డేంజర్ డెంగ్యూ!


Tue,September 4, 2018 12:10 AM

-వానలకు నీళ్లొచ్చి నిలుస్తాయి.
-నిల్వనీరు దోమలను తెస్తుంది.
-దోమల్లో కొన్ని దోమలు డెంగ్యూను మోసుకొస్తాయి!
-ఆ దోమ కుడితే.. ప్లేట్‌లెట్‌లు తగ్గిపోతాయి.
-ప్లాస్మా శాతం పడిపోయి డెంగ్యూ డేంజర్‌గా మారిపోతుంది! అందువల్ల బీ అలెర్ట్. బివేర్ ఆఫ్ డెంగ్యూ సీజన్!!

dengue
డెంగ్యూ విజృంభిస్తున్నది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నది. దేశమంతటా డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. డెంగ్యూ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ కణాలు తగ్గిపోతాయి. బయటి నుంచి రక్తం, ప్లేట్‌లెట్స్ ఎక్కిస్తూ వాటిని భర్తీ చేసే ప్రయత్నం
చేస్తుంటారు డాక్టర్లు. ఐతే ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాల ప్రకారం డెంగ్యూ బాధితులకు ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం అరుదుగానే ఉంటుంది. ప్లేట్‌లెట్ల కంటే రక్తంలో ప్లాస్మా తగ్గుతుందేమో చూడాల్సిన అవసరం ఉంది.


రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు ఉంటాయి. వాటితో పాటు ప్లేట్‌లెట్లూ ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. వీటి పరిమాణం సుమారు 4 మైక్రాన్లు. ఆరోగ్యవంతుల్లో ఒక క్యూబిక్ మిల్లీ మీటరుకు 1.5-4 లక్షల ప్లేట్‌లెట్ కణాలు ఉంటాయి. వీటి సంఖ్య ఒక లక్ష కన్నా తగ్గితే ఏదో సమస్య దరిచేరిందని భావించాలి.

ప్లేట్‌లెట్లు తగ్గితే?

ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు పడిపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. 10వేల కన్నా తగ్గితేనే రక్తస్రావం జరుగుతుంది. ఇంకా తగ్గితే శరీరం మీద ఎలాంటి గాటు, గాయం లేకపోయినా పళ్ల చిగుళ్ల నుంచి, ముక్కు నుంచి, మలమూత్రాల నుంచి, వాంతిలో రక్తం వస్తుంది. డెంగ్యూ వైరస్ రక్తంలోని ప్లేట్‌లెట్ కణాలను దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఈ వైరస్ వల్ల ఎముక మజ్జ పనిచేయదు. దీనివల్ల ప్లేట్‌లెట్ కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

dengue1

మరోసారి వస్తే?

డెంగ్యూ వైరస్‌లో నాలుగు రకాల ఉపజాతులు ఉన్నాయి. ఒక జాతితో జ్వరం వస్తే ఆ రకంతో తిరిగి ఇంకెప్పుడూ రాదన్నమాట. ఎందుకంటే శరీరం దాన్ని తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటుంది. ఇక వేరే రకాలతో రెండుమూడు సార్లు జ్వరం వస్తే మాత్రం ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉండి.. శరీరంలో రక్తస్రావం జరుగుతుంటే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. ఒకవేళ రక్తస్రావం లేకున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య 10వేల కంటే తక్కువకు పడిపోతే ఎక్కించాల్సిన అవసరం ఉంది.


డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటే?

డెంగ్యూ అంటే ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడమే కాదు.. రక్త నాళాల్లోంచి ప్లాస్మా బయటకు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు కలిసి 45% ఉంటాయి. మిగిలిన 55% ద్రవ పదార్థం ప్లాస్మానే. డెంగ్యూ వస్తే రక్త నాళాల్లోంచి ప్లాస్మా బయటకు లీక్ అవుతుంది. చాలా ఎక్కువ స్థాయిలో లీక్ అయితే ఇది కడుపు, ఊపిరితిత్తులు, కణజాలాల్లో చేరిపోయే ప్రమాదం ఉంది. ఇలా రక్తం నుంచి ప్లాస్మా ద్రవం బయటకు లీక్ అయితే రక్తం చిక్కగా మారి హిమోగ్లోబిన్ శాతం పెరిగిపోతుంది. ద్రవ పదార్థం తగ్గిపోవడం వల్ల రక్తం పరిమాణం కూడా తగ్గి రక్తపోటు పడిపోతుంది. శరీర భాగాలకు తగినంత రక్తం, ఆక్సీజన్ అందవు. అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీనినే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ లేదా డెంగ్యూ హెమరేజ్ ఫీవర్ అంటారు. ఈ స్థితిలోనే డెంగ్యూ వల్ల రోగులు ఎక్కువగా చనిపోతుంటారు. కొంతమందిలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ చెడిపోతుంది. దీనినే డీఐసీ అంటారు. ఇది కూడా ప్రమాదకరమైందే. దీనికి ప్రత్యేకమైన చికిత్స అవసరం.

ఎలా గుర్తించాలి?

డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌లోకి వెళుతున్నట్లు గుర్తిస్తే త్వరగా బయటపడొచ్చు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించాలి. ప్లేట్‌లెట్ కణాలు లక్ష కన్నా తగ్గిపోయి ప్యాక్‌డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ) 20% పెరిగినప్పుడు దీన్ని డెంగ్యూ హెమరేజ్ ఫీవర్‌గా గుర్తించాలి. బీపీ కూడా పడిపోతుంటే దాన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌గా భావించాలి. సిస్టాలిక్, డయాస్టాలిక్ అంకెల మధ్య వ్యత్యాసం బాగా తగ్గిపోవడం (పల్స్ ప్రెజర్) దీని ప్రధాన లక్షణం. డెంగ్యూలో ఇదే తీవ్రమైన స్థితి. జ్వరం వచ్చిన 3-4 రోజులకు ఈ స్థితి తలెత్తే ప్రమాదం ఉంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం అసాధారణంగా పెరిగితే దీన్ని అనుమానించాలి. వేగంగా స్లైన్ ఎక్కించాలి. ప్లేట్‌లెట్ల సంఖ్య కంటే హెమటోక్రిట్ లేదా ప్యాక్‌డ్ సెల్ వాల్యూమ్ పరీక్ష ముఖ్యమని గుర్తించాలి.

ప్లాస్మా ఎప్పుడు ఎక్కించాలి?

రక్త నాళాల నుంచి ప్లాస్మా లీక్ అవుతూ రక్తం చిక్కబడి హిమోగ్లోబిన్ శాతం పెరిగిపోతుంటే ప్లాస్మా ఎక్కించడం గురించి ఆలోచించాలి. ముందు హెమటోక్రిట్‌ని సాధారణ స్థాయికి తెచ్చేందుకు స్లైన్ ఎక్కిస్తుంటారు. రోగి శరీర బరువు కొలోకి 20 ఎంఎల్ (ఒక గంటకు) చొప్పున ఇస్తుంటారు. దీంతో హెమటోక్రిట్, బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటే శరీర బరువులో కిలోకి 3 ఎంఎల్ స్లైన్ ఎక్కించాలి. ఇలా రెండు రోజులు స్లైన్ ఎక్కిస్తే సరిపోతుంది. కొందరికి స్లైన్ ఎక్కించినా బీపీ సాధారణ స్థాయికి పెరగదు. అప్పుడు ప్లాస్మా ఇవ్వాలి. 6 గంటల్లో బీపీ పెరగకపోతే మరో మోతాదు ప్లాస్మా ఎక్కించాలి. దీనివల్ల రక్తం పరిమాణం పెరిగి బీపీ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. కాబట్టి ముందు స్లైన్ ఇవ్వాలి. అయినా ఎలాంటి ఫలితం లేకపోతే ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ప్లేట్‌లెట్లు 10వేల కంటే ఎక్కువున్నా రక్తస్రావం జరుగుతుంది. దీనికి ప్లేట్‌లెట్లతో సంబంధం లేకుండా రక్తం గడ్డకట్టే ప్రక్రియలోనే తేడారావడం ముఖ్య కారణం. పీటీ, ఏపీటీటీఅనే పరీక్షలు చేస్తే రక్టం గడ్టకట్టడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత రక్తస్రావం జరుగుతుందో తెలుస్తుంది. దాన్నిబట్టి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.


ఎలాంటి పరీక్షలు?

తరుచుగా సీబీపీ (హెమటోక్రిట్‌తో సహా) పీటీ, ఏపీటీటీ పరీక్షలు చేయించాలి. ఒకవేళ షాక్‌గా అనుమానిస్తే మాత్రం ఛాతి ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్‌స్కాన్ పరీక్షలు చేయించాలి. ఇది లోపల నీరు చేరిందో లేదో తెలుసుకోవడానికి.

ఏం చేయొద్దు?

- జ్వరం బాగా ఉన్నప్పుడు ఆస్పిరిన్, ఐబూప్రొఫెన్, నిముసులైడ్, డైక్లోఫెనాక్ వంటి మందులు తీసుకోవద్దు. ఇవి రక్త స్రావాన్ని పెంచుతాయి. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులున్నా కూడా వీటికి దూరంగా ఉండాలి.
- డెంగ్యూ వచ్చిన వారికి స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు. ఇస్తే రక్తస్రావం మరింత పెరుగుతుంది.
- తెల్ల రక్తకణాల సంఖ్య పెంచేందుకు కొన్ని రకాల క్యాన్సర్లలో ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఇవ్వొద్దు. రక్తం ఎక్కించొద్దు. రక్తం ఎక్కిస్తే హిమోగ్లోబిన్ మరింత పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.
- యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
- డిసిమినేటెడ్ ఇంట్రావాస్కులార్ కొయగ్యులేషన్ (డీఐసీ) స్థితిలోకి వెళ్లిపోతే సీరమ్ ఫిబ్రినోజెన్ పరీక్ష చేసి క్రయో ప్రెసిపిటేట్ (సీపీ) ఇవ్వాల్సి ఉంటుంది.
మన దేశంలో కొంతమందిలో అరుదుగా డెంగ్యూ, మెదడువాపు, గుండె దెబ్బతినడం, లంగ్స్‌కు నిమోనియా రావడం, లివర్ దెబ్బతినడం జరుగుతుంది. దీనినే ఎక్స్‌పాండెడ్ డెంగ్యూ సిండ్రోమ్ అంటారు. ఇలా వచ్చినపుడు ప్రత్యేక చికిత్స అవసరం. ప్రాణాపాయమూ కొంచెం ఎక్కువే.


లక్షణాలు

-ఉన్నట్టుండి 103-105 డిగ్రీల తీవ్రమైన జ్వరం.
-పగిలిపోతున్నంతటి తీవ్రమైన తలనొప్పి.
క-ళ్ల వెనుక తీవ్రమైన నొప్పి, కీళ్ల నొప్పులు.
-ఒళ్లంతా నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు.
-వాంతి, వికారం.
-జ్వరం 5-7 రోజుల్లో తగ్గుతుంది.
-అప్పుడు మరింత జాగ్రత్త
-అవసరం.


ఏది ఎప్పుడు?

ప్లేట్‌లెట్లు: రక్తస్రావం అవుతూ ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కంటే తక్కువున్నా, రక్తస్రావం లేకున్నా ప్లేట్‌లెట్ల సంఖ్య 10వేలకు పడిపోయినా ప్టేట్‌లెట్లు ఎక్కిస్తారు. ఒకే దాత నుంచి రక్తం సేకరించి మెషీన్ ద్వారా ప్లేట్‌లెట్లను వేరుచేసి వాటిని అప్పటికప్పుడు ఎక్కిస్తారు. ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా: స్లైన్ ఎక్కించినా బీపీ సాధారణ స్థాయికి పెరగకున్నా, రక్తం గడ్డ కట్టడంలో సమస్య ఉన్నా ఇది ఎక్కిస్తారు. ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా: ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గిపోయి, రక్తస్రావం జరుగుతుంటే ఇస్తారు. రక్తం: ఆగకుండా రక్తస్రావం జరుగుతూ బీపీ, హిమోగ్లోబిన్ తగ్గుతున్నట్లయితే రక్తం ఎక్కిస్తారు.


ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

- డెంగ్యూ జ్వరాలకు ఏడిస్ ఈజిైప్టె దోమ కారణం. ఈ దోమ డెంగ్యూ సోకినవారిని కుట్టి మరొకరిని కుట్టినప్పుడు వైరస్ వ్యాపిస్తుంది. తెల్లటి మచ్చలతో పెద్దగా ఉండే ఈ దోమలను గుర్తించడం తేలిక. ఇవి స్వచ్ఛమైన నీటి మడుగులో పెరుగుతాయి.. పగటిపూట కుడుతాయి. అందుకే ఇళ్లు, స్కూళ్లు, కార్యాలయాలు, దుకాణాల్లో పరిశుభ్రత పాటించాలి.
- డెంగ్యూ జ్వరంలో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. ఈ స్థితిలో డెంగ్యూ అతి ప్రమాదకారి కాదు. కానీ జ్వరం తగ్గడం మొదలుకాగానే సమస్యలు మొదలవుతాయి.
- ప్లేట్‌లెట్లు, బీపీ తగ్గడం ప్రారంభమయ్యేది ఈ దశలోనే. రక్తంలో హెమటోక్రిట్ సాధారణ స్థాయికి చేరుకొని కనీసం ఒకట్రెండు రోజులు నిలకడగా ఉంటూ ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావాలి.
- పారాసెటమాల్ వేసుకుంటూ సమతులాహారం తీసుకోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తాగాలి. పూర్తి విశ్రాంతి అవసరం.
- జ్వరం తగ్గిన తర్వాత కూడా సీబీపీ పరీక్ష చేయించుకోవాలి. దీనిలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గితే మాత్రం జాగ్రత్త పడాలి. నిస్సత్తువగా ఉన్నా.. కాళ్లూ చేతులు చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువవుతున్నా, శరీరంపై మచ్చలు వస్తున్నా, చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా, పడుకొని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి.


ఏం జరుగుతుంది?

- డెంగ్యూ జ్వరం వల్ల మెదడు ప్రభావితమైతే ఫిట్స్ వస్తాయి. గుండె ప్రభావితమైతే గుండె కొట్టుకోవడంలో వేగం తగ్గుతుంది. కొందరికి గుండె వేగం పెరగొచ్చు. కొందరిలో క్లోమం, మూత్ర పిండాల పనితీరు దెబ్బతినొచ్చు. మరికొందరిలో తీవ్రమైన కామెర్లూ రావచ్చు.
- ప్లేట్‌లెట్లు 40వేల కన్నా తగ్గినప్పుడు కాళ్లూ చేతుల మీద చిన్నచిన్న ఎర్రటి మచ్చలు వస్తాయి. 20 వేలకు తగ్గినప్పుడు చిన్న దెబ్బ తగిలినా చర్మం కమలిపోయినట్లు అవుతుంది. ప్లేట్‌లెట్లు 10వేల కన్నా తగ్గినప్పుడు పళ్ల చిగుళ్లు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. దగ్గినప్పుడు, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనపడొచ్చు.
MVRAO

220
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles