వడ

MIRCHI-VAD

కావాల్సినవి :

బజ్జీ మిర్చీ : 10, శనగపిండి : ఒక కప్పు, కుకింగ్ సోడా : చిటికెడు, ఓమ : పావు టీస్పూన్, ఆమ్‌చూర్ పొడి : పావు టీస్పూన్, చక్కెర : అర టీస్పూన్, ధనియాల పొడి : పావు టీస్పూన్, జీలకర్ర పొడి : పావు టీస్పూన్, ఆలుగడ్డ ముక్కలు : ఒక కప్పు, గరం మసాలా : చిటికెడు, కార్న్‌ఫ్లోర్ : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, కొత్తిమీర: చిన్న కట్ట, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : మిర్చీలను మధ్యకు చీరి గింజలను తీసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో శనగపిండి, సోడా, జీలకర్ర, ఉప్పు, నీళ్లు పోసి బజ్జీ మిశ్రమంలా కలుపుకోవాలి.
స్టెప్ 2 : కడాయిలో కొద్దిగా నూనె పోసి శనగపిండి, ఆమ్‌చూర్ పొడి, చక్కెర, ఓమ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కాసేపు వేయించాలి.
స్టెప్ 3 : దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేయాలి. దీన్ని మిర్చీలో కూర్చి పక్కన పెట్టాలి.
స్టెప్ 4 : ఆలుగడ్డను ఉడికించి.. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర, గరం మసాలా, కార్న్‌ఫ్లోర్, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపాలి.
స్టెప్ 5 : స్టఫ్ చేసిన మిర్చీ పైన ఈ ఆలుగడ్డ మిశ్రమాన్ని పెట్టి ఆ తర్వాత శనగపిండి మిశ్రమంలో ముంచాలి. కడాయిలో నూనె పోసి వీటిని ఒక్కొక్కటిగా వేయించాలి. టేస్టీ మిర్చీ వడ రెడీ!

పచ్చిమిర్చి చట్నీ

GREEN-CHILLICHUTNEY

కావాల్సినవి :

పచ్చిమిర్చి : 15, నువ్వులు : ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, వెల్లుల్లి : 4, నూనె : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయి వేడి చేసి నువ్వులను దోరగా వేయించాలి. ఆ తర్వాత పొడి చేసి పక్కన పెట్టాలి.
స్టెప్ 2 : అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించాలి.
స్టెప్ 3 : దీన్ని కాస్త చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి. దీంట్లోనే ముందుగా చేసిన నువ్వుల పొడి వేసి మరొకసారి మిక్సీ పట్టి ఉప్పు వేసి కలుపాలి. ఈ చట్నీ చపాతీల్లోకి యమ టేస్టీగా ఉంటుంది.

మిర్చీ కా సాలన్

MIRCHI-KA-SALA

కావాల్సినవి :

పచ్చిమిర్చి : 100 గ్రా., పల్లీలు : ఒక టేబుల్‌స్పూన్, నువ్వులు : ఒక టేబుల్‌స్పూన్, కొబ్బరి పొడి : ఒక టేబుల్‌స్పూన్, ఆవాలు : అర టీస్పూన్, జీలకర్ర : అర టీస్పూన్, మెంతులు : పావు టీస్పూన్, ఎండుమిర్చి : 3, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, కరివేపాకు : ఒక రెమ్మ, ధనియాల పొడి : ఒక టీస్పూన్, జీలకర్ర పొడి : అర టీస్పూన్, కారం : ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిగడ్డ : 1, పసుపు : చిటికెడు, కొత్తిమీర : చిన్న కట్ట, పుదీనా : చిన్న కట్ట, చింతపండు రసం : పావు కప్పు, బెల్లం : చిన్న ముక్క, పెరుగు : 3 టేబుల్‌స్పూన్స్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో పల్లీలు, నువ్వులు, కొబ్బరి తురుము వేసి విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేయాలి.
స్టెప్ 2 : మిర్చీలో గింజలు తీసి కడాయిలో కొద్దిగా నూనె పోసి కొద్దిగా వేయించి పక్కన పెట్టాలి. అదే కడాయిలో కొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు వేసి వేయించాలి.
స్టెప్ 3 : దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపాలి.
స్టెప్ 4 : ఇందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చిమిర్చి, పల్లీ పేస్ట్ వేయాలి. కాస్త వేగిన తర్వాత నీళ్లు పోసి కలుపాలి. సన్నని మంట మీద అరగంట పాటు కలుపుతుండాలి.
స్టెప్ 5 : ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మిర్చి ముక్కలు, చింతపండు రసం, బెల్లం వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడుకనివ్వాలి.
స్టెప్ 6: వేడి వేడి మిర్చీ కూర మీ ముందుంటుంది. దీన్ని అన్నంలోకి కలుపుకొని తింటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

మిర్చీ బజ్జీ మంచురియా

MIRCHI-BAJJI-MANCHURIAN

కావాల్సినవి :

పెద్ద పచ్చిమిరపకాయలు : 5, పల్లీలు : అర కప్పు, శనగపిండి : పావు కప్పు, చింతపండు : 5 గ్రా., చక్కెర : ఒక టీస్పూన్, ఓమ : అర టీస్పూన్, శనగపిండి : ఒక కప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్, కారం : అర టీస్పూన్, బేకింగ్ సోడా : చిటికెడు, అల్లం తురుము : పావు టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు : అర టీస్పూన్, రెడ్ చిల్లీ పేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్, సోయాసాస్ : ఒక టేబుల్‌స్పూన్, పచ్చిమిరపకాయలు : 2, టేస్టింగ్ సాల్ట్ : చిటికెడు, గ్రీన్ చిల్లీ సాస్ : ఒక టీస్పూన్, వెనిగర్ : అర టీస్పూన్ ,మిరియాల పొడి : పావు టీస్పూన్
ఉల్లిపాయ ముక్కలు : అర కప్పు
నిమ్మరసం : ఒక టీస్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

స్టెప్ 1 : పల్లీలను వేయించి మిక్సీ పట్టాలి. శనగపిండిని వేయించి పక్కన పెట్టాలి. పల్లీల పొడి, శనగపిండి, చింతపండు, చక్కెర, ఓమ, నీళ్లు పోసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : పెద్ద మిరపకాయలను మధ్యలోకి చీరి అందులో పైన కలిపిన మిశ్రమాన్ని రాసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఒక గిన్నెలో శనగపిండి, ఓమ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, బేకింగ్ సోడా నీళ్లు పోసి చిక్కగా కలుపాలి. ఇందులో మిరపకాయలను ముంచాలి.
స్టెప్ 4 : కడాయిలో నూనె పోసి మిశ్రమంలో వేసిన పచ్చిమిర్చీలను దోరగా వేయించాలి.
స్టెప్ 5 : ఆ తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసి మళ్లీ వేయించి పెట్టాలి. చిన్న కడాయిలో కొద్దిగా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, సోయాసాస్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి కలుపాలి.
స్టెప్ 6 : ఇవి కాస్త వేగాక నీళ్లు పోసి టేస్టింగ్ సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 7 : దీంట్లో వేయించుకున్న బజ్జీలను వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసంతో కలిపి తింటే ఆ టేస్టే వేరు!

సంజయ్ తుమ్మ
సెలబ్రిటీ చెఫ్

1206
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles