నాన్న ఆరోగ్యం ఎలా బాగవుతుంది?


Mon,February 19, 2018 01:35 AM

మా నాన్న వయసు 56 సంవత్సరాలు. ఒక ఆటోమొబైల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజరుగా పనిచేస్తున్నారు. గడిచిన పదిహేను సంవత్సరాల నుంచి మద్యం అలవాటు ఉంది. ఆఫీసు తరపున తరచూ జరిగే మీటింగ్స్‌లో కొంచెం ఎక్కువగానే తాగుతారు. ఇతరత్రా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన విపరీతమైన దురదతో బాధపడుతున్నారు. కడుపులో కూడా వికారంగా అనిపిస్తున్నదని అంటున్నారు. మూడు వారాల క్రితం మా ఫ్యామిలీ డాక్టర్‌కు చూపిస్తే మద్యం తగ్గించండి సర్దుకుంటుందని కొన్ని మందులు ఇచ్చారు. కానీ ఫలితం కనిపించడం లేదు. మద్యం వల్ల ఈ అనారోగ్యమా? ఆయన ఆరోగ్యం బాగుపడాలంటే ఏం చెయ్యాలి? దయచేసి వివరంగా తెలియజేయగలరు.
వి. సాయి దీప్తి, సికింద్రాబాద్

Cirrhosis
మీరు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే మీ నాన్నగారికి కాలేయంలో సమస్య ఉన్నట్టు అనిపిస్తున్నది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడి ఉంటుంది. అధిక మద్యపానం రకరకాల కాలేయ సమస్యలకు దారి తీస్తుంది. ఫాటీ లివర్, హెపటైటిస్, లివర్ సిర్రోసిస్ తీవ్రమైన అనారోగ్యాలకు మద్యపానం కారణమవుతుంది. ఈ జబ్బులు ఒక్కసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాలేయ జబ్బులు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలను కనబరుచవు. వ్యాధి తీవ్రమయ్యే కొద్దీ కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్లు పచ్చగా మారడం, దురదలు రావడం, ఆకలి మందగించడం, నీరసంగా ఉండడం, ఎక్కువగా నిద్రపోతుండడం, కడుపులో వికారంగా ఉండడం, ఏకాగ్రత కుదురకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి ముఖ్యమైన లక్షణాలు.

త్వరగా గుర్తిస్తే మందులతో చికిత్స అందించవచ్చు. కానీ సమయం మించి పోతే కాలేయకణాలు క్రమంగా జీవం కోల్పోతాయి. ఫలితంగా లివర్ స్కార్ ఏర్పడుతుంది. ఈ స్కార్ క్రమంగా లివర్‌ను పూర్తిగా కప్పేస్తుంది. ఇలాంటి స్థితిలోనే లక్షణాలు పూర్తిస్థాయిలో బయటపడుతాయి. కాలేయానికి జరిగిన నష్టాన్ని బట్టి ఈ స్థాయిలను ఎ, బి, సి గా గుర్తిస్తారు. చైల్డ్ పగ్ స్థాయిలోనే చికిత్సకు రాగలితే మందులతో, జీవనశైలి మార్పులతో చికిత్స పూర్తి చేసి సాధారణ స్థితికి తీసుకురావచ్చు. చివరి రెండు స్థాయిల్లో ఉన్నవారికి వ్యాధి తీవ్రతను, తట్టుకోగల శక్తిని అంచనావేసి కాలేయ మార్పిడిని సిఫారసు చేస్తారు. మీ నాన్నగారిలో కాలేయ వ్యాధులకు సంబంధించి లక్షణాలు కనిపించడం మొదలయ్యింది. కాబట్టి వెంటనే ఆలస్యం చెయ్యకుండా కాలేయనిపుణులను సంప్రదించండి. తీవ్రమైన కాలేయ వ్యాధులను ఇప్పుడు మందులతో, అవరమనుకుంటే సర్జరీ ద్వారా తగ్గించే చికిత్సలు చాలా అందుబాటులో ఉన్నాయి.
Drbaala

647
Tags

More News

VIRAL NEWS