టెక్నో జియాన్..!


Tue,October 2, 2018 11:14 PM

రోజుకో రకంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్నది.. కొత్త కొత్త ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి.. దాంతో పాటు మనమూ పరుగులు పెడుతున్నాం.. అందులో యువత ముందు స్థానంలో ఉంది.. ప్రతీ యేటా నిట్‌లో టెక్నోజియాన్ పేరుతో సాంకేతిక పండుగ జరుగుతున్నది.. ఈ యేడు కూడా ఎన్నో ఆవిష్కరణలు.. ఎంతోమంది విద్యార్థుల చేతుల్లో మెరిసిన రోబోలు.. కొత్త కొత్త పరిజ్ఞానాలని.. ఆ పండుగ విశేషాలను తెలుసుకుందాం..
techno-jiyan
సాంకేతిక ప్రపంచానికి ఎల్లలు లేవు. ఇది ఎవ్వరూ వ్యతిరేకించని మాట. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు అన్ని విభాగాల్లోనూ ఏదో ఒక రకంగా ఏదో ఒక టెక్నాలజీనే మనల్ని ముందుకు నడిపిస్తున్నదంటే అతిశయోక్తి కాదేమో! ప్రతీ క్షణం.. ప్రపంచంలో ప్రతీమూల ఏదో ఒక ఆవిష్కరణ పురుడు పోసుకుంటూనే ఉంటుంది. భారతదేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా నిలిచిన జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్) వరంగల్‌లో కూడా సాంకేతిక ఆవిష్కరణలకు కొదువలేదు. టెక్నోజియాన్ పేరుతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సాంకేతిక పండుగ వరంగల్ నిట్‌లో ప్రతీ ఏటా జరుగుతుంది.


techno-jiyan3

ఈ యేడు..

ఈ సమయంలో వారిలోని సాంకేతిక నిపుణులు మెరుస్తుంటారు. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి, సృజనాత్మకతతో ఆవిష్కరణలు చేయడం వారిలోని ప్రత్యేకత. ఈ ఏడాది ఎన్‌కాంట్రో(పోర్చుగీసులో A Meeting in Future అని అర్థం) థీమ్‌తో సాంకేతిక ఆవిష్కరణలకు నాంది పలికారు. భవిష్యత్‌ను కళ్ళముందుంచే సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్య సంబంధ సమస్యలను అధిగమించి జీవన ప్రమాణాలను పెంచేవిధంగా పరిశోధనలు చేశారు. కృత్రిమ మేధస్సుపై నిట్ విద్యార్థులే కాదు.. దేశం నలుమూలల్లో ఉన్న విద్యార్థులూ దృష్టి సారించారు. టెక్నాలజీని ఉపయోగిస్తే గ్రామాల అభివృద్ధికి బాటలు వేయడం, సుస్థిరాభివృద్ధి సాధించేలా సాంకేతికతలో రావాల్సిన మార్పులను అధ్యయనం చేయడం, రోదసీ పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్ రంగంలో వస్తున్న మార్పులైన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై అవగాహన కల్పించడం ఈ టెక్నోజియాన్-18 సాధించిన ఘనతలుగా చెప్పుకోవచ్చు.


techno-jiyan4

వర్క్‌షాప్‌లు కూడా..

కేవలం కొత్త ఆవిష్కరణలతోనే విద్యార్థులు సరిపెట్టలేదు. వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించారు. అందులో ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ వంటి సహజవనరులను విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా వాడే సాంకేతికతను అందించడం కోసం సోలార్ అండ్ స్మార్ట్ ఎనర్జీ సిస్టంపై విలువైన వర్క్‌షాప్‌ను నిర్వహించారు. నిత్య జీవితంలో ఇనుముతో అద్భుతాలు చేయవచ్చని మెటలర్జీ అండ్ మెటీరియల్ విద్యార్థులు జపాన్‌లో నడిచే బుల్లెట్ ట్రైన్‌లో వాడే సాంకేతికతను ప్రదర్శనలో ఉంచారు. చైనాలోని రెస్టారెంట్‌లు వ్యాపార వ్యవహారాల్లో ఇప్పుడు రోబోలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అలాంటి రోబో టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి డ్యాన్సింగ్ రోబోను నిట్‌లో ప్రదర్శించారు. ఇదే విషయాన్ని టెక్నోజియాన్-18 విద్యార్థి కో-ఆర్డినేటర్ కేవీ.నరేంద్రరెడ్డి కూడా తెలిపారు. భారతదేశంలో కూడా డిజిటల్ అభివృద్ధిని ప్రోత్సహించే విధంగా జరుగుతున్న ప్రయత్నాలకు తమవంతుగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా విద్యార్థుల టెక్నోకోర్ టీమ్ తెలిపింది.


techno-jiyan5

నలభైకి పైగా ఈవెంట్‌లు..

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరిగిన టెక్నోజియాన్-18లో నలభైకి పైగా ఈవెంట్‌లతో సాంకేతిక జాతర జరిగింది. జహాజ్, ఏవియాన్, రిక్కేజ్, హోవర్ మేనియా, రోబోటిక్ చాంపియన్‌షిప్, జనరేషన్ నెక్ట్స్ రోబో, మ్యాడ్ మార్కెటింగ్, త్రీమస్కటీర్స్, టెక్‌ఫ్రెష్, టెక్‌టేప్, కోడ్‌బగ్గింగ్, బ్రిడ్జ్ ఫ్యాబ్రికో, కెమ్ ఈ కార్, జెనిసిస్, బయోప్సీ, ఎలక్ట్రోనికా, డ్రోన్‌జోన్ వంటి సాంకేతిక అంశాల్లో పోటీలు జరిగాయి.సాంకేతిక పోటీల్లో విజేతగా నిలిచిన వారికి 15లక్షల నగదు బహుమతులు కూడా అందజేశారు. సాంకేతికరంగాల్లో లబ్ధప్రతిష్టులైన రామకృష్ణ జనస్వామి, రాహుల్ కౌషిక్, కార్తీక్ విజ్ఞేశ్వర్, శ్రీచరణ్ లక్కరాజు అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు. వాళ్లు చెప్పిన విషయాలు విద్యార్థుల కెరీర్ నిర్దేశానికి చాలా ఉపయోగపడుతాయి.


టెక్నోజియాన్-18 విజయవంతానికి విద్యార్థి కోఆర్డినేటర్ కేవీ.నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలోని 36 మంది విద్యార్థుల కోర్ టీమ్ రెండునెలల పాటు కృషి చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కోయంబత్తూరు, ఆగ్రా, పాట్నా, నోయిడా, అలహాబాద్ వంటి నగరాల సాంకేతిక కళాశాలల నుంచి ఎనిమిది వేలమందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ సాంకేతిక ఉత్సవంలో పాల్గొన్నారు.


techno-jiyan2

రోబో టెక్నాలజీపై..

టెక్నోజియాన్-18లో కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్), భవిష్యత్ సాంకేతిక ఆవిష్కారాలపై అనేక పరిశోధనలు, ఎగ్జిబిట్‌లు ప్రదర్శనకు ఉంచారు. ప్రధానంగా రోబో టెక్నాలజీపై విద్యార్థులు అమితాసక్తిని కనబరిచారు. న్యూడిల్లీలోని వింగ్‌ఫో టెక్ వారు హ్యుమనాయిడ్ రోబోపై 700 మంది విద్యార్థులతో వర్క్‌షాప్‌ను నిర్వహించారు.మరోవైపు భవిష్యత్‌లో రోబో యుద్ధాల తీరును ఆవిష్కరిస్తూ నేషనల్ రోబోటిక్ వార్ పోటీలను నిర్వహించారు. సృజనాత్మకతతో రోబోను సరికొత్తగా ఆవిష్కరించడం విశేషం.జహాజ్ పేరుతో నీటిలో పరుగెత్తే రోబోలను తయారుచేశారు. నీటిలో, కొండలపై పరుగెత్తే హోవర్ క్రాఫ్ట్, నైట్రో మిథనాల్‌తో పరుగులు తీసే రిమోట్ కంట్రోల్ కారు నిట్ ఆవిష్కరణల్లో ప్రత్యేకమైనవి.
-పీఆర్ వంశీమోహన్
నిట్ క్యాంపస్-వరంగల్
గొట్టె వెంకన్న

1238
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles