ప్రతిభకు వారసురాలు


Mon,July 31, 2017 01:37 AM

గౌరవ ప్రతిష్టలు కలిగిన వ్యాపార కుటుంబం గోద్రెజ్. వాణిజ్య ప్రపంచంలో గోద్రెజ్ సంస్థకు ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. అలాంటి కంపెనీకి వారసత్వ నియామకం అంటే మాటలు కాదు. 4.1 బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్తులో వచ్చే ఆటుపోట్లను తట్టుకునే శక్తి ఉండాలి. సుమారు 28 వేల మంది ఉద్యోగులను ఒక్క తాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ నిసాబా గోద్రెజ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. మే 10, 2017న పదవీ బాధ్యతలు చేపట్టిన నిసాబా నాయకత్వం కింద గోద్రెజ్ మరింత బలపడింది. కేవలం రెండు నెలల్లోనే సంస్థలో తనదైన ముద్ర వేసిన నిసాబా సక్సెస్‌మంత్ర ఇది.
MONDAY
సరిగ్గా నూటా ఇరవై సంవత్సరాల క్రితం మధ్య ముంబైలోని ఒక చిన్న షెడ్డులో తాళాలు తయారు చేసే కంపెనీ మొదలైంది. దాని పేరు గోద్రెజ్. 1897లో చిన్న మొక్కగా పురుడు పోసుకున్న గోద్రెజ్ సంస్థ ఈ రోజు మహావృక్షమై వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా విస్తరించింది. దీని వెనుక తరాల కృషి ఉంది. కుటుంబ వారసులే పాలనా పగ్గాలు చేపట్టి, కుటుంబ గౌరవానికి ఏ ఢోకా రానీయకుండా వాణిజ్య ఉత్పత్తుల్ని విక్రయిస్తూ గోద్రెజ్‌ను అంతర్జాతీయ స్థాయి బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఇవాళ సంస్థ టర్నోవర్ 4.1 బిలియన్ డాలర్లు. ప్రపంచ కుబేరుల్లో వారిది 405వ స్థానం. సుమారు 28 వేల మంది ఉద్యోగులు. ఇంతటి వ్యాపార సామ్రాజ్యానికి కొత్త వారసురాలుగా నిసాబా నియమితురాలై తన ప్రతిభను చాటుకుంటున్నారు.

వ్యూహాల్లో మేటి

కంపెనీ లాభాలు ఆర్జించడానికి అవసరమైన వ్యూహాలను రచించడంలో నిసాబాది అందె వేసిన చేయి. విదేశాల్లో కంపెనీల కొనుగోళ్ల ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు కంపెనీ అనుసరిస్తున్న లీప్‌ఫ్రాగ్ వ్యూహంలో నిసాబాదే కీలక పాత్ర. 2007లో ప్రవేశపెట్టిన ఈ వ్యూహం అనంతరం జీసీపీఎల్ మార్కెట్ విలువ 20 రెట్లు పెరిగి రూ. 3,000 కోట్ల నుంచి రూ. 60,000 కోట్లకు చేరుకోవడంలో ఆమె నిర్ణయాలు చక్కగా దోహదపడ్డాయి.

అనుభవం నుంచే పాఠాలు

అపర కుబేరుడైన ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా ఒకరు. అందరిలా దూకుడుగా వ్యవహరించకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్న పేరుందామెకు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి.. నెమ్మదిగా నిర్ణయం తీసుకునే తత్వం ఆమెది. అనుభవం సంపాదించే వరకూ పని నేర్చుకోవడంలో ఆసక్తి చూపే స్వభావం నిసాబా సొంతం. అలా అనుభవ నైపుణ్యాలను, వ్యాపార లాఘవాన్నీ ఒడిసి పట్టుకున్న నిసాబా పదేళ్ల కిందట కుటుంబ వ్యాపారంలోకి దిగారు. కార్పొరేట్ స్ట్రాటజీస్, హ్యూమన్ క్యాపిటల్ ఫంక్షన్స్ వ్యవహారాలను చూశారు. నిసాబా 2011 నుంచి సంస్థ డైరెక్టర్ల బోర్డులో పనిచేస్తున్నారు. గడచిన పదేండ్లలో జీసీపీఎల్ వ్యూహాత్మక, పరివర్తనలో మెరుగైన వృద్ధిని సాధించడంలో నిసాబా కీలకపాత్రనే పోషించారు.

లాభాలవైపు పయనం

వినియోగదారుల వస్తువులు, రియల్ ఎస్టేట్, గృహోపకరణాలు, వ్యవసాయ రంగంతో సహా వివిధ రంగాలలో సేవలందిస్తున్న గోద్రెజ్ గ్రూప్‌లోని ప్రధాన సంస్థ జీసీపీఎల్. 2007లో ప్రారంభమైన సంస్థ అభివృద్ధిలో నిసాబా మాస్టర్ మైండ్ కీలకం. ముఖ్యంగా దేశీయ సేంద్రియ వృద్ధి ఆవిష్కరణ, స్థిరీకరణ ద్వారా సంస్థను పరుగులు పెట్టించారు. అదే సమయంలో భారతదేశం బయట అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా జీసీపీఎల్ ప్రపంచ వ్యాప్తమైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్న నిసాబా గత దశాబ్దంలో కంపెనీ వ్యూహం, పరివర్తనలో కీలక పాత్ర పోషించి సంస్థను లాభాల బాట పట్టించారు.

సమర్థతకు పట్టం

గోద్రెజ్ గ్రూపులో కొత్తతరం చేతిలోకి వెళ్లిన రెండో సంస్థ జీసీపీఎల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోద్రెజ్ ప్రాపర్టీస్ చైర్మన్‌గా ఆది గోద్రెజ్ కుమారుడు పిరోజ్ షా బాధ్యతలు చేపట్టారు. ఆది గోద్రెజ్ ముగ్గురు సంతానంలో నిసాబా రెండవ వారు. పెద్ద కుమార్తె తాన్య దుబాష్ గోద్రెజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, చిన్న కుమారుడు ఫిరోజ్ షా గోద్రెజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వారిద్దరినీ కాదని నిసాబాకు పట్టం కట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఆమె చేసే ప్రతి పనిలో స్పష్టత ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా, ఒక పనిపట్ల చక్కటి రోడ్‌మ్యాప్ రూపొందించుకుని ముందుకు వెళ్లడం అలవాటు చేసుకుంది. ఇంత పెద్ద వ్యాపారాన్ని నడిపించేందుకు అలాంటి వ్యూహం అవసరంఅని ఒక సందర్భంలో చెప్పారు ఆది గోద్రెజ్. ఆమె నాయకత్వం కింద గోద్రెజ్ మరింత బలపడింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్‌లో మంచి ర్యాంకు సంపాదించింది మా సంస్థ.. అని అన్నారు. సంస్థ విలువల్ని కాపాడటంలో ఆమె స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తుంది అనేది ఆది గోద్రెజ్ మాట. అందుకే ఆమెకు పట్టం కట్టి సింహాసనాన్ని అధిష్టింపజేశారు.

చదువు, కుటుంబం

1978లో జన్మించిన నిసాబా యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్‌లో బీఎస్సీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుడు కల్పెష్ మెహతాను వివాహం చేసుకున్నారు. ఈమెకు ఒక కుమారుడు ఉన్నాడు. నిసాబా గోద్రెజ్ చదువు, వ్యాపార బాధ్యతలు నిర్వహిస్తూనే తీరిక వేళల్లో స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఆమెకు గుర్రపుస్వారీ, పర్వతారోహణ అంటే ఆసక్తి ఎక్కువ.

చిన్న వయస్సులో పెద్ద బాధ్యత

దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన గోద్రెజ్ గ్రూప్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా ఎంపికైంది నిసాబా గోద్రెజ్ (ఆఫీసులో పిలిచే పేరు నిసా). దీంతో పెద్ద కంపెనీకి అధిపతిగా వ్యవహరిస్తున్న అతి చిన్న వయస్కురాలిగా ఆమె నిలిచారు. తన తండ్రి క్రమశిక్షణ, ఫలితాలపై దృష్టి, వినయపూర్వకమైన విధానం తమ గ్రూపు డీఎన్‌ఏలో ఎల్లప్పుడూ ప్రధానంగా ఉంటుందని నిసాబా వ్యాఖ్యానించారు. జీవితం అనేది మారథాన్ కాదు. నడక లాంటిది అంటారు నిసాబా.

యువతరానికి పెద్దపీట

మొన్నటి దాకా గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (జీసీపీఎల్) విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిసాబా కంపెనీ లాభాలు ఆర్జించడంలో కీలకమైన నిర్ణయాలెన్నో తీసుకున్నారు. గోద్రెజ్ సంస్థకు కీలకమైన ఈ 9 వేల కోట్ల పైచిలుకు విభాగంలో ప్రతిభకు పట్టం కట్టడం, కొత్త ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టడం గడిచిన దశాబ్ద కాలంలో ఆమె సాధించిన ఘన విజయం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలలో కేశ సంరక్షణ, సబ్బులు, క్రిమికీటకాల నివారణ ఉత్పత్తులపై దృష్టి పెట్టి సంస్థను ముందుకు ఉరికించారు. అలాగే జిసిపిఎల్‌లో గతంలో ఉద్యోగుల సగటు వయసు 40 ఏళ్లు పై మాటే. అయితే, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహంతో నిసాబా ప్రతిభావంతులైన యువతను ఆహ్వానించారు. సంస్థలో ఉద్యోగుల సగటు వయసును 35-36 ఏళ్లకు తగ్గించేశారు.

సామాజిక సేవలోనూ

తమ కుటుంబానికి పేరు ప్రతిష్టలు తేవడంతో పాటు సామాజిక సేవలోను నిసాబా ముందున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయాల్లో గోద్రెజ్ కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులను కేటాయిస్తున్నది. గోద్రెజ్ నిర్వహణలో ఫిరోజ్‌షా గోద్రెజ్ ఫౌండేషన్, సోనాబాయ్ గోద్రెజ్ ఫౌండేషన్, గోద్రెజ్ మెమోరియల్ ట్రస్ట్‌లలో నిసాబా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. సమాజం నుంచి ఎంతో సంపాదించిన తమ కుటుంబం తిరిగి ప్రజలకు ఎంతో కొంత ఇవ్వాలన్న సూత్రాన్ని నిసాబా పాటిస్తు న్నారు. నాకు బాలికలను చదివించడం అంటే ఇష్టం. కుటుంబం, దేశం సాధికారత సాధించాలంటే ముందు బాలికలు బాగా చదువుకోవాలి.. నిసాబా గోద్రెజ్. టీచ్ ఫర్ ఇండియా సంస్థలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారీమె. దేశవ్యాప్తంగా పేదల చదువు కోసం పనిచేస్తున్నదీ సంస్థ.
వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి లాభాలను ఆర్జిస్తూనే సామాజిక సేవ వైపు కూడా దృష్టి సారించిన నిసాబా పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన నిసాబా 120 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్‌కు నిజమైన ప్రతిభగల వారసురాలు.

పర్సనల్ టచ్

MONDAY-2
పేరు : నిసాబా గోద్రెజ్
బాధ్యతలు : గోద్రెజ్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్
వయసు : 39 ఏళ్లు
చదువు : వార్టన్ స్కూల్‌లో బీఎస్సీహార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ
తల్లిదండ్రులు : ఆది గోద్రెజ్, పరమేశ్వర్ గోద్రెజ్
భర్త : కల్పేష్ మెహతా
కుమారుడు : జొరాన్
అభిరుచులు : గుర్రపు క్రీడలు, పర్వతారోహణ, సామాజిక సేవ

263
Tags

More News

VIRAL NEWS