ధైర్యం చెప్పే నేస్తం..


Tue,January 16, 2018 11:32 PM

చీకట్లో కూర్చొని తోడెవ్వరూ లేరని దిగులు పడే లోపే వెలుగు పలుకరించి నేనున్నా అని చెబుతుంది.. ప్రశ్న నాకెవ్వరూ లేరని బాధపడేలోపే జవాబు నేనున్నా అని బదులిస్తుంది.. ఓడిపోయానన్న ఒంటరితనంలో ఓటమి ఆగిపోయినప్పుడు గెలుపు తలుపు తట్టి ధైర్యం చెబుతుంది.. ఆ ధైర్యం చెప్పగల తోడు.. నీ బాధ నాకు చెప్పుకో అని ఇవ్వగల భరోసా మనిషిని ఆశ వైపు.. జీవితం వైపు అడుగులు వేయిస్తుంది.. అలాంటి భరోసానే ఇస్తున్నది.. రోషిణీ ఎన్జీవో. వాళ్లిచ్చే భరోసా గురించి తెలియాలంటే.. ఈ కథనం చదువండి.
roshinin-ngo

కేస్ స్టడీ... 01

సుకన్య.. (పేరు మార్చాం) డిగ్రీ చదివే రోజుల్లో ఓ అబ్బాయిని ప్రేమించింది. నాలుగేళ్లు ఒకరంటే ఒకరికి ప్రాణంగా బతికారు. ఉన్నట్టుండి సుకన్య ప్రేమించిన నరేశ్ (పేరు మార్చాం) ఫోనుకు బదులివ్వడం లేదు. కంటికి కనిపించడం లేదు. అతడి ఫ్రెండ్స్‌ని అడిగినా ఎలాంటి సమాచారం దొరుకడం లేదు. అతి కష్టం మీద నరేశ్ ఆచూకీ తెలుసుకుంది. నరేశ్‌కు పెళ్లి కుదిరిందన్న సమాచారం తెలుసుకొని అతడిని నిలదీసింది. దానికి నరేష్ చెప్పిన సమాధానం.. ఆ అమ్మాయిని చేసుకుంటే కట్నం వస్తుంది. నిన్ను చేసుకుని అంత డబ్బు వదులుకోవాలా? అని. ఆ మాటలకు సుకన్య మనసు ముక్కలైంది. గుండె పగిలేలా ఏడ్చింది. మోసపోయిన తన ముఖాన్ని తల్లిదండ్రులకు చూపించదలుచుకోలేదు. చనిపోదామనుకున్నది. చివరి క్షణంలో ఎవరో చేసిన తప్పునకు తను చనిపోయి తన కుటుంబానికి శోకం మిగుల్చడం తప్పనిపించింది. తన బాధను, సమస్యను ఎవరితోనైనా పంచుకుందామనుకుంది. గూగుల్లో వెతికితే రోషిణీ ఎన్జీవో గురించి తెలిసింది. వారి కాల్ సెంటర్‌కు చేసి వారితో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం మార్చుకుంది. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నది.
కాలచక్రం మామూలుగానే తిరుగుతుంది.. కానీ మనుషుల ఆలోచనలు, మానసిక పరిస్థితులే కాలం కంటే గిర్రున తిరుగుతూ క్షణానికో నిర్ణయం తీసుకుంటుంటాయి.. ఆ నిర్ణయాలు ఒక్కోసారి.. క్రూరత్వాన్ని తట్టి లేపితే.. మరోసారి సున్నితత్వపు అంచులు దాటి చావు వైపు అడుగులు వేయిస్తాయి. మరణం అంచులో నిలబడి కూడా కొన్నిసార్లు బతికేద్దాం అనే ఆశ పుడుతుంది చాలామందిలో.. అప్పుడు నువ్వు బతుకాలి.. నువ్వు లేకపోతే.. నిన్ను కోల్పోతే.. బాధపడేవాళ్లు చాలామంది ఉన్నారు... అని ఇలా.. ఆ క్షణంలో వారి మనసులో ఉన్న బాధ పంచుకోవడానికి.. బతుకు మీద ఆశ పుట్టించడానికి, ఓ నేస్తం కావాలి.. ఓ ధైర్యం కావాలి. ఓ భరోసా కావాలి. ఆ భరోసా ఇస్తున్నది రోషిణీ ఎన్జీవో. ఎదుటివారి బాధను తమ బాధగా, ఎవరి సమస్యకు వారే పరిష్కారం వెతుక్కునేలా చేస్తూ ఆరిపోయేందుకు సిద్ధపడుతున్న ఎన్నో దీపాలను అరచేతులు అడ్డు పెట్టి నిలుపగలిగింది. ఆ సంస్థ ప్రస్థానం.. ఇప్పుడు ప్రస్తావించుకుందాం..

కేస్ స్టడీ... 02

సుమన్.. టెన్త్ వరకు బాగానే చదివేవాడు. ఇంటర్లో చేరిన తర్వాత చదువులో వెనుకబడ్డాడు. పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి. ఇంట్లో, స్నేహితుల ముందు తలెత్తుకోలేక పోతున్నాడు. బతుకడం అనవసరం అనుకొని చనిపోదామనుకున్నాడు. ఎప్పుడో మహేశ్ అనే స్నేహితుడు చెప్పిన రోషిణీ ఎన్జీవో గురించి గుర్తొచ్చింది. మహేశ్ చెప్పినప్పుడు తన మొబైల్లో సేవ్ చేసుకున్న రోషిణీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్లో వారిచ్చిన భరోసా.. సుమన్‌కు జీవితం మీద ఆశలు మొలకెత్తేలా చేసింది. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు సుమన్ కాలేజ్ టాపర్. యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందాడు. రోషినీ ఎన్జీవో తన చేతులు అడ్డుపెట్టి ఆరిపోకుడా కాపాడింది వారిద్దరిని మాత్రమే కాదు.. ఇరవేయ్యేండ్లుగా ఎన్నో వేలమంది ఆలోచనలు మార్చింది.

ఆలోచన.. అంకురం..

1997లో పూనం, శశి, శాంతి, శ్రీకాంత్ అనే నలుగురు స్నేహితులు ప్రారంభించిన స్వచ్ఛంధ సంస్థే రోషినీ ట్రస్ట్. ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ప్రతీ రాష్ట్రంలో ఇలాంటి ఆలోచన, లక్ష్యంతో పనిచేసే సంస్థ ఉంటుంది. కానీ వేర్వేరు పేర్లతో పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న బీ ఫ్రెండర్స్ అనే కాన్సెప్ట్‌తో ఓ సంస్థకు ఇవన్నీ అనుబంధంగా పనిచేస్తుంటాయి. బాధలో ఉన్న వ్యక్తికి కావాల్సింది ఓదార్పు కాదు. కాస్త భరోసా.. ఓదార్పు కొంతకాలం ఉపశమనం ఇస్తుందేమో, భరోసా.. దీర్ఘకాలంగా ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నేను చేయలేను.. అనుకున్న పనిని నేను కచ్చితంగా చేయగలనను అనే నమ్మకాన్నీ ఇస్తుంది. ఎంత అనుబంధం ఉన్నప్పటికీ మనసులో ఉన్న బాధను కుటుంబసభ్యులతో చెప్పుకోలేం. కానీ.. ఆప్తుడు అనుకున్న స్నేహితుడికి చెప్పుకుంటాం. ఆ బాధ నుంచి విముక్తి కల్పించే స్వాంతన స్నేహితుడు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరన్న నమ్మకం. అలాంటి ఓ స్నేహ హస్తమే రోషిణీ ఎన్జీవో.

రోషిణీయే ఎందుకు?

ఎవరైతే ఒక్క స్నేహితుడినైనా సంపాదించుకోలేకపోతాడో.. వారే ఈ ప్రపంచంలో అత్యంత పేదవారు అనే నానుడి అందరికీ తెలిసిందే. అలాంటిది మనం సంపాదించుకున్న స్నేహితులను కాదని రోషిణీతో వారికి మన బాధలు పంచుకోవాల్సిన అవసరం ఏంటి? వారి స్నేహహస్తాన్నే అందుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి మా దగ్గర సమాధానం ఉందంటున్నారు రోషిణీ వలంటీర్లు. ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తి బలహీనతను అవకాశంగా తీసుకునే పరిస్థితులు పెరిగిపోయాయి. ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గిపోయింది. సామాజిక సంబంధాలన్నీ నమ్మశక్యంగా లేవు. నమ్మిన స్నేహితులే ఓ అమ్మాయిని బర్త్ డే పార్టీ అంటూ పిలిచి అత్యాచారానికి ఒడిగడుతున్నారు.

అయినవారికి చెబితే ఆ బలహీనతను అడ్డుగా పెట్టుకొని మోసం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. అందుకు ప్రత్యామ్నాయం మేము అంటున్నారు రోషిణీ సభ్యులు. బాధితుల సమస్యను తమ సమస్యగా భావించి ఎక్కడా వారి మీద సానుభూతి, జాలి లాంటివి చూపించకుండా.. బాధితుల సమస్యను వారే పరిష్కారం చేసుకునేలా చేస్తారు. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? దీనికి కారణం ఏంటి? ఫలితం ఎలా ఉంటుంది? ఇప్పుడేం చేయాలి? అనే ప్రశ్నలు బాధితుడి నుంచే రప్పించి.. సమాధానం కూడా వారే తెలుసుకునేలా చేస్తుంది రోషిణీ.

ఇంకేం చేస్తున్నారు?

ఈరోజుల్లో దాదాపుగా ఉద్యోగం చేస్తున్నవారు, విద్యార్థులు, గృహిణులు, యువత, వృద్ధులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు, వారి ఆలోచనల్లో మార్పు తెచ్చేందుకు విద్యాసంస్థలు, జైళ్లు, హాస్పిటల్స్, కార్పొరేట్ సంస్థల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. పలు రద్దీ ప్రాంతాల్లో వివిధ కళారూపాలు, పాటలు, స్కిట్లతో ఆలోచింపజేస్తున్నారు. హెల్ప్‌లైన్ నెంబర్లు: 040-6602000, 66202001.
nirmala

కాన్ఫిడెన్స్ పెరిగింది..

ఆరేళ్లుగా నేను రోషిణీ ఎన్జీవోలో వలంటీరుగా పనిచేస్తున్నా. ఎన్నో ఫోన్ కాల్స్ మాట్లాడిన. ఎంతోమందితో ముఖాముఖి చేశా. వారంతా ఏదో డిప్రెషన్లో ఉన్నవారే. చాలా చిన్న సమస్యను పెద్దగా ఆలోచిస్తూ అందులోంచి బయటపడడం కష్టంగా భావిస్తున్నారు. రోషిణీ సెంటర్‌కు వచ్చిన తర్వాత వారిలో మార్పు మొదలైంది. కాన్ఫిడెన్స్ పెరిగింది. వారిని చూస్తుంటే మాలో కూడా ఏదో శక్తి పెరిగినట్టు అనిపిస్తుంది.
నిర్మల, వలంటీర్, ఆన్‌లైన్ ట్యూటర్
swarna

తెలియని సంతృప్తి..

ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ జీవి, ప్రతీ కణం తమకోసమే కాక.. ఎదుటివారికీ ఎంతోకొంత ఉపయోగపడుతుంది. కానీ మనిషి మాత్రం కేవలం తన కోసం మాత్రమే బతుకుతాడు. తన స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తాడు. అందుకే.. ఏ జీవికీ రాని ఆత్మహత్య ఆలోచన కేవలం మనిషికి మాత్రమే వస్తుంది. ఆ ఆలోచనా విధానాన్ని మార్చడమే రోషిణీ ఎన్జీవో లక్ష్యం. ఆరేళ్లుగా ఇందులో పనిచేస్తున్నా. నేను చేస్తున్న పని, నాకేకాక మరొకరికీ ఉపయోగపడుతున్నందుకు సంతృప్తిగా ఉంది.
స్వర్ణ, వలంటీర్
malathi

అందరికీ మా సేవ..

మాకు ఎవరు కాల్ చేస్తున్నారనే విషయం మా దగ్గర డిస్‌ప్లే బాధితుడి బాధను మాత్రమే పంచుకుంటాం. వారికి సంబంధించిన ఎలాంటి సమాచారం మేం అడుగాం. కనీసం పేరు కూడా అడుగం. వాళ్లు కాల్ చేసి బాధ చెప్పుకుంటారు. మనసులో ఉన్న బాధ చెబితే పోతుందంటారు కదా! అలా వారి బాధను ముందు చెప్పనిస్తాం.. తర్వాత వారి సమస్యకు వారే పరిష్కారం తెలుసుకునేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు చాలామంది ఉన్నారు. వారికి కూడా మా సేవలు చేరాలనుకుంటున్నాం.
- మాలతి, రోషిణీ హెల్ప్‌లైన్ డైరెక్టర్

761
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles