పర్వతాలే ప్రాణంగా..


Wed,August 8, 2018 01:28 AM

వైఫల్యం నుంచి నేర్చుకున్న పాఠాలే విజేతగా నిలబెడుతాయి.. ఒకసారి చావు అంచుల దాకా వెళ్లిన తర్వాత.. తిరిగి అక్కడకు చేరుకోవడానికి ఎవరైనా సంశయిస్తారు.. నీలిమ పూదోట పడి లేచిన కెరటంలా వైఫల్యం దగ్గరే విజయాన్ని వెతుక్కుంది.. జీవిత చరమాంకం అనుకున్న చోటే నిలిచి గెలిచింది.. భారత్ యావత్తు గర్వపడేలా మువ్వన్నెల జెండాను..ఎవరెస్ట్‌పై రెపరెపలాడించింది.. అంతేకాదు.. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించడానికి.. 350 మైళ్ల దూరాన్ని కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తింది.. ఇప్పుడు ఆమే.. ఎవరెస్ట్‌పై అభిమానాన్ని చాటేందుకు.. ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేసి.. అందరితో శెభాష్ అనిపించుకుంటున్నది.. మన హైదరాబాద్ నుంచి ఎవరెస్ట్ ఎక్కిన తొలి మహిళగా గుర్తింపు పొందిన.. ఆ మౌంటెనీర్ నీలిమ పూదోట పరిచయం ఇది. గడ్డ కట్టే చలి.. ఆక్సిజన్ కూడా సరిగా ఉండదు. చుట్టూ తెల్లని మంచు తప్ప పచ్చని ప్రదేశమే కనిపించదు. అలాంటివి సినిమా తెరమీద చూడడానికి బాగానే ఉంటాయి. కానీ నిజంగా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే సాహసమే చేయాలి. అదే చేసింది నీలిమ పూదోట. ఎవరెస్ట్ అంటే అత్యంత ఎత్తయిన శిఖరమనే అందరికీ తెలుసు. కానీ శిఖరం మీద మన జాతీయ జెండా ఎగురవేయాలని ఆశ పడింది. అది నిజం చేసింది. ఆ అనుభవాల్ని ఫ్రమ్ ఎవరెస్ట్ విత్ లవ్ పేరుతో పుస్తకాన్ని కూడా తీసుకొచ్చింది.
neelima

ఖాళీగా లేకుండా..

నాన్న ఆర్మీలో, అమ్మ జర్నలిస్ట్‌గా పనిచేసేవారు. ప్రతీ సంవత్సరం చిన్న చిన్న టూర్లకు వెళ్లేవాళ్లు. నాలుగేండ్లకోసారి పెద్ద ట్రిప్ వేయాల్సిందే! మామూలుగా అయితే తండ్రికూతుళ్లకి ఒక అలవాటు ఉండేది. ఒకసారి నడక మొదలుపెడితే మైళ్లు.. మైళ్లు.. నడిచేవాళ్లు. అక్కడికి ట్రాన్స్‌పోర్టెషన్ ఉన్నా నడుక సాగించాల్సిందే! ట్రెకింగ్ కూడా చేయడం సరదా నీలిమకి. ఖాళీగా ఉండడం ఆమెకు అలవాటు చేయలేదు తల్లిదండ్రులు. యోగా, భరతనాట్యం, మ్యూజిక్.. ఇలా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం సాధించింది. ఉదయం ఐదు గంటలకు తన రోజు మొదలైతే.. రాత్రి పది అయితే కానీ పూర్తయ్యేది కాదు. ఎప్పుడూ చదువు, ఇతర కల్చరల్ యాక్టివిటీస్‌లో బిజీగా ఉండేది. పదవ తరగతి వచ్చాక అన్నింటికీ ఫుల్‌స్టాప్ పడింది. చదువు మీదే పూర్తి శ్రద్ధ పెట్టింది. బీటెక్ పూర్తయింది. ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో ఉద్యోగం.. జీవితం సాఫీగా సాగిపోతున్నది. అప్పుడే మళ్లీ తనకు నచ్చిన నృత్యంలో బిజీ అయిపోయింది. అటు నృత్యం.. ఆఫీసుతో క్షణం తీరిక లేకుండా ఉండేది.

మలుపు తిప్పిన ప్రయాణం..

ఎవరైనా పర్వతాలను కింద నుంచి చూసి వావ్ అనుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఆ చివరన తన అడుగు మోపాలని అనుకుంది. మొదటిసారి కాంచనగంగను చూసినప్పుడు ఆమె మెదడులో ఒక ఆలోచన తట్టింది. తండ్రితో ఆ పర్వతాన్ని అధిరోహిస్తానని చెప్పింది. దానికి ఆ తండ్రి.. అక్కడ ఆక్సిజన్ సరిగా ఉండదు. పర్వతారోహణ అంటే మాటలా? అంటూ మందలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ మాటలు ఆమె చెవిన పడలేదు. ఆ పర్వతంపైన కళ్లు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ బేస్ క్యాంప్‌కి వెళ్లి పర్వతారోహణ చేయాలంటే ఏం చేయాలి? అన్న విషయాలను కనుక్కొని వచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులను అడిగితే రారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరినీ చిన్న చిన్న పర్వతాలు ఎక్కడానికి పిలిచేది. ఎవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు కాదు. అయినా తనొక్కతే అలా కొన్ని ట్రెక్కింగులు చేసిన అనుభవం ఉంది.

కష్టాలు ఓర్చి..

పర్వతాలు ఎక్కాలంటే ప్రత్యేకంగా చదువాలని అర్థమైంది నీలిమకి. అందుకోసం కశ్మీర్‌లోని జవహర్ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో మౌంటెనీరింగ్ కోర్సులో జాయినయింది. ఫిజికల్ ఎగ్జామ్ అయిందంటే అప్పుడు ట్రైనింగ్ మొదలవుతుంది. అప్పటిదాకా జిమ్‌ల జోలికి వెళ్లిన రకం కాదు. యోగా వరకు ఓకే అనుకునేది. అలాంటిది చాలా కష్టాలకు ఓర్చి కోర్సు పూర్తి చేసింది. ఆ తర్వాత అఫర్వద్ గ్లాసర్ మొదట ఎక్కిన పర్వతం. ఇండియా-పాక్ బార్డర్‌లో ఈ పర్వతం ఉంటుంది. నాలుగువేల మీటర్ల ఎత్తులో ఈ పర్వతాన్ని ఎక్కడానికి రోప్ వే కూడా ఉంది. కానీ ఆ ప్రకృతి ఆస్వాదించడానికి షార్ట్ కట్ రూట్ వద్దనుకుంది. అలా మొదటి పర్వతారోహణ చేసింది. అప్పుడే ఎలాగైనా ఎవరెస్ట్ మీద కాలు మోపాలని నిర్ణయం తీసుకుంది.

అవగాహన కోసం..

నేను చిన్నప్పటి నుంచీ కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉండేదాన్ని. ఏదైనా చాలెంజింగ్‌గా తీసుకోవడం అలవాటు. అలానే మౌంటెనీరింగ్‌ను తీసుకున్నా. పర్వతాలు ఎక్కాలనుకునేవాళ్లు కచ్చితంగా వాటి గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదువాలి. క్యాన్సర్ అవగాహనా కోసం నేను చెప్పులు లేకుండా విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్లాను. ఎనిమిది రోజుల్లో ఈ ప్రయాణం పూర్తయింది. క్యాన్సర్ అవగాహన కోసమే ఇది పూర్తి చేశాను. ఇకముందు కూడా ఇలాంటి ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని అనుకుంటున్నా. ఈ పుస్తకాన్ని రాయడానికి ముందు నేను రెండు పుస్తకాలు రాద్దామని మొదలుపెట్టా. అవి ఆదిలోనే అంతమయ్యాయి. చివరకి అమ్మకి రాసిన ఆ ఉత్తరాలు, మెసేజ్‌లను అన్నీ కలిపి చేస్తే మంచి పుస్తకం తయారయింది. ఈ పుస్తకం ఈ రూపం రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది అంటున్నది నీలిమ.

నేను చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్‌లో ఉండేదాన్ని. ఏదైనా చాలెంజింగ్‌గా తీసుకోవడం అలవాటు. అలానే మౌంటెనీరింగ్ తీసుకున్నా. పర్వతాలు ఎక్కాలనుకునేవాళ్లు కచ్చితంగా వాటి గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదువాలి.

ప్రాణాలు పణంగా..

neelima1
2015లో మొదటిసారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కి చేరుకుంది నీలిమ. తెల్లని ఆ శిఖరం ఆమెను నిద్ర పట్టనివ్వకుండా చేసింది ఇన్ని రోజులు. ఎప్పుడెప్పుడు ఆ పర్వత అంచులను తాకుతానా అని ఊవిళ్లూరింది. ఆ సమయంలోనే అనుకోని ప్రమాదం. భూకంపం వచ్చి.. తనతో పాటు వచ్చిన చాలామంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మూడు రోజులకు నీలిమ ఆచూకీ దొరికింది. అంతగా ఇష్టపడిన ఎవరెస్ట్‌ని అధిరోహించలేదని బాధ పడింది. అది కసిగా మారింది. 2016లో ఆ పర్వతారోహణ చేసి దేశం గర్వించేలా చేసింది. అయితే అక్కడికి వెళ్లే ముందు తల్లితో తనకోసం కొటేషన్స్ రాసి ఇవ్వమంది. కానీ తల్లి బిజీగా ఉండడంతో ఆ పనిచేయలేకపోయింది. అప్పుడు ఆమె.. నీలిమనే అక్కడ పర్వతారోహణ చేసే సమయంలో తన అనుభవాల్ని రాసి తీసుకురమ్మంది. అలా రాసింది ఒక పుస్తకంగా పబ్లిష్ చేస్తానని ఆ రోజు అనుకోలేదు. ఆమె రాసిన పుస్తకమే ఇప్పుడు అందరితో మన్ననలు అందుకుంటున్నది.

సౌమ్య నాగపురి
చిన్న యాదగిరి గౌడ్

933
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles