దంపతుల సేవాజ్యోతి!


Fri,August 17, 2018 11:50 PM

ఆస్తులున్నవారు కాదు.. అంతస్తులున్నవారు కాదు.! అతడు.. భవన నిర్మాణ పనిలో ఇటుకలెత్తి.. సిమెంటు తట్టలెత్తి ఇల్లు కట్టే సాధారణ మేస్త్రీ! ఆమె.. వారానికో.. నెలరోజులకో ఒక డ్రెస్సు కుట్టి నాలుగు పైసలు కూడబెట్టుకునే సాధారణ గృహిణి! తమకే దిక్కు లేదు.. ఇక వేరేవాళ్లకు ఏం చేస్తాం? అనుకోలేదు ఆ దంపతులు! అన్నార్థులను, అనాథలను, అభాగ్యులను.. వికలాంగులను చేరదీసి కడుపునిండా తిండి పెడుతున్నారు! వారిని అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు..
ఆ సేవా దంపతుల పరిచయం మీ కోసం.!

Senajothi
మల్లేశం మేస్త్రీ పనికి వెళతాడు. శ్రీదేవి కుట్టు మిషన్ పనిచేస్తుంది. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వీరికి ఒక ఆలోచన వచ్చింది. మతిస్థిమితం లేనిమానసిక రోగులు నిత్యం ఎంతోమంది కనిపిస్తుంటారు వీళ్లకు. వాళ్లను చూసినప్పుడల్లా బాధగా ఉండేదట. అన్నీ సక్రమంగా ఉన్న మనమే ఇన్ని అవస్థలు పడుతున్నాం. మతిస్థిమితం లేనివాళ్ల పరిస్థితి ఏంటి? ఎండొచ్చినా.. వానొచ్చినా.. చలిపెట్టినా వాటి నుంచి తప్పించుకోవాలనే స్పృహయినా వాళ్లకు ఉండదు కదా? మరి వారి గురించి ఎవరు ఆలోచిస్తారు? అనుకున్నారు. పైగా పిచ్చోళ్లు.. పిచ్చోళ్లు అంటూ వెంటపడి దాడి చేయడం.. అంటరాని వారిగా ట్రీట్ చేయడం వారిని కలిచి వేసింది. ఈ స్థితి నుంచి వారిని బయటపడేయాలనుకొని అక్కున చేర్చుకొని ఆదరిస్తూ అమ్మానాన్నల ప్రేమను పంచుతున్నారు.

సేవాజ్యోతి!

వీళ్లకే లేదు.. ఇంకా వేరేవాళ్లకు సేవ చేస్తున్నారా? అనే చీదరింపులు.. విమర్శలు కూడా ఎదురయ్యాయి. ఎవరేమనుకున్నా సరే తాము అనుకున్న సేవా మార్గంలో నడుస్తూ వస్తున్నారు. పాఠశాలలో చదివేవారి గురించి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వారికి సొంత అమ్మలా స్నానం చేయిస్తూ.. తయారు చేస్తూ.. భోజనం తినిపిస్తూ అమ్మతనానికి అర్థం చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ముద్దు మురిపాలతో వాళ్ల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. పాఠశాలకు పంపిస్తూ అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. ఇవన్నీ చేయడానికి తమకంటూ ఓ కేంద్రం ఉండాలని భావించి సేవాజ్యోతి సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సేవాజ్యోతిలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు మతిస్థిమితం లేని వారు ఆశ్రయం పొందుతున్నారు.

వికాస సాధకుడు!

మల్లేశం చిన్నప్పట్నుంచే సేవాభావం కలిగి ఉండేవాడు. 1989లో మొదటగా గ్రామాల వికాసం కోసం అవగాహనన కార్యక్రమాలు చేపట్టాడు. పల్లెల్లో గ్రామజ్యోతి వెలిగించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించాడు. తర్వాత ఆ కార్యక్రమంలో తన భార్యను భాగస్వామిని చేసి ఒకవైపు గ్రామజ్యోతి.. మరోవైపు సేవాజ్యోతితో అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు. ఇవి చేస్తూనే శ్రీదేవి స్వశక్తి భారతి భగీరథ శరణాలయం పేరుతో నిత్యం సేవలందిస్తున్నారు. బాలలహక్కుల కోసం బాలజ్యోతి.. యువకుల కోసం యువజ్యోతి.. మహిళా వికాసం కోసంమహిళాజ్యోతి.. మాతృజ్యోతి.. జన విజ్ఞానం కోసం జనజ్యోతి.. గ్రంథాలయాలు, పారిశుద్ధ్యం కోసంశ్రమజ్యోతి.. మొక్కల పెంపకం కోసం వృక్షజ్యోతి.. విద్యా వికాసం కోసం విద్యాజ్యోతి.. దీనుల కోసం దివ్యజ్యోతి.. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసేందుకు ప్రజాజ్యోతి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నారు.
Senajothi1
మంచిర్యాల జిల్లా తాండూరుకు చెందిన గజ్జెల్లి మల్లేశం.. శ్రీదేవి. వారిది నిరుపేద కుటుంబం. పూట గడవాలంటే రోజూ కూలీకి వెళ్లాల్సిందే. కానీ వాళ్ల మనసంతా మానవత్వం వైపు ఆలోచిస్తుంది. వారి గుండె నిండా ప్రేమ.. అప్యాయత.. అనురాగాలే నిండి ఉంటాయి. అభాగ్యులు.. అనాథలు.. నిరాశ్రయులు.. మతిస్థిమితం లేనివాళ్లను చేరదీసి వారి యోగక్షేమాలు చూసుకోవాలనేదే వారి తపన.

సమాజమే దేవాలయం!

గత 25 సంవత్సరాలుగా సేవకే అంకితమయ్యారు ఈ దంపతులు. సేవాభారతి ద్వారా మంచిర్యాలలో ఏకలవ్య ఆశ్రమం.. ఆదివాసీ వనవాసీ కళ్యాణాశ్రమం ద్వారా బెల్లంపల్లి రాంజీగోండు విద్యార్థి నిలయం.. ఖమ్మంజిల్లా కొత్తగూడెం సేవాలాల్ విద్యార్థి నిలయం.. చర్ల కొమురం భీం విద్యార్థి నిలయం.. వరంగల్ జిల్లా తాడ్వాయి సమ్మక్క బాలుర విద్యార్థి నిలయం.. అచ్చంపేట పాలమూర్ జిల్లా శ్రీ మల్లిఖార్జున విద్యార్థి నిలయం.. ఇలా చాలా జిల్లాల్లో గిరిజన వికాసం కోసం సేవలందిస్తున్నారు. వీరికి సత్యకేశవ్‌జిత్.. సర్వమాధవ్‌జిత్ ఇద్దరు అబ్బాయిలు. తాము సేవ అందిస్తున్న వారిని ఎలాగైతే చూస్తున్నారో.. సొంత పిల్లల్నీ అదే రకంగా చూస్తున్నారు. సమాజమే దేవాలయం అనేది వారి ఉద్దేశం. ప్రశంసలు.. పురస్కారాలు ఎన్ని ఉన్నా వాటికేమాత్రం పొంగిపోకుండా సేవ కోసమే తపిస్తున్నారు.

గుర్తింపు.. గౌరవం!

వీరు చేస్తున్న సేవలను మండల స్థాయి అధికారులు, నాయకులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా గుర్తించి అధికారులు ప్రశంసా పత్రంతో పాటు బహుమతిగా రూ.10,116 అందజేశారు. తాము డబ్బుల కోసం పనిచేయడం లేదు.. ఈ నగదు వద్దు అని తిరస్కరించగా.. ఇది తెలంగాణ ఏర్పాటైన సందర్భంగా గౌరవంతో ఇస్తున్నారని చెప్పడంతో నగదును స్వీకరించి సేవా కార్యక్రమాలకు వినియోగించారు. తాండూర్ ఎంపీపీ మాసాడి శ్రీదేవి, తహశీల్దార్, ఎంపీడీవోలు శ్రీదేవి వీరి సేవలను పలుమార్లు గుర్తించారు. అభాగ్యులకు అండగా నిలుస్తున్న తమతో చేయి కలిపి ఈ సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలనుకున్నవారు తమల్ని సంప్రదించి సంస్థకు ఆర్థిక సాయం చేయొచ్చని కోరారు.

భర్త ప్రోత్సాహంతోనే!

Senajothi2
నా భర్త మల్లేశం ప్రోత్సాహం.. ఆయనకున్న సామాజిక సేవా దృక్పథం నన్ను ప్రేరేపించాయి. దీనులకు సేవచేసే భాగ్యం కలిగింది. సేవాజ్యోతిలో ఆశ్రయం పొందుతున్న వారంతా నా పిల్లలుగానే భావిస్తాను. ఎవరికోసమో చేయి చాచకుండా కుట్టుమిషన్ ద్వారా వచ్చిన ఆదాయం,.. నా భర్త సహకారంతో అన్ని కార్యక్రమాలూ విజయవంతంగా చేస్తున్నా. ఆశ్రమాన్ని విస్తరింపజేసి సౌకర్యవంతమైన కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
గజెల్లి శ్రీదేవి, సేవాజ్యోతి నిర్వాహకురాలు

కస్తూరి శ్రీహరి,
తాండూర్ ఐబీ, మంచిర్యాల జిల్లా

768
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles