చీకటితో వెలుగే చెప్పెను..


Sat,November 3, 2018 01:13 AM

యూసఫ్‌ది నిరుపేద కుటుంబం. బాల్యం, చదువు సంతోషంగా గడిచింది. యుక్త వయసులో ఊహించని రోడ్డు ప్రమాదం. తండ్రి స్పాడ్ డెడ్. యూసఫ్ తలకు బలమైన గాయాలై చూపు పోయింది. అప్పటి వరకూ కనిపించిన రంగుల ప్రపంచం మసకబారింది. చీకటైంది. జీవితం శూన్యమైంది. చావొక్కటే మార్గమనుకొని ఆత్మహత్యాయత్నమూ చేశాడు. తల్లిదండ్రుల మీద ప్రేమతో భవిష్యత్‌పై ఆశ పెంచుకున్నాడు. అప్పుడే సాయి నేత్ర ఫౌండేషన్ గురించి తెలిసింది. తనలాంటి వారి స్నేహంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. తనకు అందుబాటులో ఉన్న పరికరాలతో కష్టపడి చదివాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి.. తల్లి, తమ్ముడితో హాయిగా బతుకుతున్నాడు. ఇది ఒక్క యూసఫ్ జీవితమే కాదు. సాయినేత్ర ఫౌండేషన్‌కు వెళ్తే.. చీకటితో వెలుగు చెప్పిన స్ఫూర్తిదాయకమైన గాథలెన్నో కనిపిస్తాయి. వినిపిస్తాయి.

దేవుడికి నిత్యం పూజలు చేసి, నైవేద్యాలు పెట్టేకంటే.. కళ్లముందు కనిపించే అన్నార్థులకు సహాయం చెయ్యడమే నిజమైన దైవభక్తి ఈ మాటలే అనితకు స్ఫూర్తి. అందుకే మన మధ్యన ఉండే అన్నార్థుల కోసం సాయినేత్ర పేరుతో ఓ ఫౌండేషన్‌ను స్థాపించి, దాని ద్వారా ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా 2011 నుంచి ఇబ్బటి వరకు దాదాపు 200 మందికిపైగా ఆశ్రయం పొందారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు పొందినవారు దాదాపు 160 మందికిపైనే ఉన్నారు.

Youssef
రోడ్డు ప్రమాదాలు, ఇతర ప్రమాదాల్లో చూపు కోల్పోయినవారు, మధ్యలో అంధత్వం వచ్చినవారు, 20 శాతం మాత్రమే చూపు ఉన్నవారు సాయినేత్ర ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. సమాజ సేవ చెయ్యాలని చిన్నప్పటి నుంచే అనితకు కోరిక. పుట్టి పెరిగింది, చదువుకున్నది హన్మకొండలోనే. ఎంఏ సోషియాలజీ, సైకాలజీ, ఫార్మసీలో డిప్లొమా చేశారు అనిత. భర్త రఘునందన్‌రెడ్డి, హాకీ క్రీడాకారుడు. స్టేట్ హాకీ సెలెక్షన్ కమిటీలో మెంబర్. పైండ్లెన తర్వాత మధ్యలో చూపు కోల్పోయిన వారికి సహాయం చెయ్యాలనే ఉద్దేశంతో 2011లో సాయినేత్ర పేరుతో ఫౌండేషన్‌ను స్థాపించారు.

హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వారితో మాట్లాడి.. మధ్యలో చూపు కోల్పోయిన వారిని తమ ఫౌండేషన్‌లో ఆశ్రయిమిస్తామని, పేదవారిని, ఆర్థికంగా ఇబ్బందిపడేవారి వివరాలు తీసుకొని వారికి ఈ విధంగా సహాయం చేస్తున్నారు. ఈ ఫౌండేషన్‌కు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనిత. మొదట్లో దీనిని బంజారాహిల్స్‌లో అద్దె భవనాల్లో కొనసాగిస్తుండడంతో.. చుట్టుపక్కలవారితో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో బంజారాహిల్స్‌లోనే నాలుగైదు చోట్లకు మారాల్సి వచ్చింది. ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకొనే విద్యార్థులు చుట్టుపక్కల వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకపోయినా.. వారు నిత్యం ఫిర్యాదులు చేస్తుండడంతో.. ప్రస్తుతం చందానగర్‌లో ఈ ఫౌండేషన్‌ను కొనసాగిస్తున్నారు.

ఒక్కపూట తిండి కోసం తిప్పలు..

సాయినేత్ర ఫౌండేషన్‌ను అనిత మంచి ఉద్దేశంతో ప్రారంభించినా, సాయం చెయ్యమని ఎవ్వరినీ చేయిచాచి అడుగలేదు. తెలిసినవాళ్లు, కుటుంబసభ్యులు, స్నేహితుల సహకారంతోనే దీనిని నడుపుతూ వచ్చారు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. కొద్దిరోజులకు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు ఒక్కపూట భోజనం పెట్టడం ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె సన్నిహితులు, కొందరు కుటుంబసభ్యులు వారి వేతనాల్లోంచి కొంత డబ్బులు ఈ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వడం మొదలు పెట్టారు. అనిత చేస్తున్న సేవ గురించి తెలుసుకున్న కొందరు దాతలు ఆర్థికంగా అండగా నిలువడంతో.. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నది. దాతలుగా విరాళాలు ఇచ్చినవారే.. ఈ ఫౌండేషన్ నిర్వాహకులుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారి ఆర్థిక సహకారం, సలహాలు, సూచనలతో ఫౌండేషన్‌ను నడుపుతున్నారు.

నిత్యం 20మందికి ఆశ్రయం

సాయినేత్ర ఫౌండేషన్‌లో ఎప్పుడూ 20 మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. తమ ఆర్థిక వనరులు, పరిమితులకు తగ్గట్లుగా 20 మంది వరకే ఆశ్రయం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వారిలో ఎవరికైనా ఉద్యోగం వచ్చి వెళితే.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారు. ఇలా దశలవారీగా ఎంతోమంది ఈ ఫౌండేషన్ ద్వారా ఆశ్రయం పొందారు. కుటుంబ పరిస్థితి బాగాలేక, చూపు సరిగా లేక, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుర్కొంటున్నవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తప్పని పరిస్థితుల్లో 20 మందికి మించి, మరో ముగ్గురి వరకూ ఆశ్రయం కల్పిస్తామని అంటున్నారు అనిత. దీని నిర్వాహకులు వివిధ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారే. వారి తీరిక సమయాల్లో ఫౌండేషన్‌కు వచ్చి.. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు. నిరాశతో ఉన్నవారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో ధైర్యం నింపుతారు.

ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యం

సాయినేత్ర ఫౌండేషన్ ద్వారా ఆశ్రయం పొంది.. ఇక్కడే కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడినవారు చాలామందే ఉన్నారు. వీరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించనవారు దాదాపు 160 మంది వరకూ ఉంటారు. ఈ ఫౌండేషన్‌లో ఉద్యోగాల కోసం సిద్ధపడుతున్న అంధ విద్యార్థులకు ఆడియో ఫైల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. పోటీ పరీక్షలకు ఆడియో తయారు చేసే సంస్థలతో మాట్లాడి వారికి అవసరమైన ఆడియో మెటీరియల్ అందుబాటులో ఉంచుతారు. అక్కడ ఆశ్రయం పొంది, ఉద్యోగాలు సంపాదించి సంతోషంగా కుటుంబాలను పోషించుకుంటున్నవారు చాలామంది ఉన్నారు. వీరంతా ప్రతి ఏటా రెండుసార్లు కలుసుకుంటారు. ఉద్యోగాలు పొందిన వారు.. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి వారి అనుభవాలు, సలహాలు చెప్పి, సంసిద్ధులను చేస్తారు. ఈ ఫౌండేషన్‌లో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకూ ప్రాధాన్యం ఇస్తారు. ఇద్దరు విద్యార్థులు సౌత్‌జోన్ అంధుల క్రికెట్ టోర్నీలో ఆడారు.


దీపావళి ప్రమిదలకు పెయింటిగ్స్


saio
సాయినేత్ర ఫౌండేషన్‌లో ఆశ్రయం పొందుతున్న అంధ విద్యార్థులు గత మూడేండ్లుగా దీపావళి ప్రమిదలకు పెయింటింగ్స్ వేస్తున్నారు. వారికి కనిపించే అంతంత మాత్రం చూపుతోనే వీటికి రంగులద్దుతున్నారు. ఇవి చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కూడా. పర్యావరణ హితమైన ప్రమిదలతోపాటు.. నేచురల్ ఫ్యాబ్రిక్‌తో కొవ్వొత్తులను తయారు చేస్తున్నారు. వీటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును విద్యార్థుల స్టడీ మెటీరియల్, ఆడియో మెటీరియల్, కాలేజీకి వెళ్లి వచ్చేందుకు ఖర్చులకు, పరీక్ష ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నారు. తమ ఫౌండేషన్ ద్వారా వలంటీర్ల సాయంతో పలు ఎగ్జిబిషన్లలో స్టాల్స్ పెట్టి వీటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అనిత. వీటిని కొనుగోలు చేయడం ద్వారా మీరూ వారి జీవితాల్లో వెలుగులు నింపినవారవుతారని అంటున్నారు అనిత. ఆర్డర్స్ కోసం 934866999, 9440049015 సెల్ నెంబర్లలో సంప్రదించొచ్చు.


అనిత, సాయినేత్ర ఫౌండేషన్ స్థాపకురాలు


anitha
ఆడపిల్లలకు కూడా ఇదే విధంగా ఆశ్రయం ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. ప్రస్తుతం అద్దె భవనంలోనే ఫౌండేషన్‌ను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం మేం చేస్తున్న సేవను గుర్తించి, ఫౌండేషన్‌కు కొంత స్థలాన్ని కేటాయించగలితే ఎక్కువమందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. వారికి అమ్మలా, ఓ కుటుంబంలా అండగా ఉంటున్నాం. ఇక్కడ ఆశ్రయం పొంది, ఉద్యోగాలు సంపాదించి కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతున్నవారిని చూస్తుంటే నా మనసు హాయిగా ఉంటుంది. అందుకే ఇంకా ఎక్కువమందికి సేవ చెయ్యాలనుకుంటున్నాం.


మా ఇల్లు గుర్తుకే రాదు..


harish
మాది అనంతపురం. చిన్నప్పటి నుంచి కంటిచూపు సమస్య ఉంది. వీళ్లందరూ చూపిస్తున్న ప్రేమతో నాకు ఇల్లు కూడా గుర్తుకురాదు. అంతబాగా చూసుకుంటారు. భోజనం, వసతులు బాగుంటాయి. ఇక్కడ మమ్మల్ని అందరినీ సమానంగా చూస్తారు. అనిత మేడం మాపై తీసుకునే కేరింగ్ మా అమ్మను మరిపిస్తుంది. ఈసారి కచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తా. మాకు ఆశ్రయమిచ్చిన అనిత మేడం రుణం తీర్చుకుంటా.
- హరీష్, అంధ విద్యార్థి.

...? డప్పు రవి విద్యాసాగర్

1032
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles